SALAAR Movie Review : ఒక తెలుగువాడు హాలీవుడ్ తరహా విశ్వరూప విన్యాసం Review by Journalist Audi
సలార్ రివ్యూ :
సినిమా ఎలా ఉంది? అంటే ఇదే చిత్రంలో ఒక ముసలమ్మ పాత్ర ప్రభాస్ ను తాకి చూసి.. ఒక మాట అంటుంది.. ఇది నిజమేనా? అని. ఒక తెలుగువాడు హాలీవుడ్ తరహా విశ్వరూప విన్యాసం ఇందులో చూసే ప్రేక్షకులకు కూడా సరిగ్గా ఇలాంటి అనుభూతే తప్పక కలుగుతుందని చెప్పక తప్పదు. తెలుగు సినిమా స్వరూప స్వభావాలను పూర్తిగా మార్చివేసే కొందరంటే కొందరు దర్శకుల్లో ప్రశాంత్ నీల్ ఒకడు. కాదు ఒకే ఒక్కడుగా చెప్పాలి.. కొన్ని అంచనాల ప్రకారం.. ప్రశాంత్ నీల్ నమోదు చేస్తున్న ఈ చిత్రవిచిత్ర బీభత్సకాండను చూసి.. రాత్రిళ్లు నిద్ర పట్టని దర్శకులు చాలా మందే ఉండి ఉండొచ్చు.. సుకుమార్, రాజమౌళి వంటి దర్శకులు చెప్పే స్టోరీ టెల్లింగ్ కీ ఈ విధానానికి చాలా చాలా తేడా.. కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది.
మరీ ముఖ్యంగా ప్రస్తుతం ఫీల్డ్ ని ఏలుతున్న రాజమౌళికైతే, అస్సలు జీర్ణించుకోలేని విషయంగా ప్రశాంత్ నీల్ ప్రతిభ కావచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకూ రాజమౌళి ఒక అగ్ర దర్శకుడిగా ఉన్నాడంటే అందుకు కారణం.. కథకుడైన తండ్రి. తర్వాత అతడి ఇంటిల్ల పాది చేసే కృషి. ఇలాంటివేవీ లేకుండా ప్రశాంత్ నీల్ ఇలాంటి ఊహాజనిత గాథలను వరుస పెట్టున తెరకెక్కించడం అంత మామూలు విషయం కాదు. ఇలాంటి కథనాలను వండి వార్చడానికి ఒక బేస్ ఉంటుంది. ఆ బేస్ అతడు తన బాల్యంలో తన బామ్మ లేదా మామ్మలు చెప్పిన చిత్ర విచిత్రమైన కథలను అనుసరించి.. వాటి ద్వారా ఒక ఊహాజనితమైన కథా సృజన అబ్బి ఉండాలి.
ఇలాంటిదొకటి సాధ్యమవుతుందా? అని చూస్తే.. మా చిన్నప్పుడు మునెమ్మ అనే ఒకానొక మహిళ రాత్రిళ్లు మాకు అప్పటి వరకూ మేము వినని.. కనీ వినీ ఎరుగని.. భయానకమైన కథలు చెప్పేవారు. ఒకే వరండాలో ఉండే ఇళ్లలోని పిల్లలందరూ ఆమె చెప్పే కథలను వినడానికి ఎంతో ఆసక్తి చూపేవారు. ఆ కథలు కూడా సరిగ్గా ఇలాగే ఉండేవి.. వాటిలో కూడా ఇలాంటి కాటేరీ కథలు వినిపించేవి. ఒక్కోసారి ఆ కథలు వినే పిల్లలు తమ లాగూలు తడిపేసుకునేవారు. మరి కొందరైతే ఆ కథలు వింటూ వింటూ భయానికి లోనై ఏడుస్తూ ఇళ్లకు వెళ్లిపోయేవారు. ఆ పిల్లలు జడుసుకోవడంతో వారిని ఎత్తుకొచ్చిన తల్లులు.. కాటేరి కథల- మునెమ్మను తిట్టిపోసేవాళ్లు.
