Tollywood News: ప్రముఖ నటుడు ఉత్తేజ్ శ్రీమతి పద్మ సంస్మరణ సభ !!!
ఉత్తేజ్.. ఇండస్ట్రీలో ఈ పేరు తెలీనివారంటూ ఎవరూ ఉండరు.. నటుడు, రచయిత, స్నేహశీలి, చిత్ర పరిశ్రమలోని ప్రతీ ఒక్కరోతోనూ సత్ సంబంధాలు కలిగినటువంటి మంచి మనిషి ఉత్తేజ్. రీసెంట్ గా ఆయన సతీమణి శ్రీమతి పద్మ అనారోగ్య కారణంగా అకాల మరణం చెందిన విషయం అందరికీ తెలిసిందే.. ఈ విషయం ఇండస్ట్రీలో అందర్నీ కలచివేసింది.. మెగాస్టార్ చిరంజీవి హుటాహుటిన బసవతారకం కాన్సర్ హాస్పటల్ కు వెళ్లి ఉత్తేజ్ కుటుంబ సభ్యులను పరామర్శించారు.. అంతే కాకుండా మేమంతా నీకు అండగా ఉంటాం.. అని మనో ధైర్యాన్ని, కలిగించారు.. కాగా సెప్టెంబర్ 29న హైదరాబాద్ ఫిలింనగర్ ఎఫ్ఎన్ సిసి క్లబ్ లో ఉత్తేజ్ సతీమణి శ్రీమతి పద్మ సంస్మరణ సభ జరిగింది.. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి,మురళి మోహన్,ఏమ్.ఎల్.ఏ.మాగంటి గోపీనాథ్, దర్శకుల సంఘం అధ్యక్షుడు ఎన్.శంకర్, డా. రాజశేఖర్, మెగాబ్రదర్ నాగబాబు లతో పాటు ఎంతోమంది హీరోలు, దర్శకులు, నిర్మాతలు, సీనియర్ నటి నటులు హాజరయ్యి శ్రీమతి పద్మ కు ఘన నివాళి అర్పించారు..
ఈ సంతాప సభ లో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ " భార్యా వియోగం అన్నది చాలా దుర్భరం. అన్ని విధాల జీవితంలో సెటిల్ అవుతున్న సమయంలో పద్మ చనిపోవడం మమ్మల్ని అందరినీ కలిచివేసింది. ఈ వార్త విని నేను చలించిపోయాను. హిట్లర్ సినిమా నుండి ఉత్తేజ్ తో నాకు మంచి అనుబంధం ఏర్పడింది. ఈ ఆపద సమయంలో ఉత్తేజ్ కు మేము అందరం అండదండగా ఉంటాం. ఈ విషాదం నుండి ఉత్తేజ్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను " అన్నారు .
ఇంకా ఈ సంతాప సభలో హీరోలు డా. రాజశేఖర్ ,శ్రీకాంత్, ప్రముఖ రచయిత తనికెళ్ల భరణి , గీత రచయిత ఉత్తేజ్ మేనమామ సుద్దాల అశోక్ తేజ , దర్శకులు ఎస్.వి. కృష్ణారెడ్డి , నిర్మాత అచ్చిరెడ్డి, దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, యాంకర్ ఝాన్సీ, ప్రముఖ రంగస్థల నటుడు గుమ్మడి గోపాలకృష్ణ , నటి హేమ తదితరులు తమ సంతాపాన్ని తెలియజేస్తూ ఉత్తేజ్ కు ఆత్మస్థైర్యాన్ని పద్మకు ఆత్మ శాంతిని చేకూర్చాలని ఆకాంక్షించారు. ప్రముఖ జర్నలిస్ట్ ప్రభు ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించారు.