HAPPY BIRTHDAY CM JAGAN : జగన్ చేస్తున్న ఎమ్మెల్యే, ఎంపీల ట్రాన్స్ ఫర్లు ప్రజలకు నచ్చటం లేదా ?
ప్రత్యెక కధనం - సీనియర్ జర్నలిస్ట్ ఆది :
అది ఆయనకు నెగిటివ్ ఇమేజీ తీసుకొచ్చి పెడుతోందా ? ఇన్నాళ్ల పాటు మెయిన్ టైన్ చేసిన డేరింగ్ డ్యాషింగ్ మైండ్ సెట్ లో మార్పులొచ్చినట్టు
జనం అనుకుంటున్నారా ? ఈ మార్పు చేర్పులతో జగనన్న ఏం నిరూపించాలనుకుంటున్నారు ? ఫలితం తారు మారా ? లేక తలకాయలే మారునా ?
ఎంత వారలైనా కాంత దాసులే అన్నది ఓల్డ్ వన్.. ఎంత వారైనా.. గెలుపు ఓటములకు అతీతులే.. అన్నది ప్రెజంట్ సిట్యువేషన్ కి పర్ఫెక్ట్ యాప్ట్.. కేసీఆర్ ఓటమే.. ఇందుకు బలమైన ఉదాహరణ.. ఆయన టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చడం ఒక వెనకడుగు.. ఆపై కామారెడ్డిలో పోటీకి దిగడం మరో బ్యాక్ స్టెప్.. ఇలా వరుస వెంబడి వెనకడుగు అడుగు కలిస్తే.. అదిపుడు పూర్తి ఓటమికి కేరాఫ్ గా నిలిచింది.. ఒక గులాబి కావలి కథ.. కాస్తా గూబ గుయ్యిమనిపించింది.
ఇక జగన్ విషయానికి వస్తే.. తాజాగా ఎమ్మెల్యే ఎంపీల మార్పు చేర్పులను చూస్తుంటే.. జనాల్లో ఆయనంటే గతంలో ఉన్న ఒక ఆరాధనా భావం రాన్రాను కరిగిపోతున్నట్టుగా ఉంది.. ఇంతకు ముందు వరకూ పులివెందుల పులీ పులీ అని ప్రస్తుతించిన వారే.. ఇప్పుడు లోకేష్ తరచూ అనే మాటందుకునే పరిస్థితి.
నిజానికి జగన్ చాలా మంది మనసు ఎక్కడ గెలిచారంటే.. ముక్కూ మొహం తెలియని అనామకులను ఎమ్మెల్యే, ఎంపీలుగా గెలిపించినందుకు.. ఇక్కడ ఆయన గెలుపోటములు చూడలేదు.. తన విశాలమైన మనసు చాటుకున్నాడన్న పేరొచ్చింది.. వాళ్లు కూడా అలాగే గెలవడంతో.. అదో గెలుపు పాఠం అయ్యింది. ఎందరో బడుగు బలహీన జీవులకు అధికార దర్పాన్ని తీసుకొచ్చి పెట్టింది.. కానీ ఇప్పుడాయన తన ఎమ్మెల్యేలతో చెడుగుడు ఆడుకుంటున్నట్టు బయటకు పొక్కడంతో బ్యాడ్ రిమార్క్ వచ్చి మీద పడుతోంది.
అనవసరంగా ఎల్లో మీడియాకొక ఆయుధాన్ని చేతికిచ్చినట్టయ్యింది.. ఇప్పటికే ఆంధ్రజ్యోతి తన పాండిత్యమంతా రంగరించి పోస్తోంది. సజ్జల, మిధున్ రెడ్డి బ్రైన్ వాష్ చేస్తున్నారనీ.. జగన్ సార్ పిలుపులకు సాదా సీదా బ్యాక్ వర్డ్ క్లాస్ ఎమ్మెల్యేలు ఆయన ముందు నిలవడానికి కూడా కనీస అర్హత సాధించలేక పోతున్నారనీ.. ఇక్కడా వివక్ష రాజ్యమేలుతోందని.. అదనీ ఇదనీ. చాలానే ప్యాలెస్ పాలిటిక్స్ పేరిట రాసుకొస్తున్నారు ఎల్లోమీడియా వర్గాల వారు.
