For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

చంద్రబాబుకు కనిపించే సీఎం కుర్చీ... భ్రమలకే పరిమితం : విజయసాయి రెడ్డి ఎంపీ

03:50 PM May 11, 2024 IST | Sowmya
Updated At - 03:50 PM May 11, 2024 IST
చంద్రబాబుకు కనిపించే సీఎం కుర్చీ    భ్రమలకే పరిమితం   విజయసాయి రెడ్డి ఎంపీ
Advertisement

నారా చంద్రబాబు నాయుడుకు, ఆయన పార్టీ తెలుగుదేశం నేతలకు ఎప్పుడు కన్నుమూసినా ముఖ్యమంత్రి కుర్చీ కనిపిస్తోందట. అందుకే, తెలుగు ప్రజలు 2024లో తమకు అధికారం అప్పగిస్తారనే భ్రమల్లో బతుకుతున్నారు. టీడీపీ నేతలు ఈ మధ్య పలు జిల్లాల్లో పర్యటిస్తూ, తాము అధికారంలోకి వచ్చాక ‘మీ అంతు చూస్తాం’ అంటూ ప్రభుత్వ ఉద్యోగులను బెదిరిస్తున్నారు. నోరు పారేసుకుంటున్నారు. షెడ్యూలు ప్రకారం ఏడాది 9 నెలల తర్వాత జరిగే ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ ఎన్నికల్లో తమదే గెలుపని పెదబాబు, చినబాబు సహా తెలుగుదేశం మాజీ మంత్రులందరూ తెగ కలలు కంటున్నారు. వారి కలలు కల్లలే అవుతాయని చెప్పే ‘శ్రేయోభిలాషులు’ ఇప్పుడు ఎవరూ చంద్రబాబుకు అందుబాటులో లేరు. ఐదేళ్లు ప్రతిపక్షంలో ఉన్న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ 2019లో ఏపీలో అధికారపక్షంగా మారినట్టే తెలుగుదేశం కూడా ఐదేళ్ల ‘అజ్ఞాతవాసం’ తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో ఎందుకు గెలవదు? అని పచ్చ చొక్కాలవాళ్లు అడుగుతున్నారు. వారి వాదనలో పస లేదు. ఎందుకేంటే వైఎస్సార్సీపీ బలం ఎన్నడూ తెలుగుదేశం మాదిరిగా దిగజారలేదని ఎన్నికల ఫలితాల గణంకాలు చూస్తే ఎవరికైనా అర్ధమౌతుంది.

కేవలం 1.68 శాతం తేడాతోనే వైఎస్సార్సీపీ ఓడిపోయింది
2019లో టీడీపీ 10 శాతం తేడాతో ఘోర పరాజయం పాలైంది

Advertisement GKSC

2014 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం, చంద్రబాబు ముఠా దుష్ప్రచారం ఫలితంగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కేవలం 1.68 శాతం ఓట్ల తేడాతో అధికారానికి దూరమైంది. 175 సభ్యులున్న అసెంబ్లీలో 66 సీట్లు గెలుచుకుని బలమైన ప్రతిపక్షంగా అవతరించింది. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న ఐదేళ్లకాలంలో ఈ పార్టీ నిత్యం జనం మధ్యనే ఉంది. ప్రజల కోసం పోరాడుతూనే ఉంది. ఈ పార్టీ నేత, ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి నిరంతర పాదయాత్రతో జనం సమస్యలు తెలుసుకుంటూ పరిష్కార మార్గాలు రూపొందించుకున్నారు. అధికారంలో వచ్చాక వాటిని విజయవంతంగా అమలుచేస్తున్నారు. ఆంధ్రులకు నవరత్నాలు అందించి జనులకు సంక్షేమ రత్నగా కనిపిస్తున్నారు. ఇక తెలుగుదేశం విషయానికి వస్తే, 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ పార్టీ పది శాతం ఓట్ల తేడాతో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ చేతిలో ఘోర పరాజయం పాలైంది. కేవలం 23 అసెంబ్లీ సీట్లతో కుదేలైంది.

అంతేకాదు, చంద్రబాబు అధికారం కోల్పోయిన మరుక్షణం నుంచి ప్రజలకు దూరమౌతూ వస్తున్నారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వానికి బాధ్యతగల నిర్మాణాత్మక ప్రతిపక్షంగా నిర్వహించాల్సిన పాత్రను అటు పెదబాబు, ఇటు చినబాబు పూర్తిగా విస్మరించారు. జగన్‌ సర్కారుపైనా, ఆయన పార్టీపైనా బురద జల్లుడు కార్యక్రమంలో వారు సంపూర్ణంగా మునిగిపోయారు. టీడీపీ తన పది శాతం ఓట్ల లోటును భర్తీ చేసుకోవాలంటే ప్రస్తుత ఏపీ ప్రభుత్వం తప్పులు చేయాలి లేదా తెలుగుదేశం పనితీరు అనూహ్యరీతిలో మెరుగుపడాలి. ఇప్పుడు ఈ రెండూ జరగడం లేదు కాబట్టి చంద్రబాబు అండ్‌ కంపెనీ వచ్చే సాధారణ ఎన్నికల్లో గెలిచి రాజ్యమేలుతామన్న భ్రమల నుంచి బయటపడితే అందరికీ మంచిది. ఇప్పటి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పాలనను క్షుణ్ణంగా పరిశీలిస్తే ప్రతిపక్షానికి అధికారంలోకి వచ్చే అవకాశమే లేదని రాజకీయ పండితులు, ఎన్నికల విశ్లేషకులకు అర్ధమౌతోంది అని విజయసాయి రెడ్డి తెలిపారు.

Advertisement
Author Image