Tollywood Updates: నా పాత్ర ఫన్ పటాకాలా వుంటుంది, ఓ గ్రామ సర్పంచ్‌గా : హీరోయిన్ కృతి శెట్టి
కింగ్ అక్కినేని నాగార్జున, యువసామ్రాట్ నాగచైతన్య, రమ్యకృష్ణ, కృతి శెట్టి కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం `బంగార్రాజు`. అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై.లి., జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి నాగార్జున నిర్మాతగా వ్యవహరించారు. కళ్యాణ్ కృష్ణ దర్శకుడు. ఈ చిత్రం సంక్రాంతి సందర్భంగా జనవరి 14న థియేటర్లలో విడుదలకానుంది. ఈ సందర్భంగా నాయిక కృతిశెట్టి చిత్రంగురించి పలు విషయాలను ఇలా తెలియజేస్తున్నారు.
నా పాత్ర ఫన్ పటాకాలా వుంటుంది. ఓ గ్రామ సర్పంచ్‌గా చేశాను. సర్పంచ్ అంటే స్పీచ్‌లు ఇవ్వాలి. నాకు అది కొత్తగా అనిపించింది. సహజంగా డైలాగ్ పేపర్ ఇవ్వగానే నాకు కొంచెం అర్థం అవుతుంది. కానీ ఇందులోని డైలాగ్స్‌లో ఇప్పటి వరకు వినని చాలా కొత్త పదాలు తెలుసుకున్నా.
సోగ్గాడే చిన్ని నాయనా సినిమాను 2020లోనే చూశాను. అందుకే బంగార్రాజు సినిమా చేసేటప్పుడు ఒత్తిడి అనిపించలేదు. ఆ సినిమాలో కామెడీ టైమింగ్ నాకు బాగా నచ్చింది. నాకు తెలుగు రాకపోయినా సినిమాకు కనెక్ట్ అయ్యాను. అందులో నాగ్ సార్ తోపాటు ఇతర పాత్రలు బాగా ఎంజాయ్ చేశాను. బంగార్రాజులో ఫోక్ సాంగ్ చేశాను. చాలా ప్రత్యేకంగా వుంటుంది. నాకు డాన్స్ అంటే చాలా ఇష్టం. ఈ సాంగ్ చేసేటప్పుడు కాస్త ఒత్తిడి అనిపించినా ప్రేక్షకుల కోసం బాగా చేయాలి అనే ఫీల్‌తో ఎంజాయ్ చేసి చేశాను.సంక్రాంతి గురించి నాగ్ సార్ కూడా ఓ సందర్భంలో అన్నారు. బంగార్రాజు చక్కటి కథ. పండుగకు తీసిన సినిమా. మా తెలుగు ప్రేక్షకులకు పండుగలాంటి సినిమాలు అంటే ఇష్టం. అందుకే సంక్రాంతి పెద్ద పండుగ కాబట్టి నాగార్జున సార్ చెప్పాక నేను పాత్ర బాగా చేయడానికి ఉపయోగపడింది.