Ayodya Rama Mandir Temple Tour : అల అయోధ్యా పురమున 'బాలరామ' సందర్శన ఎలా జరిగినదంటే...
టైమ్ లెస్ హెరిటేజ్- మోడ్రన్ మార్వెల్ - ఇదీ అయోధ్య రామ మందిర నిర్మాణానికి పెట్టిన క్యాప్షన్.. ప్రత్యేక కధనం by జర్నలిస్ట్ ఆది
మాకు మా నెట్ వర్క్ కవరేజ్ కారణంగా అయోధ్య సందర్శించే అవకాశం లభించింది. నన్ను నేషనల్ జర్నలిస్టును చేసిన అనుభవంగా దీన్ని చెప్పాలి. ఏరోజైతే.. బాలరామ ప్రాణ ప్రతిష్ట జరిగిందో.. ఆ రోజే వెళ్లాల్సింది. కానీ, ఫ్లైట్ చార్జెస్ చూస్తే సుమారు 50 వేల వరకూ చూపించాయి (ఇద్దరికి) నేను మా కెమెరామెన్ తో కలుపుకుని. ఎట్టకేలకు రెండ్రోజుల తర్వాత రామ జన్మభూమికి ఫ్లైట్ ఎక్కే ఛాన్స్ దొరికింది. నిజానికి నేను ఉత్తర దక్షిణ భారత యాత్రలన్నీ కారు- ట్రైన్- బస్సు తదితరంగా చేసినవే. సుమారు ఓ 20- 30 వేల కిలోమీటర్ల మేర ప్రయాణించి ఉంటాన్నేను.. (యాత్రల పేరిట) వీటన్నిటిలోనూ విమాన యాత్ర మాత్రం ఇదే తొలిసారి. నా జీవితానికి విమానం ఎక్కుట అనే సన్నివేశం ఇదే ఇదే.
విమానం ఎక్కిన కోటాను కోట్ల మందిలో నేనూ ఒకడ్ని. అలాగని నాకేం పెద్ద నర్వస్ గా అనిపించలేదు. విమానయాన వ్యవస్థ చాలా చాలా పకడ్బందీగా నడుస్తోంది. టేకాఫ్, ల్యాండింగ్స్ లో మనం అప్పుడప్పుడూ చూసే యూట్యూబ్ వీడియోస్, ఇతర ఫ్లైట్ ఓరియెంటెడ్ మూవీస్ లో చూసినంత హారిబుల్ గా ఏమీ లేదు. అంతా ప్లెయిన్ సీనరీసే.. నో హర్రర్\ థ్రిల్లర్స్ అట్ ఆల్. అయితే సీటు ఎదురుగా ఒకటి రాసి ఉంటుంది.. లైఫ్ వెస్ట్ అండర్ యువర్ సీట్ అని. ఇదే చాలా బాగా అనిపించింది నాకు. మీ లైఫ్ జాకెట్ మీ సీటు కిందే ఉందన్న మాట అర్ధం అలా ఉంచితే.. మీ జీవితమైతే.. మీ సీటు కిందే ఉంటుంది మీరు వెతుక్కుంటే అన్న అర్ధం ధ్వనించింది నాకు.
అలా అలా టీవీల్లో యాంకరమ్మగానీ మాటి మాటికీ మన కళ్లను ఆకర్షించినట్టుగా.. ఫ్లైటులోని అటెండరమ్మ\ హోస్టెసమ్మ మనల్ని ఏదో ఒక కారణంగా పలకరిస్తూనే ఉంటుంది. ఎట్టకేలకు హైదరాబాద్ టు లక్నో ఫ్లైట్ దిగిన వెంటనే 10 డిగ్రీల టెంపరేచర్ ఉందన్న అనౌన్స్ మెంట్ విని.. హమ్మయ్య మనం చలికోటు తెచ్చుకోవడం చాలా మంచిదైందని అనిపించింది. ఆ తర్వాత మేం లక్నో ఎయిర్ పోర్టు ఎదురుగా ఉన్న మెట్రో ఎక్కితే. అదంతా పూర్తి ఖాళీ. హే. హే. హే.. ఇదే మన మెట్రో అయితేనా.. అంటూ అదేదో సినిమాలో రావు రమేష్ లాంటి ఎక్స్ ప్రెషన్ ఇచ్చాన్నేను. ఎయిర్ పోర్ట్- మెట్రో కదా? అలాగే ఉంటుంది. ముందు ముందు ఎక్కుతారు చూడు అంటూ ఆ లక్నో లవర్ మాకు ఆన్సరిచ్చాడు. అది వేరే విషయం అనుకోండి.
