For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

Telangana News: రైతు అమరుల కుటుంబాలకు కేంద్రం రూ. 25 లక్షలు ఇవ్వాలి: సీఎం కేసీఆర్‌

12:13 PM Nov 21, 2021 IST | Sowmya
Updated At - 12:13 PM Nov 21, 2021 IST
telangana news  రైతు అమరుల కుటుంబాలకు కేంద్రం రూ  25 లక్షలు ఇవ్వాలి  సీఎం కేసీఆర్‌
Advertisement

కేంద్ర ప్రభుత్వం తెచ్చిన వివాదాస్పద వ్యవసాయ చట్టాల రద్దు విషయంలో దేశ రైతాంగం అద్భుత విజయం సాధించిందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు కొనియాడారు. పోరాటంలో మృతిచెందిన రైతులకు నివాళులు అర్పించారు. అమరులైన రైతుల కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం తరఫున రూ.3 లక్షల చొప్పున సాయం అందిస్తామని ప్రకటించారు. కేంద్రం కూడా ఒక్కో రైతు కుటుంబానికి రూ.25 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. శనివారం తెలంగాణ భవన్‌లో సీఎం కేసీఆర్‌ మీడియాతో మాట్లాడుతూ.. వ్యవసాయ చట్టాల రద్దుకోసం 13 నెలలుగా అనేక ఒత్తిళ్లు, కేసులు, ప్రకృతి ప్రకోపాలను తట్టుకుని అద్భుత విజయం సాధించారంటూ రైతాంగ పోరాట వీరులను అభినందించారు.

ఈ చట్టాల రద్దుతో రైతాంగానికి ఒక భద్రత, సాంత్వన వచ్చిందన్నారు. రైతుల ఉద్యమంపై కేంద్రం చాలా దుర్మార్గంగా వ్యవహరించిందన్న కేసీఆర్‌.. ఉద్యమంలో చనిపోయిన 750 మంది రైతుల కుటుంబాలకు సంఘీభావం ప్రకటించారు. ఆ కుటుంబాలను కాపాడాల్సిన బాధ్యతను కేంద్రమే తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. పోరాటంలో చనిపోయిన రైతుల కుటుంబాలకు రాష్ట్రం తరఫున రూ.3 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా అందిస్తామని, ఇందుకు రూ.22.5 కోట్లు మంజూరు చేస్తామని ప్రకటించారు. చనిపోయిన రైతుల వివరాలివ్వాలని ఇప్పటికే రైతు సంఘాల నాయకులను కోరామన్నారు. ‘ఆ రైతు కుటుంబాల దగ్గరికి మంత్రులు, అవసరమైతే నేనే వెళ్లి ఎక్స్‌గ్రేషియా అందిస్తాం. వాళ్లు చేసింది మామూలు పోరాటం కాదు. సాధించింది అద్భుతమైన విజయం. చాలా స్ఫూర్తిదాయక విజయం. ప్రభుత్వం ఎంత కవ్వించినా, ఎన్ని బాధలు పెట్టినా, కేసులు పెట్టినా, నిర్బంధాలు పెట్టినా, ఎన్ని రకాలుగా అవమానించినా తట్టుకుని సుదీర్ఘ పోరాటం చేశారు’ అని కేసీఆర్‌ పేర్కొన్నారు.

Advertisement GKSC

క్షమాపణ చెప్తే సరిపోదు
--------------------
రైతులను ఏడాదికాలంగా అనేక కష్టాలకు గురిచేసి, ఒక్క మాటలో కేంద్రం క్షమాపణలు చెప్పి, చేతులు దులుపుకొందామంటే కుదరదని కేసీఆర్‌ అన్నారు. ‘చనిపోయిన రైతుల కుటుంబాలను ఆదుకోవడం కేంద్రం బాధ్యత. మీరు మీ తప్పును గ్రహించారు.. కాబట్టి ప్రతి కుటుంబానికి రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి’ అని ప్రధానమంత్రిని డిమాండ్‌ చేశారు. ‘ఆ కుటుంబాలను ఆదుకొని గొప్ప స్ఫూర్తిని ఇవ్వాలి. అది ప్రజాస్వామ్యానికి మరింత అందాన్ని తెస్తుంది’ అని చెప్పారు. ఉద్యమం సందర్భంగా రైతు సంఘాల నాయకులపై, రైతులపై వేలకొద్దీ కేసులు, కొన్ని సందర్భాల్లో దేశద్రోహం కేసులు కూడా పెట్టారని, వాటన్నింటినీ వెంటనే ఎత్తివేయాలని కేంద్రాన్ని డిమాండ్‌ చేశారు. రైతులకు సంఘీభావంగా ట్వీట్‌ పెట్టినందుకు బెంగళూరుకు చెందిన దిశ అనే అమ్మాయి మీద కూడా దేశద్రోహం కేసు పెట్టారని గుర్తుచేశారు.

