FILM REVIEW : 23 (ఇరవై మూడు) మూవీ రివ్యూ రేటింగ్ - Rating : 3.5/5
LATEST TELUGU MOVIES : మల్లేశం, 8:00 A.M. మెట్రో వంటి సినిమాలు డైరెక్ట్ చేసిన రాజ్ రాచకొండ దర్శకత్వంలో “23” అనే సినిమా రూపొందింది. వాస్తవానికి చరిత్రలో సంచలనానికి కేంద్ర బిందువులుగా మారిన చుండూరు ఘటనతో పాటు హైదరాబాద్ జూబ్లీహిల్స్ శ్రీరాములయ్య సినిమా షూటింగ్ బాంబ్ బ్లాస్ట్ కేసులతో పోల్చుకుంటూ, చిలకలూరిపేట బస్సు దహన కేసు నిందితుల శిక్ష వ్యవహారాన్ని ప్రస్తావిస్తున్నట్టు ప్రచార కంటెంట్‌తోనే స్పష్టత వచ్చేసింది. పెద్దగా పేరున్న నటీనటులు లేకపోయినా, మల్లేశం వంటి సినిమాతో హిట్ కొట్టిన దర్శకుడు కావడంతో ఈ సినిమా మీద ప్రేక్షకులలో ఆసక్తి ఏర్పడింది. మరి ఆ ఆసక్తిని సినిమా దర్శకుడు ఎంతవరకు సినిమాతో నిలబెట్టుకోగలిగాడు అనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం.
నటీనటులు : సాగర్ అనే పాత్రలో తేజ ఇమిడిపోయాడు. నిజంగా ఇతనే ఆ తప్పు చేసి ఇంత మథనపడుతున్నాడా అనిపించేలా ఆ పాత్రలో ఒదిగిపోయాడు. లాంచింగ్‌లో ఇలాంటి సవాలుతో కూడిన సబ్జెక్ట్ తీసుకోవడంతోనే తేజ సఫలమయ్యాడేమో అనిపిస్తుంది. ఇక సుశీల పాత్రలో తన్మయ ఒదిగిపోయింది. ఆమె కాకుండా ఇంకెవరూ అంతలా నటించలేరేమో అనిపించేలా ఆమె పాత్ర బాగుంది. పవన్, రమేష్, తాగుబోతు రమేష్, ఝాన్సీ, వేదవ్యాస్ వంటి వారు తమ పాత్రలకు పూర్తిస్థాయిలో న్యాయం చేశారు. ఇక టెక్నికల్ పరంగా సినిమాకి టెక్నికల్ అంశాలన్నీ బాగా కుదిరాయి. ముఖ్యంగా సినిమాటోగ్రఫీతో పాటు ఆర్ట్ డిపార్ట్మెంట్ పనితీరు చాలా బాగా కనిపించింది. ఎడిటింగ్ టేబుల్ మీద మరింత జాగ్రత్త తీసుకుని ఉంటే బాగుండేదేమో అనిపిస్తుంది. కొన్ని చోట్ల ఇంకా బలమైన భావోద్వేగాలు ఉంటే ప్రేక్షకులు మరింత బాగా కనెక్ట్ అయ్యేవారేమో అనిపిస్తుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.
23 కథ : నిజానికి ఇది నిజ జీవిత ఘటనే అయినా, దాని ఆధారంగా కాస్త సినిమాటిక్ టచ్‌తో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో దళిత కుటుంబానికి చెందిన సాగర్ (తేజ), రెల్లి కుటుంబానికి చెందిన సుశీల (తన్మయ) ప్రేమించుకుంటారు. పెళ్లి కాకముందే సుశీల గర్భవతి అవుతుంది. దీంతో ఆమెను ఎలాగైనా పెళ్లి చేసుకోవాలని ప్రయత్నాలు చేస్తాడు సాగర్. ఇడ్లీ సెంటర్ పెట్టుకుని ఊరిలో గౌరవంగా బతకాలని భావించే సాగర్‌కు అప్పు దొరకక, చివరికి కష్టపడకుండా డబ్బు సంపాదించాలనే దురాశ కారణంగా తన స్నేహితుడు దాస్ (పవన్ రమేష్)లతో కలిసి ఒక ప్లాన్ చేస్తాడు. నక్సలైట్ల పేరుతో బస్సు దోపిడీ చేయాలని ప్లాన్ చేసి వెళ్తే, ఆ బస్సు దహన సంఘటనలో 23 మంది మరణానికి కారణమవుతారు. ఈ కేసులో కోర్టు వారికి మరణశిక్ష విధిస్తుంది. ఆ తర్వాత వారు మరణశిక్ష నుంచి యావజ్జీవ ఖైదీలుగా ఎలా మారారు? వారిని కాపాడేందుకు ఎవరెవరు ప్రయత్నించారు? ఇలాంటి విషయాలు తెలియాలంటే సినిమాను బిగ్ స్క్రీన్‌పై చూడాల్సిందే.