ఆలంబాగ్ బస్ స్టాప్ లో దిగి.. అయోధ్యకు ఎర్ర బస్సు ఎన్నింటికని అడిగాం. మీరు ఎప్పుడు బయలుదేరితే అప్పుడే అనడంతో.. మొదట ఎయిర్ బస్సు ఎక్కుతున్నామంత సంబరంలో పడి.. ఆ వేల్టికి భోజనం చేయలేదని గుర్తొచ్చింది. సర్లే ఫ్లైట్ లో ఏదైనా తిందాం అనుకుంటే.. డబ్బు చేతిలో ఉండాలి. లేదా ముందే మన టికెట్ తో పాటు బుక్ చేసుకోనైనా చేసుకోవాలి. హార్డ్ క్యాష్ లేకుండా.. ఫోన్ పే, గుగుల్ పే విమానంలో నడవదు. దీంతో చేసేది లేక బస్టాండ్ చేరిన వెంటనే.. పక్కనే ఉన్న పంచముఖ్ అనే ఒక హోటల్ లో ఆలూ పరోటాతో ఉత్తరాది తిండి తినడం స్టార్ట్ చేశాం.
ఆపై సాయంత్రం ఆరున్నరకు బస్సు ఎక్కితే.. ఆ మంచు లో ఆ ఫాగ్ లో ఆ మిస్ట్ లో మా అయోధ్య రహదారి పయనం.. అలా అలా.. సాగుతూ వెళ్లింది. ఎందుకంటే అక్కడ అయిదింటి నుంచే పది డిగ్రీల టెంపరేచర్ ఉంటుంది. రాత్రయ్యే కొద్దీ అది 8- 6- 4 అంటూ పడిపోతూ వస్తుంది. దీంతో ప్రయాణం ఏమంత వేగంగా సాగదు. ఆచి. తుచి బండి నడపాల్సి వస్తుంది. దీంతో 140 కిలోమీటర్ల ప్రయాణం సుమారు 4 గంటలు పైగా పట్టింది. ఎట్టకేలకు రాత్రి పది- పదిన్నర మధ్య అయోధ్యలో అడుగు పెట్టాం. అంతా మంచు. ముందు వెనక ఏం జరుగుతుందో అర్ధంకాని పరిస్థితి. ఎట్టకేలకు ఓ ఆటోవాలాను పట్టుకుని ఒక మాన్షన్ వెళ్లాం. అక్కడ 1500కి రూమ్ ఇస్తా అన్నాడు కానీ, వైఫై ఉండదన్నాడు. మాదసలే.. ఫీడ్ పంపాల్సిన పరిస్థితి. దీంతో మేం రామకృష్ణ పేలస్ అనే మరో హోమ్ స్టేని ఆశ్రయించాం. కాకుంటే అది డబుల్ బెడ్\ హాట్ వాటర్ విత్ వైఫైఫెసిలిటీతో కూడుకున్నది కావడంతో ఓకే అని దిగేశాం.
ఇక రామ మందిరం దాని పరిసరాలు ఇతరత్రా వ్యవహారాలను షూట్ చేయడానికి కెమెరా గట్రా చేతబట్టి ఉదయాన్నే రంగంలోకి దిగేశాం. అల అయోధ్య పురమున అడుగు బెట్టిన వెంటనే ఆ ఉదయకాలంలో.. మొదటగా నా దృష్టిని ఆకర్షించినవి మాత్రం కోతులే. ఏంటి ఇక్కడ ఇవి ఇంతగా ఉన్నాయని అడిగితే.. హనుమాన్ కా రూప్ అంటూ దండం పెట్టాడో అయోధ్య వాసి. అంతే కాదు వాటితో మా సహజీవనం ఈనాటిది కాదు. తర తరాల నాటిది. ఆ మాటకొస్తే మీరిక్కడ తొలిగా దర్శించుకోవల్సింది కూడా భజరంగ్ నే. హనుమాన్ గడీలో ఉంటాడు. మరచిపోకండి. రండి.. చలి కాచుకుందురుగానీ అన్నాడతను.
ఇక్కడ మరో ముచ్చట కూడా ఎక్కువగా కనిపిస్తుంది. అదే.. చలి మంట. మనమిక్కడ ఎవరైన అతిథులు వచ్చినపుడు కాఫీ, టీ ఎలా ఆఫర్ చేస్తామో అయోధ్యలో చలి మంటను ఆఫర్ చేస్తారు. రండి ఇక్కడ చలికాచుకుందురు రండంటూ సాదరంగా ఆహ్వానిస్తారు. అయోధ్యలో అడుగడుగున హనుమత్ రూపాలే అన్న స్టోరీ షూట్ చేశాక.. ఒక కోట కనిపించింది. అదేంటని విచారించగా అది బిబ్లిమోహన్ మిశ్రా అనే రాజుదట. సుమారు 900 ఏళ్లనాటి ఆ కోట లోపలికి అడుగు పెట్టనివ్వలేదు సెక్యూరిటీ. ఈ రాజు అయోధ్య జన్మభూమి ట్రస్ట్ మెంబర్ కూడా. కావాలంటే గుగుల్ చేసుకోమని మమ్మల్ని లోపలికి అడుగు పెట్టనివ్వలేదు. అదేమంటే మీరు షూట్ చేసిన ప్రతిదీ అక్కడ సీసీ టీవీలో రికార్డవుతుంది- నా జాబ్ పోతుందని అన్నాడతడు.
దీంతో ఆ కోట సింహద్వారం పై భాగాలు షూట్ చేసుకుని.. ఎదురుగా ఉన్న శివ్ కేశవ్ చిన్న చిన్న గుడులను చిత్రించి.. ఆ ప్రాంతానికి అవసరమైన గ్లౌజులు, సాక్సులు, మంకీ క్యాపులు, హాఫ్ కోట్స్ వంటివి కొనుక్కుని రూమ్ కి వచ్చేశాం.ఆ రోజంతా అయోధ్య పురవీధులన్నిటినీ షూట్ చేసి.. అక్కడి రాజ్ దర్బార్ దగ్గరకు వచ్చాం. రాజ్ దర్బార్ లో రామ లక్ష్మణ జానకి- జై బోలో హనుమాన్ కి.. కొలువై ఉన్నారు.(ఇది సరిగ్గా హనుమాన్ గర్హికి ఎదురుగా ఉంటుంది. ఇక్కడి హనుమంతుడి ప్రతిమ చాలా చాలా వెరైటీగా ఉంటుంది. అచ్చం మనిషిలాగానే ఉంటుంది. దీన్ని తప్పక గుర్తించాలి మనం. ఈదర్బారులో రాముడు కొలువై ఉంటాడని. ఆయన్ను చూడ్డానికి త్రిమూర్తులు సైతం ఇక్కడికి వస్తారని. ఈ దర్బార్ గురించి రామచరిత మానస్ లో ఉంది కావాలంటే చూసుకోవచ్చని అన్నాడక్కడి పండిట్.
అదంతా షూట్ చేసుకుని ఎట్టకేలకు ఆనాటి చిత్రణ ముగించుకుని రూము బాట పట్టాం. రూములో కాళ్లు కడుక్కుందామన్నా చేతులు కడుక్కుందామన్నా ధైర్యం చాలడం లేదు. ప్రతిదానికీ హాట్ వాటర్ కావల్సిందే. అంతగా గజగజలాడించే చలి పులి. మేం వార్తల్లో చలి పులి పంజా చలి పులి పంజా అని రాసేవాళ్లం. అది నేటికి పూరా అనుభవంలోకి వచ్చినట్టయ్యింది. ఇక్కడ పెద్ద పెద్ద పోలీసు అధికారులతో సహా చేసే పనల్లా ఒక్కటే. ఎక్కడ ఏ చెత్త- చెదారం కనిపిస్తుందా.. దాన్ని మంటలో వేసి చలి కాచుకుందామా అనే చూస్తారు. ఆ మాటకొస్తే ప్రభుత్వ పరంగా వీధుల్లో గ్యాస్ హీటర్స్ పెట్టి ఉంచుతారు. దీపపు స్తంభాల్లాగా.. ఇక్కడ తప్ప మరెక్కడా కనిపించవవి.
