For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

"ఈటీవీ బాలభారత్"​ ఒకేసారి 12 ఛానళ్ల​ను ప్రారంభించిన రామోజీరావు

02:56 PM May 11, 2024 IST | Sowmya
Updated At - 02:56 PM May 11, 2024 IST
 ఈటీవీ బాలభారత్ ​ ఒకేసారి 12 ఛానళ్ల​ను ప్రారంభించిన రామోజీరావు
Advertisement

Ramoji rao Started Etv Balabharath Kids Channel,Latest Telugu News,Best Telugu Kids TV Channels,

*పిల్లల కోసం రంగుల హరివిల్లు*
*చిన్నారుల టెలివిజన్‌ ప్రపంచంలో సరికొత్త ఆవిష్కరణ*
*'ఈటీవీ బాలభారత్'​ ఛానళ్ల​ను ప్రారంభించిన రామోజీరావు*
హైదరాబాద్‌: పాతికేళ్లుగా వినోదరంగంలో తనదైన ముద్ర వేసిన.. ఈటీవీ నెట్‌వర్క్‌.. ఇప్పుడు చిన్నారుల కోసం.. ‘బాలభారత్‌’.. అనే రంగుల హరివిల్లును తీసుకువచ్చింది. దేశవ్యాప్తంగా 12 భాషల్ల్లో.. 12 ఛానళ్లను అందిస్తోంది. మంగళవారం రామోజీ ఫిల్మ్‌సిటీ వేదికగా.. ఈ 12 ఛానళ్లను ఒకేసారి రామోజీ గ్రూప్‌ సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు ప్రారంభించారు. వార్త, వినోదాల ఛానళ్లతో ప్రతి ఒక్కరిని రంజింపజేస్తున్న మీటీవీ.. ఈటీవీ చిన్నారులకు అందిస్తున్న కానుక ఇది!
*మీకోసం.. మీ భాషలో*
స్థానిక భాషలో.. గ్లోబల్‌ కంటెంట్‌ అందించాలన్న ఆలోచనతో.. ఈటీవీ 12 భాషల్లో ఈ ఛానళ్లను తీసుకువచ్చింది. తెలుగుతో పాటు.. అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, హిందీ, కన్నడ, మరాఠీ, మలయాళం, ఒడియా, పంజాబీ, తమిళం, ఆంగ్ల భాషల్లో బాలభారత్‌ ప్రసారమవుతుంది. ప్రపంచవ్యాప్తంగా పిల్లల మనసులను గెలుచుకున్న గ్లోబల్‌ షోలతో పాటు.. దేశీయ వినోదాన్ని బాలభారత్‌ ఛానళ్లు అందించనున్నాయి. చిన్నారులను ఆశ్చర్యానికి గురిచేసే అద్భుతమైన అంశాలను స్థానిక భాషల్లో అందిస్తూ.. పిల్లల టెలివిజన్‌ ప్రపంచాన్నే సరికొత్తగా బాలభారత్‌ మార్చనుంది. కార్యక్రమాల విషయంలో ఆయా ప్రాంతాలు, భాష, అభిరుచులకు ప్రాధాన్యమిస్తూ.. వీక్షకులకు సరికొత్త అనుభూతిని అందించనుంది.
*వినోదం.. విలువలు కూడా*
*పిల్లల కోసం రంగుల హరివిల్లు*
జిజ్ఞాసను, ఉత్తేజాన్ని కలిగించే అంశాలతో పిల్లల మనసును చూరగొనేలా బాలభారత్‌ కార్యక్రమాలకు రూపకల్పన చేస్తోంది. కేవలం వినోదాన్ని అందివ్వడమే కాకుండా.. చిన్నారుల్లో సంస్కారం, విలువలు పెంపొందించేందుకు కృషి చేస్తుంది. అద్భుతమైన కథలు- పాత్రలు, సంభ్రమాశ్చర్యాలకు గురిచేసే యానిమేషన్‌, లైవ్‌ యాక్షన్లతో చిన్నారుల వినోద ప్రపంచం పూర్తిగా మారిపోనుంది. యాక్షన్‌, అడ్వెంచర్‌, కామెడీ, థ్రిల్లర్‌, ఫాంటసీ వంటి వివిధ విభాగాలతో బాలభారత్‌.. యువ మనసులను అలరించనుంది. అద్భుతమైన యానిమేషన్‌ సిరీస్‌ అభిమన్యు, రోజుకో పిల్లల సినిమా, వారాంతాల్లో ప్రత్యేక కార్యక్రమాలతో.. ఇక పిల్లలకు ప్రతిరోజూ సంబరమే!
*మరో మైలురాయి..*
టెలివిజన్‌ రంగంలో ఈ మధ్యనే పాతికేళ్లు పూర్తి చేసుకున్న ఈటీవీ నెట్‌వర్క్‌... పిల్లల కోసం ఒకేసారి 12 ఛానళ్లను ప్రారంభించి మరో మైలురాయిని చేరుకుంది. వార్తాపత్రికలు అయినా.. టెలివిజన్‌ అయినా స్థానిక సంస్కృతి, భాష, సంప్రదాయాలకు అధిక ప్రాధాన్యమిచ్చే ఈటీవీ నెట్‌వర్క్‌.. బాలభారత్‌ విషయంలోనూ అవే ప్రమాణాలను పాటించనుంది. అంతర్జాతీయ కంటెంట్‌ను అందిస్తూనే మనదైన ఆత్మను ఆవిష్కరించి మనసులను ఉత్తేజితం చేయనుంది. ఈ కరోనా కాలంలో పాఠశాలలు లేక బయటకు వెళ్లలేక ఇంట్లోనే ఉండిపోతున్న ఈతరం చిన్నారులకు.. రామోజీ గ్రూప్‌ ఛైర్మన్‌ రామోజీరావు అందిస్తున్న అద్భుతమైన కానుక.. ‘బాలభారత్‌’.

Advertisement
Author Image