దీనస్థితిలో ప్రముఖ నటీమణి...
సినీరంగాన్ని రంగుల లోకంగా అభివర్ణిస్తారు. అయితే, ఇక్కడ అదృష్టం, దురదృష్టం దోబూచులాడుతూంటాయి. ఎప్పుడు ఎవరిని అదృష్టం వరిస్తుందో, ఎప్పుడు ఎవరిని దురదృష్టం కాటేస్తుందో చెప్పలేం. ఒకరకంగా చెప్పాలంటే నిత్యం జయాపజయాలు, అదృష్ట దురదృష్టాలు నిత్యం సినీరంగంలోని అందరి జీవితాలనూ మార్చేస్తూంటాయి. ఒకసారి అందలమెక్కించే అవకాశాలు, ఒకసారి కనుమరుగై వారిని అధోగతిపాలు చేస్తూంటాయి.
అలా దక్షిణాది సినీ రంగంలో ప్రముఖ నటిగా గుర్తింపు పొందిన జయకుమారి ఇప్పుడు దీనస్థితిలో ఉన్నారు. 70 ఏళ్ల జయకుమారికి రెండు కిడ్నీలు పాడయ్యాయి. అయితే, ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందేందుకు డబ్బు లేకపోవడంతో ఆమె చెన్నై ప్రభుత్వాసుపత్రిలో చేరారు. జయకుమారి చెన్నైలోని వేలచ్చేరి ప్రాంతంలో నివసిస్తున్నారు. ఆమెకు ఓ కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
జయకుమారి తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో 400కి పైగా చిత్రాల్లో నటించారు. తన నటనతో, నృత్యంతో భాషలకు అతీతంగా ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఆమె భర్త అబ్దుల్లా చాలాకాలం కిందే మరణించారు. కాగా, చెన్నై ప్రభుత్వాసుపత్రిలో జయకుమారి చికిత్స పొందుతున్న ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో సినీప్రియుల హృదయాలను కలచివేస్తున్నాయి.
