'సర్దార్' సినిమాని తెలుగులో విడుదల చేస్తున్నందుకు చాలా గర్వంగా వుంది : కింగ్ నాగార్జున
హీరో కార్తి, అభిమన్యుడు ఫేమ్ దర్శకుడు పిఎస్ మిత్రన్ కాంబినేషన్ లో ప్రిన్స్ పిక్చర్స్ బ్యానర్ పై ఎస్ లక్ష్మణ్ కుమార్ నిర్మిస్తున్న స్పై యాక్షన్ థ్రిల్లర్ 'సర్దార్'. సర్దార్‌లో రాశి ఖన్నా , రజిషా విజయన్ కథానాయికలు. దీపావళి కానుకగా అక్టోబర్ 21న ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో విడుదలౌతుంది. అన్నపూర్ణ స్టూడియోస్ ఈ సినిమాని తెలుగు రాష్ట్రాలలో భారీగా విడుదల చేస్తోంది. కింగ్ అక్కినేని నాగార్జున ముఖ్య అతిధిగా ఈ చిత్రం ప్రీరిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. ఈ వేడుకలో కార్తి చిత్రంలోని 'నేనే సేనాపతి' పాటకు వేదికపై మాస్ డ్యాన్స్ చేయడం అందరినీ అలరించింది.
కింగ్ నాగార్జున మాట్లాడుతూ.. కార్తితో ఊపిరి సినిమా చేశాను. అప్పటి నుండి కార్తితో అనుబంధం మొదలైయింది. అన్నపూర్ణ స్టూడియోస్ సర్దార్ ని ప్రజంట్ చేస్తున్నందుకు చాలా గర్వంగా వుంది. ట్రైలర్ అదిరిపోయింది. ఈ సినిమా చేసినందుకు కార్తి గర్వపడుతున్నానని చెప్పారు. కార్తి అన్న సూర్య సూపర్ స్టార్. ఆ సూపర్ స్టార్ నీడ నుండి బయటికి వచ్చి ప్రూవ్ చేసుకోవడం చాలా అరుదు. అలాంటి వాళ్ళని ఇద్దరినే చూశాను.
ఇక్కడ మెగాస్టార్ తమ్ముడు పవన్ కళ్యాణ్.. కన్నడలో శివన్న తమ్ముడు పునీత్ రాజ్ కుమార్.. తమిళనాడులో సూర్య తమ్ముడు కార్తి. ఇలా స్టార్ డమ్ సంపాయించడం మామూలు విషయం కాదు. కార్తి చాలా వైవిధ్యమైన సినిమాలు చేసి సూర్య అంత సూపర్ స్టార్ అయ్యారు. కార్తి తెలుగులో మాట్లాడటమే కాదు పాటలు కూడా పాడుతాడు. తెలుగు మాట్లాడేవాళ్ళని మనం వదలం. అభిమన్యుడు ఫేం పిఎస్ మిత్రన్ అద్భుతమైన దర్శకుడు. సర్దార్ ని కూడా గొప్పగా తీసుంటాడని నమ్ముతున్నాను. అక్టోబర్ 21న అందరూ థియేటర్ లో 'సర్దార్' చూసి ఎంజాయ్ చేయాలి'' అని కోరారు.