షర్మిల పార్టీ ప్రకటన తేది ఖరారు
వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూతురుగా రాజకీయాల్లోకి వస్తున్న వైఎస్ షర్మిల తన రాజకీయ అడుగులు వేగంగా వేయడానికి రెడీ అవుతున్నారు. ఇటీవల హైదరాబాద్ లో మీటింగ్ నిర్వహించిన షర్మిల ఇక అన్ని జిల్లాల్లోనూ వైఎస్ఆర్ అభిమానులను కలిసేందుకు రెడీ అయ్యారు.
షర్మిల తన పార్టీని ఏప్రిల్ 10న ప్రకటించనున్నట్లు సమాచారం. 2003లో ఇదే రోజున దివంగత వైఎస్ఆర్ చేవెళ్లలో ప్రతిష్టాత్మక పాదయాత్రను ఇదే రోజు ప్రారంభించారు. 2004లో కాంగ్రెస్ ను అధికారంలోకి తేవడానికి అదే బాటలు వేసింది.దీంతో అదే రోజు.. పార్టీని ప్రారంభించాలని.. చేవేళ్లలోనే ప్రారంభించాలని యోచిస్తున్నట్టు సమాచారం.
ఇక ప్రజలకు చేరువ కావడానికి చేవెళ్ల నుంచి షర్మిల పాదయాత్రను ప్రారంభిస్తారన్న చర్చ కూడా సాగుతోంది. ఇప్పటికే నల్లగొండ నేతలతో షర్మిల ఆత్మీయ సమ్మేళనం ముగిసింది. హైదరాబాద్కు దగ్గరగా ఉన్న ఉమ్మడి జిల్లాల ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించాలని షర్మిల భావిస్తున్నారు.
ఈ నెల 21న ఖమ్మం లేదా ఆదిలాబాద్ జిల్లాలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించనున్నారు. ఫిబ్రవరి ఆఖరులో హైదరాబాద్ ఉమ్మడి రంగారెడ్డి మహబూబ్నగర్లో ఒక జిల్లా సమావేశం ఉంటుందని తెలిసింది. అటు నగరంలో జరిగే ఆత్మీయ సమ్మేళనాలను లోటస్ పాండ్లో కాకుండే వేరొక చోట నిర్వహించాలని యోచిస్తున్నారు.