For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

Manikeshwari Matha Temple : మాణిక్యేశ్వ‌రి మాత ఆశ్ర‌మంలో నాన్న‌గారు చెప్పిన వీరి పూర్వ‌జ‌న్మ వృత్తాంత‌మేమి ?

11:27 AM Dec 10, 2023 IST | Sowmya
Updated At - 11:27 AM Dec 10, 2023 IST
manikeshwari matha temple   మాణిక్యేశ్వ‌రి మాత ఆశ్ర‌మంలో నాన్న‌గారు చెప్పిన వీరి పూర్వ‌జ‌న్మ వృత్తాంత‌మేమి
Advertisement

పూర్వ జ‌న్మ‌లో గాంధీ ఎవ‌రు ? గాడ్సే ఎవ‌రు ? వీరికి గోవ‌ధ‌కు ఉన్న సంబంధ‌మేంటి ?

మేం కొడ‌గంల్ వెళ్లి అక్క‌డ రేవంత్ రెడ్డి ఇంటిని, ఇత‌ర ప‌బ్లిక్ బైట్స్ షూట్ చేశాం. ఆపై ఇక్క‌డ చూడ్డానికి ఏదైనా ఉందా? అని అడిగితే ముప్పై కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న మాణిక్యేశ్వ‌రి మాత‌.. ఆల‌యం ఉంద‌ని మాతో చెప్పారు స్థానికులు. దీంతో క‌ర్ణాట‌క బ‌స్సు ఎక్కి.. మాణిక్యేశ్వ‌రి మాత ఆల‌యం చేరుకున్నాము.

Advertisement GKSC

అక్క‌డ రాత్రి బ‌స చేసి మ‌ర్నాడు ఆ పీఠాన్ని పాలిస్తున్న నాన్న‌గారు(శివ‌య్య‌గారు)ఆయ‌న ప్ర‌సంగాన్ని రికార్డు చేశాము. ఆయ‌న చెప్పిన‌దాన్నిబ‌ట్టీ చూస్తే వ‌చ్చే కార్తీక మాసం అంటే 2024 కార్తీక మాసంలో ఒక ఉప‌ద్ర‌వం జ‌ర‌గ‌నుంద‌ని. దాని ప్ర‌కారం ఒక యుద్ధం సంభవిస్తుంద‌ని.. నెల్లూరు నేల‌మ‌ట్టం అవుతుంద‌ని. బ్ర‌హ్మంగారు చెప్పిన‌ట్టే ఇక్క‌డే క‌ర్ణాట‌క లోని ఈ క్షేత్రంలో మాతాజీ వెలిశార‌నీ చెప్పుకొచ్చారాయ‌న‌.

నెల్లూరు జిల్లా రామ‌తీర్ధం వాస్త‌వ్యులైన శివ‌య్య నాన్నగారు.. గ‌త న‌ల‌భై ఏళ్లుగా ఇక్క‌డే మాతాజీ సేవ చేస్తూ.. ఆమె త‌ద‌నంత‌రం.. ఈ ఆశ్ర‌మాన్ని పాలిస్తున్నారు. ఇక్క‌డ మాతాజీ ప్ర‌ముఖంగా ప్ర‌వ‌చించిన‌ది.. నిన‌దించిన‌ది ఏమ‌న‌గా.. అహింసా ప‌ర‌మో ధ‌ర్మః. మేం కూడా అక్క‌డ అడుగ‌డుగునా ఈ నినాద‌మే చూశాం. ఈ దిశ‌గా ఆమె రూప‌ర‌హిత వీర‌ధ‌ర్మ‌జ మాతాజీగా పేరు మార్చుకున్నారు కూడా. ఆమె ఇక్క‌డ వెలుస్తార‌ని మాణిక్యేశ్వ‌ర ప్ర‌భు మ‌హ‌రాజ్ ముందే చెప్ప‌డం వ‌ల్ల ఆమె ఇక్క‌డ అవ‌త‌రించ‌డం.. దీంతో మాతాజీకి మాణిక్యేశ్వ‌రిగా పేరొచ్చింద‌ని అంటారు.