మంగళగిరికి గంజి చిరంజీవి, తాడికొండకు సుచరిత.. రాజమండ్రి అర్బన్ కి భరత్, ఏలూరుకు అనిల్ ఇలా రకరకాల మార్పు చేర్పులు.. జనాన్ని విస్మయ పరుస్తున్నాయ్. బాబుగారైతే.. తాను ఇప్పటి వరకూ ఐఏఎస్, ఐపీఎస్ బదిలీలు చూశాను కానీ ఎమ్మెల్యే, ఎంపీలకు ఇలాంటి బదిలీలు ఉంటాయని ఇప్పుడే చూస్తున్నానని వ్యాఖ్యానించడం కూడా చర్చనీయాంశమైంది. మరైతే తమరు చంద్రగిరి నుంచి కుప్పం ఎందుకు ట్రాన్స్ ఫర్ అయ్యారంటూ వైసీపీ కౌంటర్ అటాక్ చేసినా.. అదేమంత స్ట్రాంగ్ కౌంటర్ గా కనిపించడం లేదు.
ఎక్కడో ఒరిజినాలిటీ మిస్ అవుతోంది. నిజానికి గెలుపుకంటే ఓటమిలో కూడా ఒక్కో నాయకుడికి\ అతడి నాయకత్వానికీ అత్యవసరమే. దాన్ని ఆహ్వానించాల్సి ఉంటుంది కూడా. అదేదో సినిమాలో ఎమ్మెస్ కేరెక్టర్ చెప్పినట్టు.. జ్యోతిష్కమంటే ఉన్నది చూస్కోవాలి తప్ప.. దాన్ని మార్చే యత్నం చేయకూడదన్నట్టు.. జగన్ తనకు ఎదురు కాబోయే ఓటమిని ముందే పసిగట్టి.. దాన్ని తారు మారు చేసే యత్నం భారీ ఎత్తున చేస్తున్నట్టు కనిపిస్తోంది.
బేసిగ్గా జగన్ లో ఒక కాన్ఫిడెన్స్ ఏంటంటే.. అటుకులు చిటుకులు మార్చేస్తే సరిపోతుందని భావిస్తున్నట్టుగా ఉంది. ఈ మార్పు చేర్పులు.. పెద్ద సమస్యగా భావించడం లేదాయన. పైపెచ్చు తనకు తాను ఒక ఎన్టీఆర్ లా ఫీలవుతూ.. ఆయన చెప్పు నిలబెట్టినా గెలుస్తారన్న భావావేశంలో పడి.. స్థానికత, లోకల్ లీడర్షిప్ ప్రభావం.. దాని తాలూకూ తీవ్రత అనే అంశాలుంటాయని.. వాటిని తాను పరిగణలోకి తీసుకోవాలని చూస్తున్నట్టు లేదు. పైపెచ్చు.. తనకేదో సరిపడా ఎమ్మెల్యేలుంటేనే.. సీఎం అవుతాను కాబట్టి.. తన దగ్గరున్న పొలిటికల్ మెథడాలజీ మొత్తం వాడి.. దాని ద్వారా కావల్సిన మేజిక్ ఫిగర్ సాధించేస్తే సరిపోతుందని భావిస్తున్నారులా ఉంది చూస్తుంటే.
దానికి తోడు సాటి రాష్ట్రంలో కేసీఆర్ ఇలాగే ఓ డజను మందిని మార్చి.. సత్ఫలితాలను పొందడం ఆయనొక ఎగ్జాంపుల్ గా తీసుకుంటున్నట్టుగానూ కొడుతోంది. ఆ మిగిలిన డజను మందినీ మార్చేసి ఉంటే.. ఖచ్చితంగా కేసీఆరే అధికారంలోకి వచ్చి వుండేవారని బలంగా విశ్వసిస్తున్నట్టుంది. కానీ అన్ని రోజులు ఒకలా ఉండవు. అన్ని కాలమాన పరిస్థితులు ఒకేలా సాగవు.. ఓడలు బండ్లు- బండ్లు ఓడలు అయ్యే అవకాశాలు లేక పోలేదు.
ఇరవై నాలుగ్గంటలూ రాజకీయ ఎత్తుగడలు పని చేయాలన్న రూల్ ఏమీ లేదు. ఒకప్పట్లో అంటే జగన్ అంటే గెలుస్తాడో లేదో తెలియని ఒకానొక అండర్ డాగ్. ప్రెజంట్ హీ ఈజ్ ద ఒన్ ఆఫ్ ద పొలిటికల్ లెజండ్స్ ఆఫ్ ఆల్ టైమ్ ఏపీ హిస్టరీ. ఈ క్రమంలో ఆయన ప్రతి చర్యా.. ఇక్కడ పర్యవేక్షించబడుతుంది.