విశ్లేషణ : నిజానికి మల్లేశం సినిమా డైరెక్టర్ నుంచి సినిమా వస్తుందని అందరిలో ఒక రకమైన ఆసక్తి ఏర్పడింది. బహుశా నాకు కూడా మల్లేశం వ్యక్తిగతంగా నచ్చడంతో, ఈ డైరెక్టర్ ఈసారి ఎలాంటి సినిమాతో వస్తాడా అని ఎదురుచూశాను. అలాంటి సమయంలోనే 8:00 A.M. మెట్రో అనే సినిమా నన్ను ఆశ్చర్యపరిచింది. ఆ తర్వాత అదే డైరెక్టర్ “23” అనే సినిమా చేస్తున్నాడని తెలిసి, ఇది ఎలాంటి కంటెంట్‌తో ఉండబోతుందా అని అనుకున్నాను. కానీ ప్రచార కంటెంట్ చూస్తే ఇదేదో ప్రచారాత్మక ఫిల్మ్ అనే భావన కలిగింది. ఎందుకంటే స్వాతంత్ర్యం వచ్చి ఎన్నో ఏళ్లు గడిచినా ఇంకా దళితులను ఇబ్బంది పెడుతున్నారు లేదా ఇబ్బందికర పరిస్థితుల్లోకి నెట్టివేస్తున్నారు అనే ప్రచారం కొంతమంది కావాలనే చేస్తూ ఉంటారు. ఈ ప్రచార కంటెంట్ చూసిన తర్వాత ఎందుకో అలాంటి భావన కలిగింది. కానీ సినిమా చూసిన తర్వాత మాత్రం అది పూర్తిగా మారిపోయింది.
నిజానికి ఇక్కడ దర్శకుడు లేవనెత్తిన అంశం నిజంగా చర్చనీయమైనది. చిలకలూరిపేట బస్సు దహన కేసులో ఇద్దరికి శిక్ష పడింది. నిజానికి ఈ ఇద్దరు బస్సులో ఉన్న ప్రయాణికుల నుంచి డబ్బు దోచుకోవడానికి వెళ్లారు, కానీ వారిని చంపడానికి కాదు. వారిని భయపెట్టడానికి పెట్రోల్ పోస్తే అది 23 మంది దహనానికి కారణమైంది. అగ్గిపుల్ల వెలిగించింది ఎవరు అనే విషయాన్ని పక్కనపెడితే, వీరు దోపిడీ చేయడానికి వెళ్లారు, కానీ అది 23 మంది సజీవ దహనానికి కారణమైంది. అయితే, మరో రెండు కేసులు—ఒకపక్క చుండూరు, మరోపక్క జూబ్లీహిల్స్ బాంబ్ బ్లాస్ట్ కేసు—ఈ రెండింటిలో నిందితులకు స్పష్టమైన ఉద్దేశం ఉంది. కచ్చితంగా అవతలి వ్యక్తులను చంపడానికే వీరు బయలుదేరారు, చంపారు, అందులో విజయం సాధించారు.
కానీ వారు తమకున్న పలుకుబడితో, డబ్బు బలంతో, సత్ప్రవర్తన పేరుతో రకరకాల ప్రలోభాలకు గురిచేసి బయటకు వచ్చేశారు. కానీ, తెలియక 23 మంది ప్రాణాలకు కారణమైన ఇద్దరు బలహీన వర్గాలకు చెందిన వారు మాత్రం ఇప్పటికీ జైల్లోనే మగ్గుతున్నారు. ఈ విషయాన్ని సూటిగా, సుత్తి లేకుండా ప్రశ్నించడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు. అదేవిధంగా, జైలు సంస్కరణల గురించి కూడా సినిమాలో చర్చించిన విషయం బాగుంది. నిజానికి ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో కొంతమంది ఖైదీల ఇంటర్వ్యూలు చూస్తున్నప్పుడు, జైళ్లు నేరాలు నేర్చుకోవడానికి అడ్డాలుగా మారుతున్నాయా అని అనుమానం కలగకమానదు. కానీ, బినా ప్రొఫెసర్ వంటివారు వారి ఉన్నతికి ఎంతగా కష్టపడుతున్నారు అనే విషయాన్ని చూపించిన విధానం బాగుంది.