అలా మర్నాటి ఉదయం లేవగానే.. మొదట రామ్ లల్లా దర్శనానికి వెళ్లాం. దర్శానికి పెద్దగా టైం తీసుకోదని తెలిసింది. ఇక్కడ ఏదైనా క్యూ ఉంటుందంటే అది మన ఫోన్లు, ఇతర సామాన్లు పెట్టుకునే లాకర్ క్యూ లైన్లోనే. ఆలయం లోపలికి తొలి ఒకటి రెండు రోజులు ఫోన్లు అనుమతించినా.. తర్వాతర్వాత వాటిని బంద్ చేసేశారు. బాలరామ దర్శనానికి వెళ్లే మన చెంత ఏ వస్తువు ఉండకూడదు. కేవలం మన చలి దుస్తులతో కూడిన బాడీ తప్ప మరేదీ అనుమతించరు. అయితే మేం వెళ్లిన రోజు 20 నిమిషాలకే దర్శనం అయిపోయింది. ఇక రామాలయం ఎలా ఉందని చూస్తే.. నిజంగా అదొక అద్భుతం. ముందుగా మనకు సింహ ద్వారాన్ని సూచించే విధంగా.. మొదట రెండు సింహాలు. తర్వాత రెండు గజాలు. ఆపై హనుమంత, గరుడ విగ్రహాలు దర్శనమిచ్చాయి.
ఇక ఆలయం లోపలికి వెళ్లే కొద్దీ వివిధ రకరకాల ఆకృతులు. మరీ ముఖ్యంగా వినాయక, లక్ష్మీ, సరస్వతీ, శివ విగ్రహాలు చెక్కినట్టు కనిపించారు. ఇది వైష్ణవాలయం కదా? అన్న కోణంలో వాళ్లేమీ శివుడ్ని అవాయిడ్ చేయలేదు. లోపల రెండు డోమ్ లు కనిపిస్తే.. వాటిలో ఒకటి గజ వృత్తం, రెండోది నాగ వృత్తం కనిపించాయి. ఇక రామ్ లల్లా విగ్రహం. ఈ విగ్రహానికి సంబంధించిన ముఖ్య విషయాలు రెండున్నాయి. మొదటిది ఇక్కడ బాలరాముడి విగ్రహం దొరికాకే.. కేసు ఒక కొలిక్కి వచ్చిందని అన్నారు. రెండోది.. ఇది దక్షిణాది విగ్రహం. చాలా మంది సౌతిండియన్స్ కి ఇదొక స్పెషల్ అట్రాక్షన్. కొందరు దక్షిణాదీయులు అన్న మాట ఏమిటంటే.. ఉత్తరాదిన ఉన్న పార్లమెంటులో మన దక్షిణాది ప్రధాని కూడా సరిగ్గా ఇలాగే ప్రతిష్టుడు కావాలని.