ప‌న్నెండేళ్ల చిరు ప్రాయంలోనే బాల్య వివాహానికి వ్య‌తిరేకంగా త‌ల్లిదండ్రుల‌తో పోరాడిన మాతాజీ.. గృహ బ‌హిష్క‌ర‌ణ‌కు లోన‌య్యారు. దీంతో ఇంటి నుంచి బ‌య‌ట ప‌డ్డ ఆ చిన్నారి త‌ల్లి.. ఇప్పుడున్న గుట్ట మీద చెట్టూ చేమ‌ల మీదే ధ్యానం చేస్తూ.. అలా అలా ఒక శివాల‌యం ద్వారా.. సాధ‌న చేసి.. ఆపై ధ్యాన మార్గంలోకి వెళ్లి.. శివ‌రాత్రి రోజున వెలికి వ‌చ్చి భ‌క్తుల‌కు ద‌ర్శ‌న‌మిచ్చి.. స్థానికుల్లో విశేష ఆమె ఆద‌ర‌ణ పొందిన విధం గురించి నాన్న‌గారు మాకెంతో వివ‌రంగా చెప్పుకొచ్చారు.

అంతే కాదు.. ప్ర‌తి జీవికీ ప్రాణం ఉంటుందనీ. ఆ జీవి ప్రాణాన్ని మ‌నం పొట్ట పోసుకోవ‌డం కోసం వ‌ధించ‌రాద‌నీ. అలా చేయ‌డం వ‌ల్ల అది దేవుడ్ని అత్యంత దీనంగా ప్రార్ధిస్తుంద‌ని.. ఆ ప్రార్ధ‌న ప్ర‌కారం చూస్తే.. త‌న‌కూ ఈ విశ్వంలో జీవించే హ‌క్కు ఉండ‌గా.. త‌మ స్వార్ధానికి, క‌డుపు నింపుకోడానికి.. ఈ జ‌నులు అత్యంత విషాద‌క‌రంగా త‌న ప్రాణం తీస్తున్నార‌నీ.. అలాంటి వీరికి కూడా త‌న‌లాంటి జంతు జ‌న్మ‌నిచ్చి.. వారిని కూడా స‌రిగ్గా ఇలాగే వ‌ధించాల‌ని కోరుతున్నాన‌ని అంటుంద‌ట‌.

ఈ జంతు వ‌ధే ఈ ప్ర‌పంచాన్ని పాప‌పంకిలం చేస్తోంద‌ని.. ఈ పాపం పండి వ‌చ్చే కార్తీక పౌర్ణ‌మి నాటిక‌ల్లా పెను ప్ర‌ళ‌యం సంభవించ‌బోతున్న‌ద‌నీ.. ఈ విప‌త్తు చినికి చినికి గాలివాన‌గా మారి.. ప్ర‌పంచంలో పాపాత్ములంతా హ‌త‌మ‌య్యి.. కేవ‌లం అహింసా మార్గాన్ని అనుస‌రించిన భ‌క్త‌జ‌నులు మాత్ర‌మే బ‌తుకుతార‌నీ. నాలుగు వంతుల ఈ జ‌నాభాలో ఒక వంతు మాత్ర‌మే మిగులుతార‌నీ.. సెల‌విచ్చారాయ‌న‌.

మొత్తంగా ఈ ప్ర‌ళ‌యానికి జీవ‌హింసే కార‌ణం కాబ‌ట్టి.. ఆల‌యాల ముంగిట జంతు వ‌ధ నిషేధించేలా తాము న్యాయ పోరాటం చేశామ‌నీ.. టంగుటూరి అంజ‌య్య హ‌యాంలో శ్రీశైలం భ్ర‌మ‌రాంబ ఆల‌యం ముందు జ‌రుగుతూ వ‌చ్చిన జంతు వ‌ధ నిషేధానికి మాతాజీ కార‌కుల‌య్యార‌నీ చెప్పారు శివ‌య్య స్వామి.
వీటితో పాటు నాన్న‌గారుగా భ‌క్తుల ద్వారా ప్రేమ‌గా పిలిపించుకునే.. శివ‌య్య స్వామి ఇప్ప‌టి వ‌ర‌కూ మ‌నం విన‌ని విష‌యం ఒక‌టి చెప్పారు.

