Minister Gudivada Amarnath Reddy : గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ - 2023 లోగోను ఆవిష్కరించిన సీఎం జగన్...
Minister Gudivada Amarnath Reddy : రాష్ట్రానికి విదేశీ పెట్టుబడులు ఆకర్షించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భారీ సదస్సును ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు విశాఖపట్నంలో జరగబోయే గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ - 2023 లోగోను సీఎం జగన్మోహన్‌రెడ్డి తన క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రి గుడివాడ అమర్నాథ్, పరిశ్రమల శాఖ స్పెషల్ సీఎస్ కరికాల వలవన్, మారిటైం బోర్డు సీఈఓ ఎస్ షన్‌మోహన్, ఏపీఎంఎస్‌ఎంఈ చైర్మన్ వంకా రవీంద్రనాథ్ ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ... వచ్చే ఏడాది మార్చి 3, 4 తేదీల్లో జరగబోయే ప్రపంచ పెట్టుబడి దారుల సదస్సును విశాఖపట్నంలో నిర్వహించాలని సీఎం జగన్మోహన్‌రెడ్డి ఆదేశించారని తెలిపారు. కోవిడ్ కారణంగా గత మూడేళ్లలో ఇన్వెస్ట్‌మెంట్ సమ్మిట్‌లు నిర్వహించలేకపోయామని తెలిపారు. కోవిడ్ పరిస్థితులను దాటుకుని ఇప్పుడిప్పుడు ముందుకు అడుగులు వేస్తున్నామని చెప్పారు. పెట్టుబడిదారుల సదస్సులను ఇప్పుడిప్పుడే ఇతర రాష్ట్రాలు నిర్వహించడం ప్రారంభించామని మంత్రి అమర్నాథ్ తెలిపారు.
రాష్ట్రంలో ఎంఎస్‌ఎంఈలపై కూడా ఫోకస్ పెట్టామన్నారు. పరిశ్రమల అభివృద్ధికి మౌలిక వసతులు కల్పిస్తున్నామని... మచిలీపట్నం, భవనపాడు పోర్టులను నిర్మిస్తున్నామని పేర్కొన్నారు. విశాఖపట్నం, కాకినాడ పోర్టులను అభివృద్ధి చేస్తున్నామని... 5 షిప్పింగ్ హార్బర్ల నిర్మాణం కొనసాగుతోందని చెప్పారు. రామాయపట్నం పోర్టుకు 2024 జనవరి నాటికి మొదటి షిప్ తెస్తామని మంత్రి అమర్నాథ్ తెలిపారు. దేశానికి ఏపీనే గేట్‌వేగా మారబోతోందని... ఆర్థికాభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ కీలక పాత్ర పోషించబోతోందని చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రముఖ పారిశ్రామిక వేత్తలను సదస్సుకు ఆహ్వానిస్తామని తెలిపారు. ఏపీని అభివృద్ది పధంలో నడిపించేందుకు సీఎం జగన్ అన్ని విధాలా కృషి చేస్తున్నారని అన్నారు.