ఇలాంటి బాల్యం ఏదో ప్రశాంత్ నీల్ కి ఉండాలి. లేకుంటే అతడికిలాంటి కథా రచనా సామర్ధ్యం ఎలా సాధ్యం? ఆ రోజుల్లో వీధి బడిలో చదువుకున్న షేక్స్ పియర్.. రాచవాడల అంతరంగిక వ్యవహారాలను.. తానేదో పరదాల మాటున ఉండి చూసినట్టు రాయటం చూసి చాలా మందికి ఇదే అనుమానం. అప్పట్లోనే షేక్స్ స్పియర్ ను ఒక కాపీ క్యాట్ గా భావించేవారు. అవసలు అతడి సొంత రచనలుగా ఎవరూ పెద్దగా నమ్మేవారు కాదు. షేక్స్ పియర్ లోని రచనా ప్రతిభను సాటి రచయిత బెంజిమన్ ఒక్కడే నమ్మేవాడట. ఆపై షేక్స్ పియర్ ఇంగ్లీష్ పాఠాలకే ఒక పాఠంగా నిలిచిపోవటం అందరికీ తెలిసిందే. విలియమ్ షేక్స్ పియర్ ను చదవకుండా ఏ బాల్యం గడిచేది కాదంటే అతిశయోక్తి కాదేమో.
ఇక్కడి విషయానికి వస్తే ప్రశాంత్ నీల్ కి ఇలాంటి కథా గమన చిత్రణ.. ఎలా సాధ్యమైంది? ఇలాంటి ప్రపంచాలుంటాయనీ.. సాదాసీదా కృష్ణానగర్\ ఇంద్రనగర్ గడ్డ\ఫిలిమ్ నగర్ లో తిరగాడే.. సినీజనానికి వశపడే విషయాలు.. కావు. ఖాన్సార్ అనే ఒక ఊహాజనిత ప్రపంచాన్ని సృష్టించడం మాత్రమే కాకుండా.. అక్కడి రాచరికపు వ్యవహారాలు.. కుర్చీలాటలు.. వాటి మధ్య నడిచే సీజ్ ఫైర్ నిబంధనలు.. వారి వారి రాజ్యాంగపు రచనలు. ఆయా వ్యక్తులు\శక్తుల మధ్య సాగే రాజకీయపు కొట్లాటలు.. ఇవన్నీ మామూలు దర్శకులకు ఊహకు కూడా అందని విన్యాసాలు.
కొందరు ప్రశాంత్ నీల్ తన సలార్ చిత్రంలోని కొన్ని సన్నివేశాలను అక్కడా ఇక్కడా.. కాపీ కొట్టాడని ఒక క్రోనాలజీని వాకృచ్చుతున్నారు కానీ అంత మాత్రం చేత ఇలాంటి ఐకానిక్ కథనాన్ని రూపకల్పన చేయడం అంత తేలిగ్గా సాధ్యమయ్యే పని కాదు. దాసరి నారాయణ రావు అనే దివంగత దర్శకుడన్నట్టు.. ఒకవేళ ఉన్నా కూడా.. అది కేవలం ప్రేరణ మాత్రమే తప్ప.. పూర్తి కాపీగా కొట్టిపారేయలేం. ఆ మాటకొస్తే.. శంకరాభరణం అనే ఒక ముసలాడి కథను చూసి ఇన్ స్పైర్ అయిన దాసరి మేఘసందేశం తీశారు. అంత మాత్రం చేత దాసరి దర్శక ప్రతిభను కాపీ గా కొట్టి పారేయలేం కదా.
సుకుమార్ లాంటి దర్శకులు ఇలాంటి పనులు చేసినట్టుగా చరిత్ర ఉన్న మాట వాస్తవం. సుకుమార్ రంగస్థలం, పుష్ప రెండూ కాపీ కథనాలే అన్న మాట ప్రచారంలో ఉంది. బేసిగ్గానే సుకుమార్ తనకు తాను బెస్ట్ స్టోరీ టెల్లర్ గా చెప్పుకోవడం మాత్రమే కాదు.. తన పేరిట సుకుమార్ రైటింగ్స్ అనే ఒక నిర్మాణ సంస్థ పెట్టుకుని వాళ్లవీ వీళ్లవీ అక్కడా ఇక్కడా కథలు లేపేసి.. తీస్తాడనే పేరుంది. ఆ మాటకొస్తే ఉప్పెన మడ్ బౌండ్ అనే హాలీవుడ్ చిత్రానికి నఖలుగా చెబుతారు.