మార్పులు అంటే ఒకరిద్దరంటే పర్లేదు కానీ.. నియోజకవర్గాలకు నియోజకవర్గాలు మారిపోతే.. అది కూడా టూ డిఫరెంట్ గా అంటే.. చాలా చాలా కష్టం. ఇది అంచనాలకు అందని విషయం. అయినా సరే జగన్ గెలిచాడంటే.. సమస్త తెలుగు రాజకీయాలు, ఇప్పటి వరకూ ఈ రంగంలో ఉన్న ఉద్దండులకూ షాకింగ్ న్యూసే. ఇదొక హిట్ ఫార్ములాగానూ మారిపోయే అవకాశం లేక పోలేదు.
ఇప్పటికిప్పుడు పరిస్థితులను బట్టీ చెబితే.. ఎవరికి సీట్లున్నాయో లేవో అగమ్యగోచర పరిస్థితి కనిపిస్తోంది. ఒకప్పుడు వేనోళ్లా పొగిడిన పార్టీ కేడరే.. ఇపుడు వేయి కళ్లతో.. జగన్ ఎత్తుగడలను క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. ఆయన వేసే ప్రతి అడుగులో తమ భవిష్యత్తును ఊహించుకుంటూ.. లోలోన హడలిపోతోంది. ఇప్పటికే కేడరంతా.. తమకు లేని ప్రాధాన్యత గురించి కుమిలిపోతూ ఉంది. వచ్చేసారికైనా మనల్ని ఏదైనా పట్టించుకుంటార్లే అన్న చిరు ఆశల పల్లకీల్లో వీరంతా ఊగిసలాడుతున్నారు. ఒక మాటలో చెబితే ప్రెజంట్ జగన్ చేస్తున్న ఈ చర్యలకు కార్యకర్తల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ఏ మాటకా మాట.. టీడీపీ కార్యకర్తలు వైసీపీ కార్యకర్తలూ దొందూ దొందే. వారికి అధికారం లేదు- వీరికి ఉంది అంతే తేడా. మిగిలినదంతా సేమ్ టూ సేమ్.
ఒక చోట ఇద్దరు కార్యకర్తలు మాట్లాడుకుంటున్న విధం చూసిన నాకు ఆశ్చర్యమేసింది.. నేను సిటీ టీడీపీ అధ్యక్షుడ్నన్న పేరే కానీ.. నా జేబులో వంద రూపాయలు కూడా లేవని.. ఆయన అంటుంటే.. పక్కనే ఉన్న.. మరో అధికార పార్టీ ప్రజాప్రతినిథి ముఖ్య అనుచరుడు.. అదేదో సినిమా యాడ్ లో చెప్పినట్టు.. మా అక్క రెండు గాజులు అమ్ముకుందని అన్నట్టు.. 2 జేసీబీలు అమ్ముకున్నానని అంతకన్నా కడు హృదయ విదారకంగా అనడం వినించి షాకింగా అనిపించింది.
ఇలంటి కార్యకర్తల కడగళ్లకు సంబంధించిన విషాధ గాథలు కోకొల్లలు. తన మన పట్టించుకోకుండా.. చోటా మోటా లీడర్లకంటూ ఎలాంటి ప్రాధాన్యతనివ్వకుండా.. ఆనాడు గానీ కులాతీతుడు\ మతాతీతుడిగా ఎన్టీఆర్ ఏ రేంజ్ లో ఫీలయ్యాడో.. అంతకు వెయ్యి రెట్లు అధికంగా ఫీలవుతున్న జగన్.. పార్టీ ముక్కూ చెవులైన ముఖ్య నాయకులు, కాళ్లూ చేతులైన కార్యకర్తలను బొత్తిగా మరచిపోయినట్టు కనిపిస్తోంది. దీంతో వారి వారి గుండెలోతుల్లోంచి పొంగిపొర్లుతోన్న ఆవేదన అంతా ఇంతా కాదు. నమ్ముకున్నోడికి ఏం చేశాడండీ.. అంటూ బండ బూతులు జోడించి మరీ తిట్టుకుంటున్న వారు లేక పోలేదు. వారినలా వదిలేయడం.. జగన్ లాంటి నాయకుడికి ఏమంత మంచిది కాదు. ఈ విషయం ఆయన వరకూ వెళ్లిందో లేదో తెలీడం లేదు. కానీ గ్రౌండ్ బరియల్ గ్రౌండ్ గా మారిందన్న కఠోర సత్యం కంటి ముందు కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది.