ఇక ఆలయ రాతి నిర్మాణ విషయానికి వస్తే ఇక్కడికి దగ్గర్లో రామ్ కి పత్తర్ అనే ఒక ప్రాంగణం ఉంటుంది. ఈ ప్రాంగణంలోనే.. ఈ మొత్తం ఆలయాన్ని చెక్కింది. ఇది ఎలాంటి కెమికల్స్, సిమెంట్ వాడకుండా నిర్మించిన ఆలయం. అంతే కాదు సుమారు 2500 ఏళ్ల పాటు నిలిచి ఉండేలా నిర్మించిన దివ్య భవ్య మందిరం. వంద భూకంపాలు వచ్చినా నిలబడే శక్తి సామర్ధ్యం ఈ నిర్మాణం సొంతం. ఇలాంటి ప్రత్యేకతలు ఈ రామాలయానికి చాలానే ఉంటాయి. మేం ఆలయ సందర్శనం చాలా చాలా త్వరగా ముగించేశాం కానీ.. ఆ తర్వాత రోజు వీకెండ్ కావడంతో జనం తండోపతండాలుగా వచ్చేశారు. అయోధ్య పురవీధుల నిండా జనమే జనం. చాలా మంది అనుమానమేంటంటే.. మనం వెళ్తే ఫుల్ రష్ ఉంటుంది. కాబట్టి కాస్త లేట్ గా వెళ్దాం అని భావించే వాళ్లే ఎక్కువ. ఈ విషయం మాకు చాలా మంది టూరిస్టులు అంటుంటే కని\వినిపించింది. అలాంటి తెలుగు వారిని చాలా మందిని ఇంటర్వ్యూలను చేశాం. వాటిలో ఒక హోటల్లో తెలుగు కుటుంబంతో చేసిన డైనింగ్ టేబుల్ ఇంటర్వ్యూ. ఆపై రామ్ పహడీ దగ్గర చేసిన కాన్పూర్ కుర్రాడి ఇంటర్వ్యూ నాకు చాలా బాగా అనిపించాయి.
ఇక ఆ రోజు రాత్రి మేం లతామంగేష్కర్ చౌక్ వెళ్లాం. ఇక్కడ ఒక వీణ ఆకృతి ఉంటుంది. ఇందులోంచి లతా పాడిన పాటలు వీనుల విందుగా ఉంటాయి. ఎస్పీ బాలుకి మనంగానీ తెలుగు రాష్ట్రాల్లో ఏదైనా స్మృతి నిర్మాణం చేయాలంటే.. ఇలాంటి ఏర్పాటు చేస్తే బావుంటుందని ఆ వీణ ముందు నిలబడి రిపోర్ట్ చేశాన్నేను. రిపోర్ట్ అంటే గుర్తుకు వచ్చింది. ఆలయాన్ని అత్యంత దగ్గర్లో షూట్ చేయాలన్న ఆతృత కొద్దీ.. ఒక అఖాడాకు వెళ్లి పై నుంచి రామ్ లల్లా మందిరం కనిపించేలా.. ఒక రిపోర్టింగ్ చేశాన్నేను. ఆ తర్వాత పోలీసులు మమ్మల్ని పట్టుకుని.. మా ఫీడ్ మొత్తం డిలీట్ చేయించడం మాత్రమే కాదు.. మమ్మల్ని దాదాపు అరెస్టు చేసి.. మా కెమెరా గట్రా జప్తు చేసినంత పని చేశారు. కానీ మా కేమ్ మేన్ నృపాల్ ఎలాగోలా వారి నుంచి ఫీడ్ ని రక్షించాడు అది వేరే విషయంలెండి.
ఇక లతా మంగేష్కర్ చౌక్ దగ్గరకొస్తే.. ఇక్కడి నుంచి లెఫ్ట్ కి వెళ్తే వాల్మీకి ఎయిర్ పోర్ట్ వస్తుంది. ఇక్కడ ఎయిర్ పోర్టు విషయానికి వస్తే ఇదింకా రెడీ కాక పోవడంతో.. చాలా మంది లక్నో కి వస్తున్నారు. కొందరు వారణాశి మరికొందరు ఢిల్లీకి వచ్చి అయోధ్య బాట పడుతున్నారు. అయోధ్య టు ఢిల్లీ 9గంటల ప్రయాణం. ఇక ఇక్కడి నుంచి నైమిశారణ్యం 130 కి. మీ దూరం మాత్రమేనట. లతామంగేష్కర్ చౌక్ నుంచి రైట్ తీస్కుంటే ఇక్కడ రామ్ పహడీ ఉంటుంది. అంటే ఇది రాముడు ఆయన పరివారం స్నానాలాడిన చోటుగా చెబుతారు. దీనికి ఆవల వైపు సరయూ నది ఉంటుంది. ఇక్కడ ప్రతి రోజు రాత్రి 7 గంటల సమయంలో హారతి ఉంటుంది. ఇక అయోధ్య ప్రాణ ప్రతిష్ట సందర్భంగా రామ్ పహడీలో ప్రతి రోజూ రాత్రి సమయాల్లో రామ్ చరిత్ర, లేజర్ షో వేస్తారు. ఇది నయనానందకరంగా ఉంటుంది.. ఎవరైనా అయోధ్య వెళ్లే వాళ్లు రాత్రి పూట ఈ అందాలను తప్పక తిలకించాలి.
