Rachakonda News : ఓటు వేయడం పౌరుల హక్కు : సీపీ తరుణ్ జోషి ఐపీఎస్
త్వరలో జరగనున్న లోక్ సభ ఎన్నికలలో ఓటు హక్కు ఉన్న ప్రతీ ఒక్కరూ తప్పనిసరిగా ఓటు వేయాలని రాచకొండ కమిషనర్ శ్రీ తరుణ్ జోషి ఐపీఎస్ గారు పిలుపునిచ్చారు. ప్రజలలో ఓటు హక్కు వినియోగం గురించి అవగాహన కల్పించేందుకు లెట్స్ ఓట్ ఎన్జీవో ఆధ్వర్యంలో ఈ రోజు మల్కాజిగిరి క్రాస్ రోడ్డు నుండి సఫిల్ గూడ పార్కు వరకు రెండు కిలోమీటర్ల "లెట్స్ ఓట్ వాకథాన్" ర్యాలీ నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కమిషనర్ ర్యాలీకి హాజరైన వారితో ఓటు వేసేలా ప్రతిజ్ఞ చేయించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు వేయడం అనేది ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా భావించాలని సీపీ పేర్కొన్నారు. తమకు నచ్చిన అభ్యర్థికి ఓటు వేయడం అనేది రాజ్యాంగం పౌరులకు ఇచ్చిన హక్కు అని, ఆ హక్కును ఎవరూ నిరుపయోగం చేయకూడదు అని తెలిపారు.
ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ఓటింగ్ జరుగుతుందని, కావున ఎవరూ ఓటింగ్ కు దూరంగా ఉండకూడదు అని పేర్కొన్నారు. ఓటర్లు అందరూ తమ తమ నియోజకవర్గంలో ఓటర్ల జాబితాలో తమ పేరును చెక్ చేసుకోవాలని, ఓటు వేయడం తమ బాధ్యతగా భావించి నూతన ప్రభుత్వ ఎన్నికలో తమ వంతు పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో లెట్స్ ఓట్ ఎన్జీవో కన్వీనర్ రాధాకృష్ణ గారితో పాటు, ఆ సంస్థ సభ్యులు, పలువురు ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగులు, స్థానిక ప్రజలు మరియు విధ్యార్థులు పాల్గొన్నారు.