పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలంగాణ ఐటీ ఉద్యోగుల ఓట్లు ఎవరికి ? : TITA
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కీలకంగా ఐటీ ఉద్యోగుల ఓట్లు
- దాదాపు 6 లక్షల టెక్కీలలో 40% పైచీలుకు తెలంగాణ వాసులే
- లాక్ డౌన్ నేపథ్యంలో పెద్ద ఎత్తున నమోదు చేసుకున్న ఐటీ రంగ ఉద్యోగులు
- `వర్క్ ఫ్రం హోం` సౌలభ్యంతో టెక్కీల భాగస్వామ్యం భారీగా ఉండనుందన్న టీటా గ్లోబల్ ప్రెసిడెంట్ సందీప్ మక్తాల
- ఎమ్మెల్సీలుగా గెలుపొందిన వారు టెక్కీల సమస్యలను ప్రస్తావించాలని వినతి
*హైదరాబాద్ , మార్చి 9, 2021:* తెలంగాణలో ప్రస్తుతం జరుగుతున్న రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఐటీ, ఐటీ అనుబంధ రంగాల్లోని ఉద్యోగులు కీలక పాత్ర పోషించనున్నారని తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ పేర్కొంది. తెలంగాణ రాష్ట్రంలోని దాదాపు 6 లక్షల ఐటీ ఉద్యోగుల్లో 40% పైచీలుకు తెలంగాణ వాసులే ఉన్నారని, వీరంతా గత ఏదాది లాక్ డౌన్ సమయంలో తమ ఓట్లను నమోదు చేసుకున్నారని వివరించింది. ఈనెల 14న జరగనున్న పోలింగ్‌లో టెక్కీలు క్రియాశీలంగా పాల్గొని ప్రజాస్వామ్య ప్రక్రియలో తమ భాగస్వామ్యాన్ని పెంచుకోవాలని టీటా గ్లోబల్ ప్రెసిడెంట్ సందీప్ మక్తాల పిలుపునిచ్చారు. గ్రాడ్యుయెట్ ఎమ్మెల్సీలుగా గెలుపొందిన ప్రజాప్రతినిధులు టెక్కీల సమస్యలను ప్రస్తావించాలని ఈ సందర్భంగా సందీప్ మక్తాల కోరారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అధికారిక లెక్కల ప్రకారం 2020 మార్చి 31 నాటికి 5, 82,126 మంది ప్రత్యక్షంగా ఐటీ రంగంలో ఉద్యోగాలు చేస్తున్నారు. ఈ ఏడాది వారి సంఖ్య దాదాపు 6 లక్షలకు చేరిందనే అంచనాలున్నాయి. వీరిలో 40% పైగా తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారే కాబట్టి వీరు ఓట్లు విజేతలను నిర్ణయించడంలో క్రియాశీలక శక్తిగా మారనున్నాయని తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ గ్లోబల్ ప్రెసిడెంట్ సందీప్ మక్తాల పేర్కొన్నారు. రెండు పట్టభద్రుల నియోజకవర్గాల ఎన్నికల నేపథ్యంలో లాక్ డౌన్ సమయంలో వేలాది మంది తమ ఓట్లను నమోదు చేసుకున్నారు. వర్క్ ఫ్రం హోం సౌలభ్యం ఉన్నందున ఈనెల 14న జరగనున్న పోలింగ్‌లో పెద్ద ఎత్తున పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం వీరు ఎన్నికల ప్రచారం, వివిధ అంశాలను నిశితంగా పరిశీలిస్తున్నారు.
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు, పోలింగ్ నేపథ్యంలో టీటా గ్లోబల్ ప్రెసిడెంట్ సందీప్ మక్తాల స్పందిస్తూ ప్రజాస్వామ్య ప్రక్రియలో తమ భాగస్వామ్యాన్ని చాటుకునేలా టెక్కీలు పెద్ద ఎత్తున ఓటింగ్‌లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పాల్గొనేందుకు పెద్ద ఎత్తున వివరాలు నమోదు చేసుకున్నందున ఉన్నత విద్యావంతులు తమ అభిప్రాయాలను తెలియజేసే ఈ ఎన్నిక అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఈ సందర్భంగా ఐటీ రంగానికి చెందిన వివిధ అంశాలను సందీప్ మక్తాల ప్రస్తావించారు. రాష్ట్రంలోని బీటెక్ సహా ఇతర సాంకేతిక విద్యార్హత ఉత్తీర్ణులైన వారి ఆశలు ఐటీ రంగంపైనే ఉన్నాయని తెలిపారు. వీరితో పాటుగా ఇప్పటికే ఐటీ రంగంలో ఉద్యోగాలు చేస్తున్న వారు వివిధ సమస్యలు ఎదుర్కుంటున్నారని పట్టభద్రుల ఎమ్మెల్సీలుగా గెలుపొందిన వారు ఆయా అంశాలను ఎగువ సభలో ప్రస్తావించాలని సందీప్ మక్తాల విజ్ఞప్తి చేశారు. ఐటీ రంగంలో ఒక్క ప్రత్యక్ష ఉద్యోగం ద్వారా 3-4 పరోక్ష ఉద్యోగాలు అనుబంధ రంగాలైన డ్రైవింగ్, సెక్యురిటీ, హౌస్ కీపింగ్, ఇతరత్రా రంగాల్లో కల్పించబడతాయి కాబట్టి ద్వితీయ శ్రేణి నగరాల్లో ఐటీ పరిశ్రమల ఏర్పాటుకు ప్రజాప్రతినిధులు కృషి చేయాలని, తద్వారా జిల్లాల్లోని యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని సందీప్ మక్తాల వివరించారు.