Salman Khan : సల్మాన్ ఖాన్ కు భద్రతను పెంచిన మహారాష్ట్ర ప్రభుత్వం... కారణం అదేనా !
Salman Khan : బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ దేశ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకొని స్టార్ హీరోగా కొనసాగుతున్నారు. కాగా సల్మాన్, ఆయన తండ్రిని బెదిరిస్తూ ఇటీవల ఆయన నివాసానికి గుర్తుతెలియని వ్యక్తుల నుంచి ఓ లేఖ వచ్చిన విషయం తెలిసిందే. రోజూ జాగింగ్ అయ్యాక సల్మాన్ కూర్చునే బెంచిపై ఈ లేఖ లభించినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. ‘‘త్వరలో సిద్ధూ మూసేవాలా లాంటి పరిస్థితే మీకు ఎదురవుతుంది’’ అంటూ దుండగులు ఆ లేఖలో బెదిరించారు. లేఖపై జి.బి, ఎల్.బి అనే అక్షరాలు ఉన్నాయి. దీంతో ఆ అక్షరాలను గోల్డీ బ్రార్, లారెన్స్ బిష్ణోయ్ పేర్లకు షార్ట్‌కట్‌గా పోలీసులు అనుమానించారు. అయితే ఈ లేఖను బిష్ణోయ్ ముఠానే పంపించిందా లేదా ఎవరైనా అతడి పేరుతో బెదిరింపులకు పాల్పడ్డారా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టి... లారెన్స్ బిష్ణోయ్ ఈ లేఖను పంపినట్లు తెలుసుకున్నారు.
ఇప్పుడు తాజాగా పలువురు బాలీవుడ్ ప్రముఖులకు మహారాష్ట్ర సర్కారు భద్రతను పెంచినట్టు తెలుస్తోంది. సల్మాన్ ఖాన్‌కు ప్రస్తుతమున్న భద్రతను పెంచి, వై ప్లస్ సెక్యూరిటీ ఇవ్వాలని మహారాష్ట్ర సర్కారు నిర్ణయించింది. ఇప్పటి వరకు ఆయనకు సాధారణ పోలీసు రక్షణ మాత్రమే ఉంది. వై ప్లస్ కేటగిరీలో ఆయుధాలు ధరించిన నలుగురు ఎప్పుడూ సల్మాన్‌ను కాచుకుని ఉంటారు. అలాగే, అక్షయ్ కుమార్, అనుపమ్ ఖేర్ లకు ఎక్స్ కేటగిరీ భద్రత ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ఎక్స్ కేటగిరీ రక్షణలో ముగ్గురు సాయుధ పోలీసులు ఎప్పుడూ రక్షణగా ఉంటారు. ప్రముఖ పంజాబీ గాయకుడు సిద్ధూ మూస్ వాలా హత్యకు ప్రధాన సూత్రధారి గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ అని ఢిల్లీ పోలీసులు వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలోనే వీరికి భద్రత పెంచినట్లు తెలుస్తుంది.

