For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

మత్తు పదార్థాల నిర్మూలన యువత బాధ్యత : సీపీ తరుణ్ జోషి ఐపీఎస్

10:50 PM Jun 27, 2024 IST | Sowmya
Updated At - 10:50 PM Jun 27, 2024 IST
మత్తు పదార్థాల నిర్మూలన యువత బాధ్యత   సీపీ తరుణ్ జోషి ఐపీఎస్
Advertisement

అంతర్జాతీయ మత్తు పదార్థాల వ్యతిరేక దినం సందర్భంగా ఈ రోజు మహేశ్వరం జోన్ పరిధిలోని తుక్కుగూడలో రాచకొండ పోలీస్ కమిషనరేట్, మహేశ్వరం డీసీపీ మరియు ప్రత్యేక అవసరాలు గల వ్యక్తులు, సీనియర్ సిటిజన్స్, మరియు ట్రాన్స్ జెండర్ వ్యక్తుల శాఖ ఆధ్వర్యంలో నిషేధిత మత్తుపదార్థాలు మరియు మానవ అక్రమరవాణా వ్యతిరేక వాకథాన్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ శశాంక ఐఏఎస్ గారితో పాటు కమిషనర్ శ్రీ తరుణ్ జోషి ఐపిఎస్ ఇతర అధికారులు మరియు పలువురు విద్యార్థులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కలెక్టర్ శశాంక గారు మాట్లాడుతూ... నిషేధిత మత్తుపదార్థాల వాడకం అనేది సమాజానికి పట్టిన చీడపురుగు వంటిదని, డ్రగ్స్ వినియోగాన్ని సమూలంగా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. డ్రగ్స్ రహిత సమాజం కోసం ప్రభుత్వం, పోలీసు శాఖ, యువత మరియు సమాజంలోని అన్ని వర్గాలు సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. డ్రగ్స్ వినియోగం యెుక్క దుష్ప్రభావాల గురించి యువతకు పరిజ్ఞానం కల్పించేందుకు సోషల్ మీడియాతో పాటు కళాశాలల్లో కూడా రాచకొండ కమిషనరేట్ ద్వారా ప్రభుత్వ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.

Advertisement GKSC

ఈ కార్యక్రమంలో కమీషనర్ గారు మాట్లాడుతూ... సాధారణ ప్రజలు, విద్యార్థులు అందరూ డ్రగ్స్ రహిత సమాజం తమ బాధ్యతగా భావించాలని, తమ పరిసరాల్లో, కాలేజీల్లో, పాఠశాలల్లో మత్తు పదార్థాల వాడకం గురించి పరిశీలిస్తూ ఉండాలని సూచించారు. తెలిసీ తెలియక మత్తుపదార్థాల బారిన పడడం వల్ల యువత బంగారు భవిష్యత్తు నాశనం అవుతోందని, యువత యొక్క శారీరక మానసిక ఆరోగ్యాన్ని మత్తుపదార్థాలు విచ్ఛిన్నం చేస్తున్నాయని తెలిపారు. డ్రగ్స్ మీద పోలీసులు చేస్తున్న పోరాటంలో యువత తమ వంతు భాధ్యత నిర్వహించాలని, డ్రగ్స్ వినియోగానికి దూరంగా ఉండడంతో పాటు, తమ దృష్టికి వచ్చే నిషేధిత డ్రగ్స్ సరఫరా మరియు వినియోగానికి సంబంధించిన సమాచారాన్ని తక్షణమే పోలీసులకు తెలియజేయాలని సూచించారు.

ఈ కార్యక్రమానికి హాజరైన వారితో "మాదకద్రవ్యాల అక్రమ రవాణా మరియు దుర్వినియోగంపై జరుగుతున్న పోరాటంలో క్రియాశీల భాగస్వామిని అవుతానని డ్రగ్స్ వాడకం వలన కలిగే దుష్పరిణామాల గురించి సంపూర్ణ అవగాహన కలిగి ఉండి, నాతో పాటు ఏ ఒక్కరూ డ్రగ్స్ బారిన పడకుండా కృషి చేస్తానని, డ్రగ్స్ అమ్మకం, కొనుగోలు చేసే వ్యక్తుల సమాచారాన్ని పోలీసులకు తెలియచేస్తానని, డ్రగ్ రహిత జీవన శైలిని అనుసరిస్తానని, డ్రగ్-రహిత సమాజమే లక్ష్యంగా సాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వామినవుతానని" ప్రతిజ్ఞ చేయించారు.

ఈ కార్యక్రమంలో డిసిపి ఎల్బి నగర్ ప్రవీణ్ కుమార్ ఐపిఎస్, డీసీపీ మహేశ్వరం సునీత రెడ్డి, డిసిపి క్రైమ్స్ అరవింద్ బాబు, డీసీపీ వుమెన్ సేఫ్టీ ఉషా విశ్వనాథ్, ఏసిపి నరేందర్ గౌడ్ ఇతర అధికారులు మరియు పలు పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు.

Advertisement
Author Image