ఇక అయోధ్య టూర్ లో ముఖ్యంగా చూడాల్సిన మరో ప్రదేశం.. కనక భవన్. కనక భవన్ కైకేయి సీతకు ఇచ్చిన బహుమతిగా చెబుతారు. ఇదే భవనంతో పాటు మనం దశరథ మహల్ కూడా దర్శించుకోవచ్చు. దశరథ మహల్లో మనకు బాలరాముడి చిత్రం ఉంటుంది. బహుశా ఈ చిత్రాన్ని చూసే బాలరాముడి విగ్రహం చెక్కి ఉంటారు. ఇదిలా ఉంటే కనక మహల్లో సీతామతల్లి.. లడ్డూ గోపాల్ అనే భగవాన్ని కొలిచిందని అంటారు. ఇది వచ్చే ద్వాపర యుగంలోని రాముడి అవతారమైన కృష్ణ భగవానుడ్ని సూచించేదని అంటారు. మాకు దశరథ మహల్లో డాక్టర్ రామావతార్ శర్మ తాను రచించిన పుస్తకంలో.. రామాయణం సాగిన 290 ప్రాంతాలకు సంబంధించిన ఆధారాలు చూపించారు. రామ. ఆయనం అంటే రాముడు పయనించిన ప్రాంతాలనీ. ఈ ప్రాంతాల్లో మన తెలంగాణలో ఆరు ప్రాంతాలున్నాయని. వాటిలో పర్ణశాల, భద్రాద్రి వంటి ప్రాంతాలున్నాయని అన్నాడాయన.
రామ్ కి పత్తర్ వెళ్లిన వారికి అక్కడ రామాలయ నమూనా తో పాటు అక్కడ ఎందరు శిల్పులు ఎన్నేసి రోజుల నుంచి ఎంత శ్రద్ధాశక్తులతో ఈ ఆలయ నిర్మాణానికి సంబంధించిన శిలలు చెక్కుతున్నారో చూడవచ్చు. ఎందుకంటే రామాలయ నిర్మాణం కాదోయ్- రాళ్లెత్తిన కూలీలెవరూ అంటూ మీకు శ్రీశ్రీ ప్రశ్న ఖచ్చితంగా వినిపిస్తుంది కాబట్టి.. రామ్ కీ పత్తర్ వెళ్లండి. అక్కడ రాముడికి బహుమతిగా వచ్చిన పెద్ద గంట కూడా ఉంటుంది చూడండి. అయోధ్య పురవీధుల్లో మంగళ్ దీప్ వాళ్లు అక్కడక్కడా పెద్ద పెద్ద అగర్ బత్తీల స్టాండ్స్ పెట్టి సువాసనలు వెదజల్లుతున్న దీశ్యాలు మీకు కనిపిస్తాయి. భలే మంచి చౌక ప్రచారమూ అంటూ వాటినీ ఆస్వాదించండి.
అయోధ్య టూర్ లో ముఖ్యంగా చేయాల్సిన మరో సందర్శన. దశరథ సమాధి. ఈ సమాధి 15 కి. మీ. దూరంలో ఉంటుంది. ఇక్కడ దశరథుడ్ని దహనం చేశారట. ఈ విషయం గుర్తించి చాలా కాలం తర్వాత ఈ సమాధి మందిరం నిర్మించారని అంటారు. ఈ మందిరం చూస్తే మనకు ఆనాడు దశరథుడు తన పెద్ద కొడుకు రాముడికి పట్టాభిషేకం జరగడం లేదన్న చింత.. దాని తో పాటు ఆయన 14 ఏళ్ల అరణ్యవాసం వెళ్తున్నాడన్న ఆందోళన కారణంగా అసువులు బాసిన రామాయణ కథా సంవిధానం జ్ఞప్తికి రావడం ఖాయం.