లాల్ సింగ్ చద్దా, ఫారెస్ట్ గంప్ నుంచి ప్రేరణ పొందినట్టు.. ఇదే భగవంత్ కేసరి చిత్రానికి కూడా ఇన్ స్పిరేషన్ గానూ చెబుతారు. ఇలాంటి స్పష్టమైన ఆధారాలేవీ ప్రశాంత్ నీల్ కాపీ కొట్టినట్టు మనకేమీ కనిపించదు.. ఒకటీ అరా ఎక్కడి నుంచైనా కాపీ కొట్టినా.. ఆ చిత్రణలోని గాంభీర్యత.. ఒళ్లు జలదరింప చేసే దృశ్య రూప విన్యాసం చేయడం అంతే సులువైన పనేం కాదు. ఇలాంటి దృశ్యాలు చాలానే చిత్రించాడు నీల్.
హీరో ఇంట్రడక్షన్ లో ఏవో ఆకృతులు అతడి బ్యాగ్రౌండ్ లో కదలాడుతుంటాయి. అవి చైనీస్ డ్రాగన్ తరహా లో కనిపిస్తాయి. స్క్రీన్ లోని ప్రతి స్పేస్ ని బర్న్ చేస్తూ ఉండటం.. తద్వారా తాను ఏదో చెప్పదలుస్తాడు ప్రశాంత్. ఆ కోటగోడలు, వాటిలోని ప్రతిమలు.. ఆ గ్రూపులు.. వాటి వాటి పేర్లు... మనకు ఇక్కడ ఎక్కడా అందుబాటులో ఉన్నట్టుగానే కనిపించవు. ఈ సినిమాను ఇలాగే యాజ్ ఇటీజ్ ఇంగ్లీష్ లో డబ్ చేస్తే ఇది పాన్ వరల్డ్ మూవీ అవుతుందనడంలో అనుమానమే లేదు. అంత భారీ క్యాస్టింగ్.. వాటి ద్వారా తాను పలకదలుచుకున్న భాష\ భావం చాలా చాలా ప్రత్యేకంగా కనిపిస్తాయి.
సినిమాలో కొన్ని కొన్ని మాన్యుమెంటరీ మూమెంట్స్ దర్శనమిస్తాయి. ఫస్ట్ ఫైట్. తర్వాత కాటేరిని కొలిచే తెగలోని బాలికను కాపాడే సమయంలోని సన్నివేశం. ఇలా చాలానే మిరాకిల్స్ క్రియేట్ చేశాడు ప్రశాంత్ నీల్. ఇంట్రోలో చైల్డ్ హుడ్ ఫైట్ సైతం.. మనమింత వరకూ చూడనిదే. హీరో పెద్దయ్యాక ఫస్ట్ ఫైట్ సైతం.. గూస్ బంప్ రేంజ్ లో ఉంటుంది. హీరోలో ఆవేశం వచ్చేటప్పటి జీప్ ఆరార్.. కూడా బాగా వర్కవుట్ అయ్యింది. ఇక భీతావహంగా కనిపించే కాటేరి.. సీన్ లో షాడో ఎఫెక్ట్.. కూడా వండ్రఫుల్ గా కనిపిస్తుంది.
