For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

మునుగోడులో వేడెక్కిన రాజకీయాలు... గెలుపెవరిది ?

12:31 PM May 13, 2024 IST | Sowmya
Updated At - 12:31 PM May 13, 2024 IST
మునుగోడులో వేడెక్కిన రాజకీయాలు    గెలుపెవరిది
Advertisement

మునుగోడులో ఉప ఎన్నికకు వేళ దగ్గర పడుతున్నకొద్దీ రాజకీయాలు, ఎత్తుగడలు వేడెక్కుతున్నాయి. నవంబర్ ఒకటో తేదీ సాయంత్రంతో ప్రచారానికి తెర పడింది. మూడో తేదీన ఎన్నిక జరగనుంది. అన్ని పార్టీల నాయకుల్లోనూ ఉత్కంఠ పెరిగింది. ప్రచారం ముగిసిన తరువాత వుండే నిశ్శబ్దం రాజకీయ పార్టీల నాయకులకు మహా భయంకరమైన సమయం. ఏదేమైనా గెలుపును చేజిక్కించుకుని పీఠాన్ని అధిష్టించుకోవాలనీ, తద్వారా ప్రజల్లో ప్రాబల్యాన్ని పెంచుకోవాలనే తపన రాజకీయ పార్టీల్లో అంతకంతకూ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున నగదు పట్టుబడుతోంది. గతంలో జరిగిన హుజురాబాద్ ఎన్నికలతో పోలిస్తే ప్రస్తుత మునుగోడు ఎన్నికలను అన్ని పార్టీలు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు తెలుస్తుంది.

ఇప్పటికే కోట్లాది రూపాయల నోట్ల కట్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు, తాజాగా శనివారం మణికొండ పరిధిలోని నార్సింగి వద్ద మరో కోటి రూపాయల నగదును సీజ్ చేశారు. ఈ ఘటనలో సంబంధం వున్నట్టుగా భావిస్తున్న కొంత మంది పరారీలో వున్నారని పోలీసులు ప్రకటించారు. వీరితో పాటు పరారీలో వున్న మరో వ్యక్తి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఓటర్లను ఆకర్షించేందుకు కొన్ని పార్టీలు మద్యం, డబ్బులను కూడా పంచుతున్నాయి. అయితే, ఇలా పెద్ద మొత్తంలో డబ్బును, మద్యంను తరలించి తమను కొనుక్కోవాలని చూస్తున్న రాజకీయ పార్టీలపట్ల ఓటరు ఎలాంటి తీర్పునిస్తాడనే విషయంలో తుది తీర్పు తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే...!

Advertisement GKSC

ఇకపోతే, ఈ నేపథ్యంలోనే ఒక పార్టీ నేతలను మరో పార్టీ కొనేందుకు చూస్తోందనే ప్రచారం ఈమధ్య విస్తృతంతా జరిగింది. దానితోబాటు ఒక పార్టీ నేత మరో పార్టీలో వున్న వయసు మళ్లిన నేతతో ఫోన్లో మాట్టాడుతూ 'నువు పక్కకి తప్పుకో'మంటూ మాట్టాడిన మాటలు లీకై బయటకు రావడం కూడా కలకలం రేపింది. అయితే, ఇలాంటి రాజకీయ ఎత్తుగడలు ఎప్పుడూ మామూలే అయినా, మునుగోడు విషయానికొచ్చేటప్పటికి ఇది పరాకాష్టకు చేరుకుంది. నిన్న ఇరు పార్టీల కార్యకర్తల (TRS vs BJP) మధ్య గొడవ పెరిగి రాళ్లు , కర్రలతో కొట్టుకున్న సంఘటనలను మనం చూసాము. కానీ ఈ గెలుపు అన్ని పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారడమే ఇందుకు ప్రధానమైన కారణం. బి.ఆర్.ఎస్., బి.జె.పి., కాంగ్రెస్ పార్టీల మధ్య పోటీ హోరాహోరీగా సాగుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లో మునుగోడు అధికార పీఠం ఎవరికి దక్కుతుందనేది సర్వత్రా ఉత్కంఠను రేపుతోంది. చూద్దాం... ఈ నెల 6వ తారీఖున ఏ పార్టీ మునుగోడులో జెండా ఎగరవేస్తుందో చూడాలి ? మీరేమంటారు ? మునుగోడులో ఏ పార్టీ గెలుస్తుంది ? ఎందుకు గెలుస్తుంది ? మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.

ప్రత్యేక కధనం by జర్నలిస్ట్ అన్నమయ్య

Advertisement
Author Image