ఈ మందిర దర్శనం తర్వాత ఇక్కడి నుంచి మరో 10 కి. మీ దూరంలోని భరత్ కుండ్ తప్పక దర్శించాలి. భరత్ కుండ్ లో మొదట దర్శించాల్సిన చోటు భరత్- హనుమాన్ ఆలింగన విగ్రహ మందిరం. తన అన్న పాదుకలను 14 ఏళ్ల పాటు సింహాసనం మీద ఉంచి.. భరతుడు నందిగ్రామ్ అనే గ్రామంలో తపస్సు చేశాడని అంటారు. కాలపరిమితి తీరాక.. తన అన్న రావడం లేదన్న చింతతో భరతుడు తన తండ్రిలాగానే ప్రాణత్యాగం చేయాలన్న ఆలోచన చేస్తుండగా.. తన మనో నేత్రంతో ఈ విషయం గ్రహించిన రాముడు ఇక్కడికి హనుమంతుడ్ని పంపాడట. ఒక బ్రాహ్మణ్ రూపంలో హనుమ భరతుడి ఆందోళన ప్రాణ త్యాగ చింతన గుర్తించి.. మీ అన్నయ్య వస్తున్నాడన్న శుభవార్త చేరవేశాడని. దీంతో ఎంతో సంతోషంగా ఆలింగనం చేసుకున్న భరతుడికి గుర్తుగా ఇక్కడి విగ్రహం మనకు దర్శనమిస్తుంది. ఈ ప్రాంగణంలో గౌతమ్ శాస్త్రి అనే బాల పండితుడు మాకీ విషయం చాలా చక్కగా చెప్పాడు.
ఇదిలా ఉంటే.. ఇదే ప్రాంగణంలో రామనామ సంకీర్తనం వినిపించగా అక్కడికి వెళ్లాం. అక్కడ ఇద్దరు ముసలి వాళ్లు జై సీతారామ్ అంటూ నిత్య సంకీర్తన చేస్తున్నారు. ఎందుకిలా చేస్తున్నారంటే.. భరతుడు ఇక్కడే సీతారామ్ అంటూ జపం చేశాడని. దాన్నే మేము కొనసాగిస్తున్నామని అన్నారా వృద్ధ భక్తులు. ఆ పక్కనే మరో మందిరం ఉంది. అక్కడ 8 అడుగుల లోతులో మరో భరతుడి ఆవాసం ఉంది. ఆయన ఈ ప్రాంతంలో ఎక్కడైతే.. కూర్చుని తపమాచరించాడో.. వాటన్నిటిలోనూ.. మందిరాలు నిర్మించారు. ఈ 8 అడుగుల లోతైన మందిరానికి యూపీ సీఎం యోగి ఆదిత్య నాథ్ కూడా వచ్చినట్టు ఫోటో కనిపించింది. ఆ పండితుడ్ని అడిగితే.. అయోధ్య వచ్చిన వారు భరత్ కుండ్ తప్పక సందర్శించాలని. అప్పుడే రామ దర్శన పుణ్యం ఫలప్రదం అవుతుందని అన్నాడు.
ఇక అక్కడి నుంచి ఇక్కడ ఉన్న కోనేటికి వచ్చాం. ఈ కోనేటిలో ఒక పడవ ఉంటుంది. ఎంత తీసుకుంటావని అడిగితే కేవలం 30 మాత్రమే అన్నాడు. ఎగిరి గంతేసినంత పనైంది. ఎందుకంటే ఇంత చీప్ గా మనకు ఎక్కడా పడవ ప్రయాణం లభించదు కాబట్టి. వెంటనే నేను, మా కెమెరా మెన్ నృపాల్ ఎక్కి.. ఒక్కసారి బోటు షికారు చేశాం. ఇదే ప్రాంగణంలోని ఆలయంలో రామ పరివార ఆలయం ఉంది. అందులో ఇక్కడ రాముడు సీతా లక్ష్మణ సమేతంగా బోటు షికారు చేసిన చిత్రం గమనించి.. నాకు రామయ తండ్రీ ఓ రామయ తండ్రీ నా సామి వంటే నువ్వేలే రామయ తండ్రీ పాట గుర్తుకొచ్చింది. నీ కాలి దుమ్ము తగిలి రాయి ఆడది అయినాదంట అన్న చరణం మరింత ఎక్కువ గుర్తొచ్చింది. ఆ పాట అలా పాడుకుంటూ.. బోటు షికారు చేసి.. తిరిగి అయోధ్య పయనమయ్యాం.