కాలే కడుపులు మండే గుండెలు తీర్చుకునే రివేంజ్ అత్యంత భయానకంగా ఉంటుందని.. అనుభవంలోకి వచ్చే వరకూ తెలీదు. అది దెబ్బ తీసిన తర్వాత.. మనమెలా ఓడిపోయామబ్బా అని పసిగట్టడానికే ఏడాది పడుతుంది. దానికి తోడు పప్పు, పులకేసీ అంటూ ఎన్నో లేకి పేర్లున్న లోకేష్.. ఆపసోపాలు పడి.. పడుతూ లేస్తూ చేసిన పాదయాత్ర చాలా వరకూ సత్ఫలితాలను ఇచ్చినట్టే తెలుస్తోంది. ఎందుకంటే ఇక్కడ కష్టాలు కన్నీళ్లు.. వీళ్లేదో కష్టపడుతున్నారే అన్న తలంపు జనాల్లోకి తీసుకెళ్లింది. లోకేష్ మీద ప్లే చేసిన మీమ్స్ ద్వారా అతడిపై సానుభూతి పెరిగిందే కానీ తగ్గినట్టు కనుచూపు మేర కనిపించడం లేదు. ఇదంతా గుర్తించిన తమ్ముళ్లు తమ యువనేత.. ఒక్క పాదయాత్రతో 40 సంవత్సరాలకు సరిపడా రాజకీయ పరిజ్ఞానాన్ని సంపాదించాడన్న ఆలోచనకు వచ్చేశారు.
ఇక బాబు జైలు ఎపిసోడ్ కూడా పార్టీకి బాగా కలసి వచ్చినట్టు కనిపిస్తోంది. ఆయన కూడా ఓ నెలన్నరపైగా.. జైల్లో ప్రశాంతంగా గడపటంతో.. బాగా కుదుట పడ్డట్టుంది. అందరూ ఈ పాదయాత్రతో లోకేష్ లో మెచ్యూరిటీ వచ్చిందని అంటున్నారు కానీ.. నాకు తెలిసి.. చినబాబు పాదయాత్ర కన్నా పెదబాబు జైలుకెళ్లడం ద్వారా మరింత ఎక్కువ పరిపక్వత వచ్చినట్టు కనిపిస్తోంది. ఈ మధ్య బాబు చేస్తున్న కామెంట్లు చాలా చాలా సెటిల్డ్ గా ఉంటున్నాయ్. వీటన్నిటిని బట్టీ చూస్తే.. టీడీపీ ప్రస్తుతం ఎడ్జ్ లోకి వస్తున్నట్టు కనిపిస్తోంది.
ఇక ఉన్నది వంద రోజులు. ఈ వంద రోజుల్లో ఇలాంటి గాభరా గాభరా\ హడావిడి\ గజిబిజి\ గందర గోళం పనులు చేస్తూ వెళ్తే.. జగన్ తన రూరల్ హోల్డ్ తో సహా సమస్తం బాబు అండ్ కోకు సమర్పయామి అనాల్సి వస్తుంది. ఆఖర్లో అయినా ఒక మాట రాయాల్సి వస్తోంది. అగ్నికి వాయువు తోడయినట్టు పవనం గానీ కరెక్టుగా.. పర్ఫెక్టుగా వీస్తే.. ఇది మరో రేవంత విజయం అయ్యే అవకాశాలు లేక పోలేదు. కాబట్టి బీ అలెర్ట్ ఫ్యాన్ వాలోం.. ఇదో తుఫాను హెచ్చరికగా ముందే పరిగట్టి జాగ్రత్త పడాల్సిందిగా సూచన. అన్నది ద ఒరిజినల్ గ్రౌండ్ రిపోర్ట్.
ANY HOW HAPPY BIRTHDAY CM JAGAN
ప్రత్యెక కధనం - సీనియర్ జర్నలిస్ట్ ఆది