Ayyappa Mala : ఒక్క అయ్యప్ప దీక్ష.. కోట్లాది మందికి భిక్ష
BHAKTHI NEWS : మీరు చదివింది నిజమే. ఒక్క అయ్యప్ప వందలు కాదు వేలు కాదు లక్షలు లక్షలాది ఆ మాటకొస్తే కోట్లాది మందికి భిక్ష పెడుతున్నాడు. ఇవాళ్రేపు అమేజాన్ గ్రేట్ ఇండియన్ మార్కెట్ సేల్ ఆన్ లైన్ ద్వారా చేస్తోందేమోకానీ.. వందల ఏళ్ల నాడు ఉద్భవించిన అయ్యప్ప.. దక్షిణాది రాష్ట్రాల్లోని ఎన్నో పురాతన ఆలయాల్లోని దేవుళ్లను ఈ భక్తజనం అస్సలు పట్టించుకోని.. తమ జీవితంలో ఎప్పటికీ చూడలేని దేవతామూర్తులందర్నీ పేరు పేరునా గుర్తు చేస్తున్నాడు. వాళ్లనే నమ్ముకుని జీవిస్తున్న వాళ్లందరికీ అంత భిక్ష పెడుతున్నాడు. తనకే మాత్రం సంబంధం లేకున్నా.. దారి చూపుతున్న దేవుడవుతున్నాడు.
అందుకే అనేది ఒక్క అయ్యప్ప దీక్ష ఎందరికో భిక్షండీ భిక్ష. మొదట మాలధారణ నుంచీ మొదలు పెడతాం. తులసి మాలలు అన్నవి ఒకటుంటాయని నేటి తరానికి తెలిసేదే అయ్యప్ప ద్వారా. ఇలాంటి పూసల పనులు చేసే కళాకారులకు అయ్యప్ప నిజంగా దేవుడే. లేకుంటే అయ్యప్ప దీక్ష లేకుంటే వీళ్ల బతుకులేం కాను ?
ఇక పోతే వస్త్రవ్యాపారం. నిజానికి నవంబర్ లో దీపావళి దాటాక తిరిగి జనవరిలోగానీ వస్త్ర వ్యాపారాలు ఊపందుకోవు. మూడు నెలల పాటు.. జనం చలిగిలితో గజగజలాడుతూ చాలా చాలా అనీజీగా ఉంటారు. ఈ సమయంలో వస్త్ర కొనుగోళ్లు- అమ్మకాలు అంతంత మాత్రం. అలాంటి పరిస్థితుల్లో వస్త్రవ్యాపారుల పాలిట కొంగు బంగారం అయ్యప్ప. ఈ సీజన్లో సేల్ అయ్యే వస్త్రాలేవైనా ఉన్నాయా? అంటే అవి అయ్యప్ప నల్లటి వస్త్రాలే. ఈ మార్కెట్ ఎంత పెద్దదో చెప్పనలవి కాదు.
కిరాణా మార్కెట్ సంగతి సరే సరి. కిరాణా ఎందుకు? అంటే అయ్యప్ప సీజన్లో ఎన్నో ఆలయాల్లో రోజూ భిక్ష- అల్పాహారం పెడతారు. ఈ సీజన్లో కిరాణా వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలే కాస్తుంది. అంతగా అయ్యప్ప స్వాముల భిక్ష సాగుతుంది. ఈ భిక్ష కోసమంటూ కిరాణా సరుకులు కొంటుంటారు. ఈ కొనుగోళ్లు ఆయా వ్యాపారులకు సిరుల పంటే.
నలభై ఒక్కరోజుల సాత్వికాహారం పుణ్యమాని.. కూరగాయలూ- పండ్లూ- పలహారాల షాపులు కళకళలూ గలగలలే. అప్పటి వరకూ మాంసాహారం పోటీ కారాణంగా డీల పడ్డ కూరగాయల- పండ్ల దుకాణాలు ఒక్కసారిగా ఊపందుకుంటాయి. కొన్ని ఆలయాలు దీక్ష జరిగినన్ని రోజులూ భక్తి భజన బృందాలను ఏర్పాటు చేస్తాయి. ఈ సమయంలో ఎందరో భజన కళాకారులకు కావల్సినంత గిరాకీ. అయ్యప్ప దీక్ష అన్నదే లేకుంటే ఇంతగా భజనలు చేయించుకునే వాళ్లే ఉండరు. అంతగా భజన పాటలను మరచి పోయిందీ సమాజం. దీంతో భజన బృందాలకు తగిన గిరాకీ.
