Mahesh Babu : సోషల్ మీడియాలో వైరల్ గా మారిన కృష్ణ - మహేష్ వీడియోలు..!
Mahesh Babu : సూపర్ స్టార్ కృష్ణ అకాల మరణంతో తెలుగు సినీ ప్రపంచం మూగబోయింది. కృష్ణ అభిమానులు మాత్రమే కాకుండా ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలు శోక సంద్రంలో మునిగిపోయారు. దీంతో ఆయన నట ప్రస్థానాన్ని గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియాలో తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. ఈ క్రమంలోనే సూపర్ స్టార్ మహేష్ బాబుకు సంబంధించిన పలు పాత వీడియోలు నెట్టింట వైరలవుతున్నాయి.
అందులో మహేష్ కృష్ణ గురించి మాట్లాడిన మాటలు అభిమానులను కంటతడి పెట్టిస్తున్నాయి. ఇటీవల సర్కారు వారి పాట సినిమా వేడుకలో నాకు బాగా కావల్సిన వాళ్ళు దూరం అవుతున్నారు. కానీ మీ అభిమానం మాత్రం పెరుగుతూనే ఉంది. ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను అని అన్నారు. అలానే మేజర్ సినిమా ప్రమోషన్స్ సమయంలో కృష్ణ బయోపిక్ ఏమైనా చేసే ఛాన్స్ ఉందా ? ఒకవేళ తీస్తే ఎప్పుడు వస్తుంది ? అంటూ రిపోర్టర్ ప్రశ్నించగా... మహేష్ మాట్లాడుతూ... నాన్నగారి బయోపిక్ ఎవరైనా చేస్తే మొదట చూడటానికి తానే ముందుంటాను అని, తను మాత్రం ఆయన బయోపిక్ చేయలేనని అన్నారు. ఆయన నా దేవుడు అంటూ చెప్పుకొచ్చారు.
అలాగే కృష్ణ తనయుడిగా జన్మించడం అదృష్టం అని... ఆయన తన భవిష్యత్తును ఎంతో అందంగా తీర్చిదిద్దారని మరో వీడియోలో చెప్పుకొచ్చారు మహేష్. ప్రస్తుతం మహేష్ పాత ఇంటర్వ్యూలు నెట్టింట వైరలవుతున్నాయి. ఈ ఏడాది జనవరిలో అన్నయ్య రమేష్ బాబు మరణించగా... సెప్టెంబర్ లో తల్లి ఇందిరా దేవి మరణించారు. ఇప్పుడు తండ్రి కృష్ణ కూడా దూరమయ్యారు. నెలల వ్యవధిలోనే అన్నయ్య.. తల్లి… తండ్రి.. మహేష్‌ను ఒంటరిని చేసి వెళ్లిపోయారు. దీంతో సోషల్ మీడియా వేదికగా మహేష్ కు సపోర్ట్ గా అభిమానులు పోస్ట్ లు చేస్తున్నారు.