BHAKTHI NEWS: యాత్రికులు, పర్యాటకులను కట్టిపడేసే అందాలు - నందనవన యాదాద్రి
తీరొక్క మొక్కలు.. రంగురంగుల పూలు.. కనుచూపు మేర పచ్చదనమే.. ఆ హరిత అందాలు చూపు తిప్పుకోనివ్వవు.! ఆ మొక్కల నుంచి వచ్చే సువాసనలు ఇట్టే ఆకట్టుకుంటాయి. మదిని ఆహ్లాదపరుస్తాయి.. తన్మయత్వాన్ని నింపుతాయి.. యాదాద్రి ఆధ్యాత్మిక క్షేత్రంగానే కాదు పర్యాటక ప్రాంతంగానూ అలరిస్తున్నది. ఎక్కడా ఖాళీ జాగ లేకుండా పచ్చని అందాలకు చిరునామాగా మారుతున్నది. ఇప్పటివరకు ఆలయ పునర్నిర్మాణ పనుల కోసం వైటీడీఏ రూ.850 కోట్ల వరకు ఖర్చుచేయగా.. పచ్చదనం కోసమే రూ.12.30 కోట్లు వెచ్చించింది. వచ్చే ఏడాది మార్చి 28 నుంచి మూలవరుల దర్శనభాగ్యం భక్తులకు కలుగనున్నది.
యాదాద్రి పుణ్యక్షేత్రం ఆధ్యాత్మికతతోపాటు పచ్చదనానికి నిలయంగా మారుతున్నది. ఆలయ పరిసరాల్లో 98 రకాలకు చెందిన 4.21 లక్షల మొక్కలు పెంచుతున్నారు. వివిధ జిల్లాల నుంచి ఆలయానికి సులభంగా చేరుకునేలా రహదారి విస్తరణ పనులతోపాటు ఆలయం చుట్టూ రింగ్ రోడ్డు పనులు చేపట్టారు. రోడ్లకు ఇరువైపులా పచ్చదనం పెంపుపై వైటీడీఏ దృష్టిసారించింది. వాహనాల రద్దీ కారణంగా కాలుష్య సమస్యలు తలెత్తకుండా రకరకాల మొక్కలు నాటారు. తూర్పుగోదావరి జిల్లా కడియం నర్సరీ నుంచే కాకుండా పుణె, కోల్‌కతా వంటి వివిధ ప్రాంతాల నుంచి ప్రత్యేకంగా తెప్పించిన సువాసన వెదజల్లే మొక్కలను గుట్టకు వెళ్లేదారిలో, ఆలయ పరిసరాల్లో, టెంపుల్ సిటీలో నాటారు. రాయగిరి నుంచి ఆరు కిలోమీటర్ల మేర రహదారి మధ్యలో, ఇరువైపులా అవెన్యూ ప్లాంటేషన్‌తోపాటు రకరకాల పూల మొక్కలు నాటి పచ్చదనం పెంపునకు తీసుకున్న చర్యలతో నేడు దారి పొడవునా ఆహ్లాదం నెలకొన్నది. ఇదే మార్గంలో రూ.2.8 కోట్లతో 56 హెక్టార్లలో ఏర్పాటుచేసిన ఆంజనేయ అరణ్యం, రూ.3.6 కోట్లతో 97 హెక్టార్లలో ఏర్పాటుచేసిన నరసింహ అరణ్యంలో ఆకట్టుకునేలా సౌకర్యాలు కల్పించారు. యాదగిరిగుట్ట పట్టణంలోకి ప్రవేశించినప్పటి నుంచి ఘాట్ రోడ్డు మీదుగా కొండ ఎక్కేవరకు రహదారికి ఇరువైపులా నాటిన మొక్కలు కనువిందు చేస్తున్నాయి. దేశ విదేశాల నుంచి వచ్చే భక్తులను ఆకట్టుకునేలా ఆలయ పరిసర ప్రాంతమంతా ఆహ్లాదం వెల్లివిరిసేలా అన్ని హంగులనూ కల్పిస్తున్నారు.
ప్రత్యేక ఆకర్షణగా టెంపుల్ సిటీ
---------------------------
యాదాద్రి లక్ష్మీ నృసింహస్వామి ఆలయం సమీపంలోని పెద్ద గుట్టపై 250 ఎకరాల్లో టెంపుల్ సిటీని అందంగా తీర్చిదిద్దుతున్నారు. భారీస్థాయిలో పూల మొక్కలు పెంచుతున్నారు. వీటి నిర్వహణ బాధ్యతను వైటీడీఏ తీసుకున్నది. 25 ఎకరాల్లో పార్కులు, ప్లాంటేషన్ చేపట్టారు. 60 రకాలకు చెందిన రెండు లక్షలకుపైగా మొక్కలతో అవెన్యూ ప్లాంటేషన్ చేపడుతున్నారు. పార్కులను తలపించేలా ఆలయ పరిసరాల్లో కార్పెట్ గ్రాస్‌ను ఏర్పాటు చేశారు.
గిరిప్రదక్షిణ దారిలో..
-----------------
స్వామివారి జన్మనక్షత్రం స్వాతి రోజున గిరి ప్రదక్షిణ చేసే భక్తులను ఆకట్టుకునేలా పూల మొక్కలు పెంచుతున్నారు. ఈ దారిలోనే ఉత్తర దిశలో వందల సంఖ్యలో పూల, సుగంధ పరిమళం వెదజల్లే మొక్కలను రావి ఆకు ఆకృతిలో పెంచడం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నది. పుణె నుంచి తెప్పించిన ప్రత్యేక మొక్కలను ఇక్కడ పెంచుతున్నారు. వీటి సంరక్షణ కోసం అటవీశాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నది.
టెంపుల్ సిటీతోపాటు ఆలయ పరిసరాల్లో పెంచుతున్న పండ్ల, పూల మొక్కలు.. మారేడు, అశోక, వేప, కాంచన, బిగ్నోనియా, బోగన్‌విల్లా, మోదుగ, సిసల్‌ఫిన్యా, రేలా, కొబ్బరి, కోనోకార్పస్, సబస్టోనికా, నాగలింగం, గుల్‌మెహర్, రుద్రాక్ష, ఉసిరి, ఫైకస్ బ్లాక్, ఫైకస్ పాండ, రావీ, జువ్వీ, మర్రి, ఫోక్స్‌టైల్ పామ్, నూరు వరహాలు, విప్ప, సంపంగి, మామిడి, ఆకాశమల్లె, పగోడా, కదంబ, గన్నేరు, పారిజాతం, కానుగ, సుజన, జమ్మి, ఎర్ర చందనం, అల్లనేరేడు, బాదం, తెల్ల చందనం, జట్రోఫా, భౌగైన్‌విల్లియా ఆల్ వెరైటీస్, లాంటానా, సిసల్‌పీనియా, ఆల్మండ్ ఎల్లో, ఐరిష్, నికోడియా, పెడానస్, ఫిజోనియా ఆల్బా