Super Star Krishna : సూపర్ స్టార్ కృష్ణ దశదిన కర్మ కార్యక్రమంలో ఎమోషనల్ అయిన మహేష్ ..!
Super Star Krishna : టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ మరణాన్ని అటు ఘట్టమనేని కుటుంబ సభ్యులతో పాటు అభిమానులు, సినీ ప్రముఖులు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. అనుకోని రీతిలో కృష్ణ అనారోగ్య సమస్యలతో ఈ లోకానికి దూరమయ్యారు. దీంతో తమ అభిమాన హీరో జ్ఞాపకాలను తలుచుకుంటూ ఘట్టమనేని అభిమానులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఇక ఈ ఏడాది తన కుటుంబసభ్యులను వరుసగా ముగ్గురుని కోల్పోవడంతో మహేష్ పూర్తిగా కుంగిపోయారు. ఏడాది ప్రారంభంలోనే అన్నయ్యను, రెండు నెలల క్రితం తల్లి ఇందిరా దేవిని... ఇక ఇటీవలే తండ్రి కృష్ణను కోల్పోవడంతో మహేష్ తీవ్ర మనోవేదనకు గురయ్యారు.
ఈ మేరకు ఈరోజు హైదరాబాద్ లోని ఎన్ కన్వెన్షన్ దగ్గర కృష్ణ దశ దిన కర్మ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు అభిమానులు కూడా పెద్ద ఎత్తున హాజరయ్యారు. అలాగే 27 సంవత్సరాల వయసులో కృష్ణ ఎలా ఉన్నారో అచ్చం అలాంటి విగ్రహాన్ని ఎన్ కన్వెన్షన్ దగ్గర ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మహేష్ మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. ” నాన్న నాకు ఎన్నో ఇచ్చారు. వాటిలో గొప్పది.. మీ అభిమానం.. అందుకు ఆయనకు నేను రుణపడి ఉంటాను. నాన్నగారు ఎప్పుడూ నా గుండెల్లో ఉంటారు. మీ గుండెల్లోనూ ఉంటారు. ఆయన ఎప్పుడూ మనమధ్యే ఉంటారు. మీ అభిమానం, ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను” అంటూ ఎమోషనల్ అయ్యారు మహేష్.
ఇక గత కొంతకాలంగా శోకసంద్రంలో ఉన్న తన అభిమాన హీరో మహేష్ ని ఓదార్చడానికి.. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి అభిమానులు ఈ కారిక్రమానికి తరలి వచ్చారు. ఇక కృష్ణ మరణం అనంతరం సోషల్ మీడియాలో మహేష్ చేసిన పోస్ట్ అందరి హృదయాలను కదిలించింది.