Bachelor of Fine Arts : సంకల్పమే 'ప్రసన్న' చిత్రం
Kota Prasanna Jyoti : ఊహలకు రూపం ఇచ్చి వాటికి రంగులద్ది సహజత్వాన్ని ప్రతిబింబించే సాధనం చిత్ర లేఖనం. అలాంటి చిత్ర లేఖనంలో అందమైన చిత్రాన్ని అమ్మ ప్రేమను తలపించేలా కనిపించే చిత్తరువులు కోకొల్లలు. నిత్యం సృజనాత్మకతను జోడించి ఎన్నో చిత్రాలను కాన్వాసుపై చిత్రించే కళాకారులు ఎందఱో.. ఇలాంటి ఎన్నో అద్భుత చిత్రాలను తన కుంచెతో ప్రాణం పోస్తున్న చిత్రకారిణే కోట ప్రసన్న జ్యోతి. ఆధ్యాత్మికం, ఆధునికం, ప్రకృతి దృశ్యం.. చిత్రం ఏదైనా తన సృజనాత్మకతతో చూపరులకు వీనుల విందుగా మనసుకు హత్తుకునేలా తనదైన శైలిలో రాణిస్తోంది. చిత్రకళలో ఎంతో కష్టపడి తనకంటూ ఓ ప్రత్యెక గుర్తింపును పొందుతోంది ప్రసన్న జ్యోతి.
ప్రసన్న పుట్టి పెరిగిందంతా హైదారాబాద్ లోనే . ఓ సామాన్య మధ్యతరగతి కుటుంబంలో కోట ప్రకాష్ , సుమలత దంపతులకు జన్మించిన ప్రసన్నకు చిన్నప్పటి నుంచే పెయింటింగ్ పట్ల మక్కువ ఏర్పడింది. బాల్యంలోనే తనకున్న ఇష్టాన్ని మనసు పెట్టి బొమ్మలు గీస్తూ మెరుగులు దిద్దుకుంది. ప్రసన్న చదువులోను మంచి ప్రతిభను కనబరిచేది. ఇంటర్ తర్వాత టి టి సి చదివి టైపింగ్ లోను లోయర్ గ్రేడ్, హయ్యర్ గ్రేడ్ చేసింది. చదువుతూనే చిత్రకారుడు కిషన్ గారి శిక్షణ లో మరింత రాణిస్తూ అందరితో మన్ననలు అందుకుంది. అదే సమయంలో శ్రీ వెంకటేశ్వర ఫైన్ ఆర్ట్స్ కాలేజ్ నుంచి బాచిలర్ అఫ్ ఫైన్ ఆర్ట్స్ పట్టాను అందుకుంది.
ఆ తర్వాత పలు స్కూళ్ళల్లో డ్రాయింగ్ టీచర్ గా పనిచేసిన ప్రసన్న, ఇప్పుడు స్వంతంగా ఓ ఆర్ట్ స్కూల్ ద్వారా ఔత్సాహిక చిన్నారులకు పెయింటింగ్ లో శిక్షణనిస్తుంది . అంతేకాకుండా కమర్షియల్ ఆర్ట్ వర్క్ కుడా చేస్తోంది. పెన్సిల్ డ్రాయింగ్ తో మొదలైన తన కళను వాటర్ కలర్ , ఆక్రిలిక్ , ఆయిల్, చార్ కోల్ మొదలగు పెయింటింగ్ లోను ప్రతిభ కనబరుస్తుంది. ఇప్పటికే తన చిత్రాలను ఎన్నో ప్రదర్శనలలో ఉంచి ప్రశంసలు పొందింది. ప్రసన్న ఎక్కువగా సృజనాత్మకత చిత్రాలతో పాటు ల్యాండ్ స్కాపే పెయింటింగ్స్ , లైవ్ పెయింటింగ్స్ మరియు స్కేచ్చింగ్ వేస్తుంది.
ఈ మధ్య కాలంలో తాను సృజనాత్మకత చిత్రాలను తనదైన శైలిలో గీస్తూ చిత్ర లేఖనంలో మంచి గుర్తింపుని పొందుతుంది. అనేక జిల్లా , రాష్ట్ర , జాతీయ స్థాయిలోనూ తన పెయింటింగ్స్ ని ఉంచి పోటీ ప్రదర్శనలో పాల్గొంది. హైదరాబాద్ , వరంగల్, ఒంగోలు, డిల్లీ, బెంగళూరు, చెన్నై తదితర ప్రాంతాల్లో తన చిత్రాలకు అనేక అవార్డ్స్ , రివార్డ్స్ లను అందుకుంది. హైదరాబాద్ లో జరిగిన 84 వ ఆలిండియా వార్షిక ఆర్ట్ ఎగ్జిబిషన్ -2025 లో “మొబైల్ మత్తులో మనిషి పతనం” అనే కాన్సెప్ట్ తో గీసిన అక్రిలిక్ కాన్వాస్ చిత్రానికి ప్రసన్న ఉత్తమ అవార్డ్ దక్కించుకుంది. హైదరాబాద్ కు చెందిన శారద సొసైటీ వారు ఈ ఏడాది ప్రకటించిన సౌత్ ఇండియా విమెన్ ఇన్స్పిరేషన్ అవార్డ్ కూడా అందుకుంది.
ఇప్పటికీ “నేనో పెయింటింగ్ ఆర్టిస్ట్ గా గర్వపడుతూనే భవిష్యత్ లో ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా చిత్రకళలో ఉన్నత శిఖరాలను అందుకోవాలనే ఏకైక లక్ష్యం నాది” అంటోంది ప్రసన్న. ఓ మహిళగా సమాజంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటూ, తన తల్లి సుమలత ప్రోత్సాహంతో తనకు నచ్చిన కళలో తనదైన ముద్రను వేసుకుంటోంది. సంకల్పం ఉంటె రాణించవచ్చని నిరూపిస్తోంది ప్రసన్న. కోట ప్రసన్న జ్యోతి గీసిన చిత్రాలు చిత్రకళా నైపుణ్యానికి అద్దం పడుతున్నాయి . ఎంతైనా అభినందనీయం.