అదేంటంటే.. పూర్వ‌జ‌న్మ‌లో బ్ర‌హ్మంగారి శిష్యుడైన సిద్ధ‌య్య‌.. ఒక ముస్ల‌మానుగా.. గోవ‌ధ చేయ‌డంతో.. త‌ర్వాతి జ‌న్మ‌లో గాంధీగా జ‌న్మించాడ‌నీ. గాడ్సేగా త‌న‌ను వ‌ధించిన గోవు జ‌న్మించింద‌నీ.. ఆ గోవే త‌న ప్ర‌తీకారం తీర్చుకోవ‌డంలో భాగంగా కాల్పులు జ‌రిపి గాంధీజీ రూపంలోని సిద్ధ‌య్య‌ను హ‌త‌మార్చింద‌ని అన్నారాయ‌న‌. ఇప్ప‌టి వ‌ర‌కూ ఎవ్వ‌రూ విన‌ని ఈ క‌థ‌నం ద్వారా మాకు తెలిసిన నీతి ఏమిటంటే.. మాంస భ‌క్ష‌ణం అన్న‌ది అత్యంత ప్ర‌మాద‌క‌ర‌మైన‌ది. ఇదే మ‌నిషి మ‌రుజ‌న్మ‌ను ఖ‌రారు చేస్తుంద‌ని అవ‌గ‌త‌మైంది.

ఇదే ఆల‌యంలో మేం మ‌రెన్నో ప్ర‌త్యేక‌త‌ల‌ను సంద‌ర్శించాం. ఇదే ప్రాంగ‌ణంలో పోతులూరి వీర‌బ్ర‌హ్మంగారు, ఆయ‌న శిష్యుడు సిద్ధేశ్వ‌రుడితో పాటు.. త్రిమూర్తుల ఆల‌యాలున్నాయి. శివ‌\వెంక‌టేశ్వ‌ర‌\ బ్ర‌హ్మ ఆల‌యాలున్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కూ మ‌నం శివ‌కేశ‌వుల ఆల‌యాల‌ను మాత్ర‌మే చూసి ఉంటాం. అదే ఇక్క‌డ చ‌తుర్ముఖ బ్ర‌హ్మ ఇరువైపుల గాయ‌త్రీ, స‌ర‌స్వ‌తీ మాత విగ్ర‌హాల‌తో ఇక్క‌డ అల‌రారుతూ క‌నిపిస్తారు.

ఇక ఇదే ప్రాంగ‌ణంలో అత్యంత ముఖ్య‌మైన‌ది కోటి లింగ స‌భ‌. ఈ ఆల‌యంలో స‌హ‌స్ర లింగాన్ని స్థాపించిన మాతాజీ.. ఈ లింగాన్ని ఎవ‌రైతే.. ద‌ర్శించి మొక్కుకుంటారో.. వారి కోరిక నెర‌వేరిన త‌ర్వాత ఒక లింగాన్ని స‌మ‌ర్పించాల‌ని సూచించార‌ట‌. అలా అలా ఇప్ప‌టి వ‌ర‌కూ ఈ కోటిలింగాల కోవెల‌లో ల‌క్ష వ‌రకూ లింగాల ప్ర‌తిష్టాప‌న జ‌రిగిన‌ట్టుగా మేం గుర్తించాము. అంతేకాదు నారాయ‌ణ‌పేట్ నియోజ‌వ‌ర్గం నుంచి తాను ఎమ్మెల్యేగా గెలిస్తే ఇక్క‌డ వంద లింగాల ప్ర‌తిష్టాపన చేస్తాన‌ని చిట్టెం ప‌ర్ణికారెడ్డి మొక్కార‌ట‌. మాతాజీ మ‌హిమ‌తో ఆమె కూడా గెలిచార‌నీ. ఆమె త‌న మొక్కు.. అత్యంత త్వ‌ర‌లోనే చెల్లించ‌నున్నార‌నీ అన్నారు ఆల‌య నిర్వాహ‌కులు.

ఇదిలా ఉంటే ఈ ఆల‌యానికి ప్ర‌స్తుత తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సైతం.. గ‌తంలో వ‌చ్చార‌నీ. మాతాజీ సంద‌ర్శ‌న చేశాక‌.. ప్ర‌జ‌లంతా బాగుండాల‌ని తాను కోరాన‌ని చెప్పార‌ని మాతో శివ‌య్య స్వామి అన్నారు. అంతే కాదు ఈ ఆల‌యానికి ఎంద‌రో రాజ‌కీయ ప్ర‌ముఖులు వ‌చ్చార‌నీ. అంద‌రికీ మాతాజీ చెప్పేది ఒక‌టేన‌నీ.. జీవ‌హింస ప‌నికిరాదు. అహింసా ప‌ర‌మోధ‌ర్మః అన్న‌ది ఆమె ఆధ్యాత్మిక విధాన‌మ‌నీ.. అదే ఈ లోకాన్ని కాపాడే ప‌ర‌మ జీవ‌న సూత్రంగా సెల‌విచ్చిన‌ట్టు చెప్పారు నాన్న‌గారు.