ఈ క్రమంలో మేం సరయూ నది పరివాహక ప్రాంతమంతా అత్యంత శ్రద్దగా పరిశీలించాం. ఏపీ\ తెలంగాణలో లాగా.. ఇక్కడ అంతగా గ్రామీణ అభివృద్ధి ఏమీ పెద్దగా జరిగినట్టు కనిపించదు.(అయితే అడుగడుగునా బుల్డోజర్లయితే కనిపించాయ్. ఎంతైనా యోగిది బుల్డోజర్ సర్కార్ కదా) మరీ ముఖ్యంగా ఏపీలో ప్రతి ఊళ్లోనూ... సచివాలయం, విలేజ్ క్లీనిక్స్, రైతు భరోసా కేంద్రాలు.. డిజిటిల్ లైబ్రరీలు, ఇంకా ఎన్నో వసతులు కనిపిస్తాయి. యూపీలో అలాంటి అభివృద్ధి నమూనాలను దర్శించలేక పోయాం. గుడుల మధ్య బడులును వెతుక్కోవలసి వచ్చింది. అయితే ఇక్కడి జనం ఎలాంటి అసంతృప్త జ్వాలలతో ఉన్నట్టే కనిపించదు. ఉత్తర ప్రదేశ్ వాసులు చాల చాలా మర్యాదస్తులు. మహరాజ్, దాదా, బాబా అంటూ నన్ను చాలా బాగా గౌరవించారు.
వీళ్లు పశులును ఎంత బాగా చూసుకుంటారంటే.. ఈ చలికి వాటి ఆరోగ్యం దెబ్బ తినకుండా ఉండేందుకు దుప్పట్లు, గోనె సంచులు కప్పుతారు. మరీ గొర్రెలకైతే.. వీరు స్వెట్టర్లు తొడిగిన దృశ్యాలను చూశాం. మాంసాహారం చాలా చాలా తక్కువ. గుడ్లు కూడా చాలా చాలా రేర్ గా కనిపించాయి. తిరిగి లక్నో వచ్చాం.. .లక్నో మహా నగరమే. కానీ హైదరాబాద్ లో టాప్ ఫైవ్ లో ఒకటి కాదు. అలా తిరిగి చౌదరి చరణ్ సింగ్ ఎయిర్ పోర్ట్ ఆఫ్ లక్నో చేరాం. సేమ్ రూట్ లోనే.. వయా మెట్రో. మా ఫ్లైట్ అరగంట ఆలస్యం.. కారణం- పొగమంచు దట్టంగా ఉండటం వల్ల. అలా పగలే కాకుండా రాత్రి కూడా విమాన యానం చేసిన అనుభూతికి లోనయ్యాను. చివరగా ఫ్లైట్ దిగుతుండగా.. నీ జీవితం నీ సీటు కిందే ఉంటుంది చూసుకోమంటూ చేసిన ఆ ప్రకటన ఒక స్నాప్ తీసుకుని.. విమానం దిగేశాం. అర్ధరాత్రి ఒకటిన్నరకు 300 రూపాయల ఛార్జీలతో మన టీఎస్ఆర్టీసీ బస్సు ఎక్కి నగర మధ్యానికి వచ్చి.. జై శ్రీరాం అన్నాం.
లాస్ట్ లైన్న
ఇదీ అల అయోధ్య ప్రయాణమున మాకు ఎదురైన అనుభవాలు. మీ అందరికీ కనీస సమాచారం అందించడానికి ఉపయోగ పడుతుందన్న ఆలోచనతో ఇదంతా రాసినది. దయ చేసి మన్నించవలసినదిగా మనవి.
ప్రత్యేక కధనం by జర్నలిస్ట్ ఆది