మూడు చట్టాలను వ్యతిరేకించాం
------------------------
వ్యవసాయ చట్టాలను తాము తీవ్రంగా వ్యతిరేకించామని కేసీఆర్‌ స్పష్టంచేశారు. లోక్‌సభ, రాజ్యసభల రికార్డుల్లో ఆ సంగతి ఉన్నదని పేర్కొన్నారు. ‘బీజేపీ నేతలు రైతు ఉద్యమంమీద అనేక విమర్శలు చేశారు. మూర్ఖులని, ఆందోళన జీవులని, పిచ్చోళ్లని, ఉగ్రవాదులని, ఖలిస్తాన్‌ వేర్పాటువాదులని ప్రచారం తీసి, తీరా ఇవాళ దేశం ముందుకొచ్చి క్షమాపణ వేడుకొంటున్నారు. అయినా బీజేపీ నేతలకు సిగ్గురాకపోవడం శోచనీయం. ఆ చట్టాలకు వ్యతిరేకంగా మేము ఆందోళనలు నిర్వహించాం. రైతు చట్టాలపై బీజేపీ నిర్ణయాన్ని దేశంలో ఎవరూ నమ్మడంలేదు. ఇదో ఎన్నికల ఎత్తుగడ అనుకుంటున్నరు. ఐదు రాష్ర్టాల ఎన్నికల కోసం అవలంబిస్తున్న స్టంట్‌గా చూస్తున్నరు’ అని సీఎం వ్యాఖ్యానించారు.

వ్యవసాయాన్ని ఆత్మనిర్భరంగా మార్చాలి
----------------------------
దేశంలో వ్యవసాయరంగాన్ని బలోపేతం చేసేందుకు ‘ఆత్మనిర్భర్‌ క్రిషక్‌’ అవసరమని సీఎం కేసీఆర్‌ అన్నారు. ‘కరోనా సమయంలో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించి ఆత్మనిర్భర్‌ భారత్‌ గురించి మాట్లాడినప్పుడు ఆత్మనిర్భర్‌ క్రిషక్‌ అవసరమని కుండబద్దలు కొట్టినట్టు చెప్పిన. దేశ జనాభా 140 కోట్లకు చేరుతున్నది. ఇలాంటి దేశంలో వ్యవసాయం సంక్షోభంలో పడితే ప్రజలకు ఆహారం సమకూర్చే శక్తి ప్రపంచంలో ఏ దేశానికీ లేదు. దేశంలో ఆహార వ్యవస్థ సరిగా ఉండేలా చూసుకోవాలి. అందుకే మరోసారి ప్రధానిని వినమ్రంగా కోరుతున్నా. భారత్‌ క్రిషక్‌ క్షేత్‌క్రో, భారత్‌కే కిసానోంకో సబ్‌సే పహెలే టాప్‌ ప్రయార్టీమే ఆత్మనిర్భర్‌ బనాయా జాయే. ఏ బహుత్‌ హీ అహెం మస్లా హై. ఇస్‌కో సచ్చే తరీఖే సే కర్నీ చాహియే. ఇప్పటికైనా మీకు జ్ఞానోదయం అయ్యింది. మీ విధానాలు సరైనవి కావని తెలుసుకున్నారు. క్షమాపణలు కూడా చెప్పారు. కాబట్టి ముందుకు వచ్చి ఈ పనిచేయండి’ అని సీఎం కేసీఆర్‌ కోరారు.

TS CM KCR Assistance ToThe Farmer Martyrs 3Lackhs Rupees, Atmanirbhar Krishi,PM Modi,Telangana News,v9 news telugu,telugu golden tv,my mix entertainments,www.teluguworldnow.com

Advertisement
Author Image