కొన్ని ఆలయాలు మండల దీక్ష ఆఖరి రోజుల్లో ఊరేగింపులు నిర్వహిస్తుంటాయి. ఈ క్రమంలో గజారోహణం- కీలుగుర్రాలు- చిత్ర విచిత్రమైన వేషధారులను పిలిపిస్తుంటారు. ఈ సమయంలో అయ్యప్ప స్వామి పేరున వీళ్లందరికీ నాలుగు డబ్బులు రాల్తాయ్. ఇదంతా ఒకెత్తయితే.. అయ్యప్పతో ఏ మాత్రం సంబంధం లేని ఎందరో దేవుళ్లు- వాళ్లుండే ఆలయాలు. ఆంధ్ర- తెలంగాణ- కర్ణాటక- కేరళ బేధాల్లేవ్- ఆయా ప్రాంతాల్లోని ఆలయాలకు అయ్యప్ప భక్తుల రాకడ కావల్సినంత హుండీ ఆదాయం. అంతేనా! ఆయా ప్రాంతాల్లోని వ్యాపారాలెంత గొప్పగా సాగుతాయంటే అంత. కోట్లల్లో వ్యాపారం. లక్షల్లో ఆదాయాలు. వందలాది బతుకుల్లో కళాకాంతి.
లేకుంటే భవానీలో ఒక సొంతింటి యజమాని. తనకున్న ఇళ్లను కేవలం బాత్రూమ్ లుగా మార్చేస్తాడు. ఈ సీజన్లో లక్షలాది రూపాయలు కేవలం బాత్రూములను అద్దెకివ్వటం ద్వారా సంపాదిస్తాడు. ఇక ఇలాంటి అంతగా గుర్తింపులేని చిన్నా చితకా వ్యాపారాల గురించి చెప్పనలవి కాదు. సులభ్ కాంప్లెక్స్ తరహా ఓ లెట్రిన్ బాత్రూం పెట్టుకున్నా చాలు ఈ సీజన్లో డబ్బే డబ్బు.
ఎక్కడో కన్యాకుమారికీ మరెక్కడో అయ్యప్పకూ సంబంధమేంటి? ఈ సీజన్లో కన్యాకుమారి వ్యాపారులకు కాసుల పంటే. అంతగా అయ్యప్ప భక్తజనం పోటెత్తుతుంది. ఎందరో వీధి వ్యాపారులకు సిరుల పంట. ఆఖర్న బిచ్చగాళ్లు కూడా దర్జాగా బతుకుతారంటే అదంతా అయ్యప్ప దీక్ష పెట్టే భిక్షే. కేరళలో ఈ సీజన్లో డబ్బు లెక్క పెట్టడానికే టైం సరిపోదు. అంతగా సంపాదించే వ్యాపారులుంటారు. వీళ్లలో ఎందరో ముస్లిం- క్రిస్టియన్లుంటారు. హిందూ- ముస్లిం- క్రిస్టియన్ బేధాలను మరచి మరీ.. అయ్యప్ప నామ మహిమ ద్వారా వీళ్లంతా బతుకునీడ్చుతుంటారు.
ఇక నలభై ఒక్కరోజుల తర్వాత ఆఖరుగా ప్రయాణం- ఇందుకోసం.. కార్లు- బస్సులు- వ్యాన్లు ఇలా రకరకాల వాహనాలకు ఎంత డిమాండ్ అంటే అంత. లక్షలాది రూపాయల లాభాలను ఆర్జించి పెడుతుంది ట్రావెల్ బిజినెస్. ఈ మొత్తం కొన్ని కోట్లల్లో ఉంటుందంటే అతిశయోక్తి కాదు. ఒక్కొక్కరూ ఒక్కో రూట్ ఎంపిక చేసుకుంటారు. కొందరు భక్తులు హైదరాబాద్ నుంచి మంత్రాలయం అటు నుంచి ఒక్క కర్నూలు జిల్లాలోనే మహానంది- యాగంటి- అహోబిలం- శ్రీశైలం అంటూ ఐదారు క్షేత్రాలను సందర్శించిగానీ బయట పడరు. నిజానికి ఈ జిల్లాలో ఇన్నేసి దివ్యక్షేత్రాలున్నాయని అయ్యప్ప యాత్ర ద్వారా కానీ తెలీదు.
కాణిపాకం- వేలూర్ గోల్డెన్ టెంపుల్- భవానీ- గురువాయూర్- త్రివేండ్రం- చోటానిక్కర- ఎరుమేలి- పంబ- సన్నిధానం. తర్వాత తిరుగుటపాలో కన్యాకుమారి- రామేశ్వరం- మధుర- పళని- కంచి- తిరుత్తణి అంటూ తమిళనాడులోని సుప్రసిద్ధ ఆలయాలన్నిటినీ సందర్శిస్తారు. కొందరైతే ఇంత దూరం వచ్చాం కదాని.. అరుణాచలేశ్వరుడ్ని దర్శించుకుంటారు. మరికొందరు తంజావూర్- చిదంబరం- కుంభకోణం అంటూ తాము అప్పటి వరకూ వికీపీడియాలో బట్టీ పట్టిన ఆలయాలన్నిటినీ చుట్టేస్తుంటారు. కుంభకొణంలో ఇన్నేసి ఆలయాలున్నాయా? మనమంతా టెంపుల్ టౌన్ గా కంచిని భావిస్తుంటాం. కానీ కుంభకోణంలో లెక్కలేనన్ని ఆలయాలు.
