యుద్ధం వల్ల తిరిగొచ్చిన వారిని ఉచితంగా చదివిస్తం: సీఎం కేసీఆర్
ఉక్రెయిన్‌లో వైద్యవిద్యను అభ్యసిస్తున్న తెలంగాణ విద్యార్థుల విషయంలో సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రష్యాతో యుద్ధం కారణంగా చదువును మధ్యలోనే వదిలేసి ఉక్రెయిన్ నుంచి తిరిగి వచ్చిన విద్యార్థుల బాధ్యతను తాము తీసుకుంటామని ఆయన వెల్లడించారు. వారందరి చదువుకు అయ్యే మొత్తాన్ని ప్రభుత్వమే భరిస్తుందని, వారు ఇక్కడే మెడిసిన్ చదివే విధంగా చర్యలు తీసుకుంటామని ప్రకటించారు.
ద్రవ్యవినిమయ బిల్లుపై సీఎం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన సందర్భంగా మాట్లాడుతూ.. ‘మన దేశానికి చెందిన దాదాపు 20 వేల మంది విద్యార్థులు యుద్ధం కారణంగా ఉక్రెయిన్‌లో చిక్కుకున్నరు. మన రాష్ట్రం నుంచి 740 మంది ఉన్నరు. దీంట్లో 700 మంది పిల్లలు ఎంబీబీఎస్ చదివేందుకే పోయిన్రు. అక్కడ 20-25 లక్షలల్ల మెడిసిన్ పూర్తి అయిపోతది. ఇక్కడ కోటి రూపాయలు అయితున్నయి. ఇక్కడ అవకాశం లేకనే పోయిన్రు. కింద మీద పడి 700 మందికి టిక్కెట్లు భరించి వెనక్కి తెచ్చినం. తేనైతే తెచ్చినం వాళ్ల భవిష్యత్ ఏంది? వాళ్ల చదువు డిస్‌కంటిన్యూ కావాల్నా.. ఆగిపోవాల్నా..? తిరిగి ఉక్రెయిన్ పోయే పరిస్థితులున్నయా? పరిస్థితులు ఎప్పుడు బాగయితయో తెలియని పరిస్థితి. ఈ పరిస్థితుల్లో తెలంగాణ ప్రభుత్వంగా నేను ప్రకటిస్తున్నా.. వాళ్ల చదువులకు ఎంత ఖర్చయినా.. భరిస్తం. వాళ్లు డిస్‌కంటిన్యూ కాకుండా..భవిష్యత్ దెబ్బతినకుండా చూస్తాం. కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తున్నం. సీఎస్, ఆరోగ్యశాఖ మంత్రి ఇక్కడే ఉన్నరు. మీరు కేంద్రానికి లేఖ రాయం డి. రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని వివరించండి.కేంద్ర మంత్రుల వ్యాఖ్యలు వాంఛనీయం కాదు: మిమ్మల్ని ఉక్రెయిన్‌కు ఎవరు పొమ్మన్నరని కేంద్ర మంత్రులు మాట్లాడిన్రు. నవీన్ అనే పిలగాడు చనిపోయిండు. వాళ్ల తల్లిదండ్రులు ఏడుస్తుంటే.. తిన్నదరగక పోయిండ్రని మాట్లాడుతున్నరు. తిన్నదరగక ఉక్రెయిన్ పోతరా? గరీబుగాళ్లు.. దిక్కులేని పిల్లలు చదువుకుంటమని పోయిండ్రు. వాళ్ల గురించి మాట్లాడవల్సిన పద్ధతేనా? దీని మీద మాట్లాడితే దేశ ద్రోహులు అంటరు. ఇటువంటి పెడధోరణులు ఎక్కడికి దారితీస్తయో ప్రజలు అర్థం చేసుకోవాలె. ఇలాంటివి ఏ రకంగానూ వాంఛనీయం కాదు. ఇటువంటివి ఇలాగే కొనసాగిస్తే.. దేశానికి చాల ప్రమాదమొస్తది. ఉన్న ఉపాధి పోతది. అవకాశాలు పోతయి. పెట్టుబడులు రావు. భయంకర పరిస్థితి వస్తది. ఒక పక్క వచ్చేసింది.