KA Paul : మునుగోడు ప్రచారంలో దూసుకుపోతున్న కేఏ పాల్... రైతు గెటప్ లో !
KA Paul : తెలంగాణలో జరగనున్న మునుగోడు ఉపఎన్నికలు రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశ వ్యాప్తంగా కూడా చర్చకు దారి తీస్తున్నాయి. ఈ ఉప ఎన్నికను అన్ని రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఉప ఎన్నిక పోలింగ్ సమీపిస్తుండటం, ప్రచారానికి సమయం దగ్గర పడటంతో అన్ని పార్టీలు ప్రచారా వేగాన్ని పెంచాయి. ప్రధాన పార్టీలైన టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ తో పాటు బీఎస్పీ, తెలంగాణ జనసమితి, ప్రజాశాంతి పార్టీ అభ్యర్థులతో పాటు స్వతంత్య్ర అభ్యర్థులు సైతం ప్రచారంలో తమ జోరు కొనసాగిస్తున్నారు.
అయితే అన్ని పార్టీల అభ్యర్థుల ప్రచారం ఒక ఎత్తైతే ప్రజాశాంతి పార్టీ అధినేత, మునుగోడు ఉప ఎన్నికలో ఆ పార్టీ తరపున పోటీ చేస్తున్న కేఏ.పాల్ ప్రచారం ఒక ఎత్తు అని చెప్పాలి. కొత్త కొత్త హామీలతో, తన సంభాషణతో ప్రచారంలో ఫుల్ గా దూసుకుపోతున్నారు పాల్. ఇటీవల ఎన్నికల ప్రచారంలో డాన్స్ చేస్తూ స్టెప్పులేసిన కె ఏ పాల్, రోజుకో రకమైన గెటప్ లో ప్రచారం చేస్తూ కాబోయే సీఎం తానేనంటూ ప్రజలకు చెబుతున్నారు.
కాగా తాజాగా కేఏ పాల్... రైతు వేషధారణలో ప్రత్యక్షమయ్యారు. తలకు కండువా కట్టుకుని చేతిలో కర్ర పట్టుకొని, రైతులతో కలిసి కాసేపు ముచ్చటించారు. వారితో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అలాగే రైతుల సమస్యలను తాను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. పొరపాటున కూడా మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయవద్దని కె ఏ పాల్ చెప్పారు. కెసిఆర్ కు ఓటు వేస్తే అభివృద్ధి జరగదని కె ఏ పాల్ వెల్లడించారు. అంతే కాకుండా సైకిల్ తొక్కుతూ పొలంబాట పట్టారు. రైతులు, వ్యాపారులు, చేతివృత్తుల వారు ఇలా ఎవర్ని వదలడం లేదు కేఏ పాల్. మునుగోడులో అన్నీ పార్టీలకు చెందిన నేతలు చేస్తున్న ప్రచారం కంటే ప్రజాశాంతి పార్టీ నేత కేఏ పాల్ మాత్రం అంతకు మించిన రెట్టింపు ఉత్సాహంతో ప్రచారం చేస్తున్నారు. మరి చూడాలి ఈ ఉప ఎన్నికలలో ఎవరు గెలుస్తారో అని...