కొందరి రూటే సపరేటు. హైదరాబాద్ లో మొదలై.. మహబూబ్ నగర్ లో జోగులాంబ దర్శనం చేసుకుని అటు నుంచి రాయచూర్ మీదుగా హంపి- తర్వాత శృంగేరి- ఆ తర్వాత ఉడుపి- కొల్లూర్- మాంగళూర్- హోర్నాడు- కుక్కి- దర్మస్థళ- అలా. కొండల మీదుగా శబరిమల. ఈ ప్రాంతాన్ని మలనాడు అంటారు. ఈ ప్రాంతం దక్షిణాదికే స్వర్గధామం లాంటిది. ఇక్కడి ప్రకృతి అందాలను చూడ్డం అంటే సాక్షాత్ దైవ దర్శనమే. కంటి నిండా పచ్చటి చెట్ల చల్లని నీడ- చెవుల నిండా గలగల పారే సెలయేటి గలగల. అలా ఈ ప్రపంచాన్ని మరచి పోయేలా చేసే ఈ క్షేత్ర సందర్శనం అమోఘం- అమేయం.
ఇలా దక్షిణాదిలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలన్నీ ఒక్క అయ్యప్ప సీజన్ లో సందర్శించేసి అపారమైన ఆధ్యాత్మికానుభూతి పొందడం ప్రతి భక్తుడు చేసే పని. దీని ద్వారా అప్పటి వరకూ ఎవరికీ పెద్దగా తెలియని ఎన్నో ఆలయాల గురించి తెలిసి నివ్వెర పోతుంటారు. కుర్తాళంలో ఇంత పెద్ద వాటర్ ఫాల్ ఉందా? రామేశ్వరంలో ఇన్నేసి బావుల స్నానాలు చేయాలా? మనకు హంపీలాంటి ఓ శిల్పకళా భాంఢాగారం ఉందా? శృంగేరి ప్రాకృతిక శోభ ఎంత గొప్పగా ఉందీ? హోర్నాడు మజిలీలో ఎన్నేసి మలుపులో. ఆ మడకెర వాసులు అంత ఎత్తున ఎంత ఆనందానుభూతి అనుభవిస్తున్నారో!! అనుకోకుండా ఉండలేరెవ్వరూ.
ఇలా చెప్పుకుంటూ పోతే లెక్కలేనన్ని వింత వింతలు. తలకావేరి అంటే ఏంటో తెలుసా? ఇదిగో తమిళ- కన్నడ ప్రజల మధ్య ఎన్నో వివాదాలకు కారణమైందే.. ఆ కావేరీ నది జన్మస్తలం. అదిగో అదే.. కూర్గ్ కాఫీ తోటల కోట.. అంటూ భక్త ప్రయాణికుల ముచ్చట్లు అన్నిన్ని కావు. ఏవండీ అయ్యప్ప అంటే దేవదేవుడు. తనకన్నా ముందు ఎన్నో తరతరాల నుంచి ఈ భూమ్మీద- మరీ ముఖ్యంగా కర్మభూమిగా పేరున్న ఈ దక్షిణ భారతావని మీద కొలువు దీరిన దేవతా మూర్తుల గురించి తిరిగి చాటి చెబుతున్న డివోషనల్ బ్రాండ్ అంబాసిడర్. అధునాతన ఆధ్యాత్మిక దైవ ప్రతినిధి.
అయ్యప్ప దీక్షలో భాగంగా చాలా మంది తప్పుడు దారులు తొక్కుతున్నారు. అయ్యప్ప దీక్షలో మద్యమాంసాలకు దూరంగా.. ధూమపానం అసలే చేయకుండా.. ఎంతో పవిత్రంగా ఉండాలి. కానీ ఆ మాటే మరుస్తున్నారు. కామ క్రోధ మద మాత్సర్యాలనే అరిషడ్ వర్గాలు మహిషి- అంగాంగాలు. ఈ అంగాంగాలను నలభై ఒక్క రోజుల దీక్ష అనే ఆయుధ సంపత్తితో తునాతునకలు చేసినప్పుడే అసలు సిసలైన అయ్యప్ప దదర్శనం లభించేది.
అలా చేయటం మరచి తమ ఆవేశకావేశాలను నియంత్రించుకోకుండా ఎన్నిసార్లు దీక్ష చేపట్టినా ఒక్కటే. అయ్యప్ప దీక్ష అంటే మనిషిలోని మహిషి సంహారం జరిగిననాడే. అది చేయండీ మీకు నిజమైన అయ్యప్ప తప్పక కనిపిస్తాడు. అలా స్వామి అయ్యప్ప తనను నమ్మిన భక్తులనే కాక.. తనకన్నా ముందు యుగయుగాల నుంచి కొలువుదీరిన దేవతలను తిరిగి ఈ నవ సమాజానికి పరిచయం చేస్తున్న అద్భుత దార్శనిక మూర్తి. అలాంటి అయ్యప్పకు మరోసారి..
స్వామియే శరణం అయ్యప్ప