ప్రశాంత్ నీల్ టెక్నిక్ ఏంటంటే.. తానొక సినిమా కథను వండి వార్చడానికి ఎమోషన్స్, దాని తాలూకూ తీవ్రతను ప్రధానాస్త్రాలుగా సిద్ధం చేసుకుంటాడులా ఉంది చూస్తుంటే. ఒక హీరోని ఎంత భారీగా.. ఎంత భీతావహంగా.. ఎంత బీభత్సంగా.. చిత్రీకరించాలో మొదట ఊహించుకుని, ఆ ఇమాజినేషన్ కి తగిన కథనాన్ని రెడీ చేస్తాడులా ఉంది. హై ఓల్టేజ్ సీన్ మేకింగే ప్రశాంత్ నీల్ మెయిన్ స్ట్రెంగ్త్. అదే అతడిని ఈ స్థాయి దర్శకుడిగా నిలబెట్టిందని చెప్పాలి. కొందరు తూతుంబర్ గాళ్లు, టాలాటోలీ మేతావులు అనుకున్నంత అతి సామాన్యుడేం కాడు ప్రశాంత్ నీల్. మన కాలంలో మనం చూస్తోన్న యూనివర్శల్ డైరెక్టర్. కమల్ తర్వాత ఆ రేంజ్ పేరు సాధించిన ఒకే ఒక్కడు ఇతడే. ఇది ఏమంత మామూలు విషయం కాదు.
బేసిగ్గా ఇలాంటి కథలను ఊహించడానికే సగం జీవితం సరిపోతుందనుకుంటే వాటిని ఎక్కడా బెసక్కుండా.. ఒకే పట్టు మీద నిలబెట్టుకు రావడం. ప్రేక్షకులను మెప్పించడం ఇట్స్ నాటే ఈజీ థింగ్. మైండ్ బ్లోయింగ్\ అన్ బిలీవబుల్.. అనే విశేషణాలు కూడా చాలా చాలా చిన్నవై పోతాయ్. ఒక మూడ్ లో ఉండి.. కథను ఊహించడం మాత్రమే కాకుండా.. అనుకున్నది అనుకున్నట్టు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా చిత్రీకరించడంలో.. నీల్ ది ఎక్స్ ట్రార్డినరీ లెవల్ ఆఫ్ థింకింగ్ కమ్ మేకింగ్ మూమెంట్ గా చెప్పొచ్చు. ఏది ఏమైనా ప్రశాంత్ నీల్ ప్రశంసార్హుడు\ చరితార్ధుడు.. ఇంకా ఇంకా చాలానే విశేష పదాలకు అసలు సిసలు అర్హుడు. బేసిగ్గా ఒక డైరెక్టర్ కెరీర్ లో ఒకే ఒక్క డ్రీమ్ ప్రాజెక్ట్ ఉంటుంది. కానీ ఒక దర్శకుడి జీవిత కాలమంతా డ్రీమ్ ప్రాజెక్టులు చిత్రీకరించేంత దర్శక సామర్ధ్యం ఉంటే వాడు ప్రశాంత్ నీల్ అవుతాడు.
తన తర్వాత మూవీ స్టెప్ ఏంటో అన్న హైప్ ఒకటి క్రియేట్ చేసి.. తద్వారా ఒక మేనియా క్రియేట్ చేసి.. మాస్ ఆడియన్స్ ని ఉర్రూతలూగిస్తూ.. ఓలలాడిస్తూ.. వారి చేత ఈలలేయిస్తూ.. గోలచేయిస్తూ.. థియేటర్లకు ప్రేక్షకుల వరద పారిస్తూ.. అబ్బో ఇలా చెప్పుకుంటూ పోతే.. ప్రశాంత్ అని పేరు పెట్టుకుని ఎందరో దర్శకులకు ప్రశాంతత లేకుండా చేస్తోన్న ఏకీ ఏక్.. నీల్ కి మనం కంగ్రాట్స్ చెప్పడం కూడా చాలా చాలా చిన్న విషయమే అవుతుంది. దానికి తోడు ఇప్పుడే అన్ని ప్రశంసలూ కక్కేస్తే.. అబ్బో అతడింకా తీయబోయే చాలా చాలా మాన్యుమెంటరీ మూవీస్ చూడాలి. మళ్లీ అక్షరాలనిలా పోగేయాలి. రాస్తూ రాస్తూ పోవాలి.. కాబట్టి ఇక్కడితో సె. ల. వు!
SALAAR Movie Review by Senior Journalist Audi