చిరంజీవి తొలి పారితోషికం ఎంతో తెలుసా? అక్షరాలా ...?
కాలం మారుతున్నకొద్దీ అన్ని విషయాల్లోనూ మార్పులొస్తాయి. 70వ దశకంలో ఐదు పైసలు, పది పైసల నాణాల్ని చూసినవారు ఇప్పుడు ఆ విషయాన్ని చెప్తే ఇప్పటి తరం బోల్డంత ఆశ్చర్యపోతుంది. 'అలాంటివి కూడా వుండేవా?' అని నోరు తెరుస్తారు. ఎందుకంటే, ఇప్పుడు రానురాను పది రూపాయల కాగితం కూడా కనుమరుగు కాబోతోంది. ఇకపోతే, తొలిసారిగా అందుకున్న పారితోషికం ఎవరికైనా ఎనలేని సంతోషాన్ని మిగులుస్తుంది. తర్వాత ఎన్ని కోట్ల రూపాయలను సంపాదించినా ఆ తొలి పారితోషికాన్ని అందుకున్న మధుర క్షణాలు జీవితాంతం మదిలో నిలిచిపోతాయి. ఇక మన మెగాస్టార్ విషయానికొస్తే ఆయనకున్న క్రేజ్ ఎంతో మనందరికీ తెలిసిందే...! 1978లో 'పునాదిరాళ్లు' చిత్రంలో ఆయన ముందుగా నటించినప్పటికీ, 'ప్రాణం ఖరీదు' ముందుగా విడుదలైన విషయం నుండీ, ఇప్పటి వరకూ మెగాస్టార్ కెరీర్ లోని ప్రతి విశేషాన్నీ మెగాభిమానులు గుక్క తిప్పుకోకండా చెప్పగలరు. అభిమానులకు ఆయనంటే అంత ప్రాణం మరి...! ఆయన కెరీర్ లోని మరికొన్ని విశేషాలను ఒకసారి మళ్లీ గుర్తు చేసుకుందాం...!! అచ్చ తెనుగు ఆవకాయలాంటి దర్శక శిఖరం బాపు దర్శకత్వంలో వచ్చిన 'మనవూరి పాండవులు' చిత్రం చిరంజీవికి ప్రేక్షకుల్లో మంచి గుర్తింపునిచ్చింది. 'తాయారమ్మ బంగారయ్య' చిత్రంలో ఒక చిన్న పాత్ర పోషించారు చిరంజీవి. 'ఐ లవ్ యు' చిత్రంలో ప్రతినాయక ఛాయలున్న పాత్ర పోషించిన ఆయన, కె. బాలచందర్ దర్శకత్వంలో కమల్ హాసన్ కథానాయకుడిగా రూపొందిన 'ఇది కథ కాదు' చిత్రంలోనూ ప్రతినాయకుడిగా నటించారు. ఇంకా 'మోసగాడు', 'రాణీ కాసుల రంగమ్మ', '47 రోజులు', 'రాణువ వీరన్' మొదలైన సినిమాల్లో చిన్న పాత్రలు, విలన్ పాత్రలను పోషించారు మెగాస్టార్. తమిళ చిత్రం 'అవర్ గళ్' తెలుగు రీమేక్ లో తమిళంలో రజనీకాంత్ పోషించిన పాత్రను పోషించారు చిరంజీవి. 1979లో చిరంజీవి నటించిన 8 సినిమాలు విడుదలవగా తర్వాతి సంవత్సరంలో 14 సినిమాలు విడుదలయ్యాయి. ఇంతకీ, మన మెగాస్టార్ 'మనవూరి పాండవులు' చిత్రంలో వేసిన చిన్న పాత్ర కోసం నిర్మాత జయకృష్ణ నుండి అందుకున్న తొలి పారితోషికం ఎంతో తెలుసా? అక్షరాలా వెయ్యి నూట పదహార్లు... నిజంగా ఆశ్చర్యకరమైన విషయం కదూ...!!