ఎవ‌రైనా ఈ ఆల‌యాన్ని సంద‌ర్శించాల‌నుకుంటే.. కొండంగ‌ల్ కి వ‌చ్చి.. అక్క‌డి నుంచి.. యాన‌గొందికి చేరుకుంటే.. అక్క‌డ మీకు ఒక క‌మాన్ ద‌ర్శ‌న‌మిస్తుంది. ఈ క‌మాన్ దాటుకుని.. వెళ్లి మెట్లు ఎక్కితే మాణిక్యేశ్వ‌రి మాత‌.. ఆల‌యం చేరుకోవ‌చ్చు. చివ‌రిగా మాకొక కొస‌మెరుపు ఎదురైంది. మేం తిరిగి వ‌చ్చేస్తుంటే.. కింద విఘ్నేశ్వ‌ర‌\ వ్యాస భ‌గ‌వాన్ ఆల‌యం క‌నిపించింది. ఈ ఆల‌య ప‌రిర‌క్ష‌ణ చేస్తున్న మ‌రో మాత క‌నిపించారు. ఆమె విష్ణు స‌హ‌స్ర‌నామం అన‌ర్గ‌ళంగా చ‌దువుతూ క‌నించారు. అదంతా షూట్ చేసిన మాకు.. ఆమె ద్వారా తెలిసిన మ‌రో విశేషం ఏంటంటే.. ఆమె అస‌లు పేరు అమినా బేగం. ఈమె ఒక ముస్లిం మ‌హిళ‌.

మాతాజీ ద్వారా అమ‌రావ‌తిగా పేరు మార్చుకున్న ఈమె.. ఇక్క‌డే ఉంటూ.. రామాయ‌ణ, మ‌హాభార‌తాల‌తో పాటు.. భ‌గ‌వ‌ద్గీత పారాయ‌ణం చేస్తుంటార‌ని చెప్పారు. అంతే కాదు ఎన్నో హిందూ ధ‌ర్మ విశేషాల‌ను తెలుసుకుంటూ ప‌ది మందికి పంచుతూ.. ఆధ్యాత్మిక ప్రాసంగీకురాలిగా ఈమె జీవిస్తున్న విధం మాకెంతో హృద్యంగా క‌నిపించింది. మ‌త సామ‌ర‌స్య ప్ర‌తీక‌గా అగుపించింది.

అంతే కాదు ఆమె(అమినాబేగం) ఇంట్లో ఒక హిందూ మ‌హిళ‌లా దేవ‌తారాధ‌న చేస్తూ.. ఆ మూర్తుల‌కు అనునిత్యం విశేష పూజ‌లు చేస్తూ ద‌ర్శ‌న‌మిచ్చారు. హిందూ క‌న్వ‌ర్ట్ అయిన అమినా బేగంను గుర్తించిన కొంద‌రు హిందూ సంఘాల వారు.. ఆమెను స‌న్మానించిన విధం కూడా మాకు చూపించారు. అంతే కాదు ఆమె మాపై అపార‌మైన ప్రేమాభిమానాల‌ను చూపడంతో.. మా మాణిక్యేశ్వ‌రి మాత ఆల‌య సంద‌ర్శ‌నం సంపూర్ణ‌మైన అనుభూతి క‌లిగింది. మ‌రీ ముఖ్యంగా మాకు అక్క‌డ బ‌స ఏర్పాటు చేసి.. ఎంతో బాగా చూసుకున్న సుమ‌న‌ప్ప గారికి ప్ర‌త్యేక ధ‌న్య‌వాద‌ముల‌తో సెల‌వు. జై మాణిక్యేశ్వ‌రి మాత‌. అహింసా ప‌ర‌మో ధ‌ర్మః

ఇట్లు - మీ భవదీయుడు జర్నలిస్ట్ ఆది

Advertisement
Author Image