అధికారులు గరిష్ట శిక్షా రేటును సాధించడమే లక్ష్యంగా పని చేయాలి : సిపి సుధీర్ బాబు ఐపీఎస్
Rachakonda News : రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఇటీవల నమోదైన కొన్ని కేసులలో సత్వరమే స్పందించి నేరస్తులను పట్టుకొని బాధితులకు న్యాయం చేసిన పోలీసు అధికారులు మరియు సిబ్బందిని రాచకొండ కమిషనర్ శ్రీ సుధీర్ బాబు ఐపీఎస్ గారు ఈరోజు నేరేడ్మెట్ లోని రాచకొండ కమిషనర్ కార్యాలయంలో ప్రశంసా పత్రాలతో సత్కరించారు.
ఈ కార్యక్రమంలో రాచకొండ కమిషనర్ శ్రీ సుధీర్ బాబు ఐపీఎస్ గారు మాట్లాడుతూ.. నేర పరిశోధన మరియు దర్యాప్తులో పాల్గొనే అన్ని స్థాయిల సిబ్బంది మరియు అధికారులు నేరస్తులకు శిక్ష పడే ఏకైక లక్ష్యంతో పనిచేయాలని సూచించారు. సామాన్య ప్రజల పట్ల నేరాలకు పాల్పడే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచి పెట్టకూడదని, నేరం ఎవరు చేసినా నిష్పక్షపాతంగా దర్యాప్తు జరిపి చట్ట ప్రకారం శిక్షలు పడేలా పనిచేయాలని పేర్కొన్నారు.
నేరస్తులకు శిక్షా రేటును పెంచే లక్ష్యంతో రాచకొండ కమీషనరేట్ పరిధిలో కేసుల దర్యాప్తు సమయంలో పాటించవలసిన విధానాలు మరియు తీసుకోవలసిన జాగ్రత్తలను తెలుపుతూ SOP మరియు చెక్ లిస్ట్ లను అనుసరిస్తూ అందరూ సమన్వయంతో పనిచేస్తే నేరస్తులకు తగిన శిక్ష పడుతుందన్నారు. అదే విధంగా పోలీసులు, ప్రాసిక్యూటర్స్ కలసి కేసుకు సంబంధించిన విషయాలను చర్చించి నేరస్తులకు తగిన శిక్ష పడే విధంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో గరిష్ట శిక్షా రేటుతో అత్యుత్తమ పనితీరు కనబరిచినందుకు రాచకొండ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ లను మరియు కోర్టు డ్యూటీ ఆఫీసర్ల కృషిని అభినందించారు.
అధికారులు మరియు సిబ్బందికి కమిషనర్ అభినందన
సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన ఒక పోక్సో కేసులో అభం శుభం తెలియని మైనర్ బాలిక అయిన కన్న కూతురిపైనే లైంగిక దాడికి పాల్పడిన తండ్రికి జీవిత ఖైదు శిక్ష పడేలా ఉత్తమ రీతిలో నిష్పాక్షిక విచారణ సాగించిన కేసు విచారణాధికారి ఏసిపి శ్రీధర్ రెడ్డిని మరియు రాచకొండ పరిధిలో నమోదైన కేసులలో అత్యుత్తమ రీతిలో వాదనలు వినిపిస్తూ నేరస్తులకు తగిన రీతిలో గరిష్ట శిక్ష పడేలా కృషి చేస్తున్న అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ సునీత గారిని సిపి గారు ప్రత్యేకంగా అభినందించారు.
కేసుల వివరాలు పరిశీలిస్తే…
నేరేడ్మెట్ పరిధిలో నమోదైన ఒక కేసులో ఒక వ్యక్తి రాత్రిపూట తాళం వేసిన ఒక ఇంట్లో అక్రమంగా చొరబడి బీరువాను పగలగొట్టి దొంగతనం చేయడానికి ప్రయత్నించగా ఆ శబ్దానికి పక్కింట్లో ఉన్నవాళ్లు అప్రమత్తమై తక్షణమే డయల్ 100 కు కాల్ చేసి సమాచారం అందించగా నేరేడ్మెట్ పోలీస్ స్టేషన్ పెట్రోల్ కార్ సిబ్బంది తక్షణమే సంఘటనా స్థలానికి చేరుకొని నిందితుడిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఈ కేసులో డయల్ 100 సిబ్బంది సత్వరమే స్పందించడం వల్ల దొంగతనం నివారించబడి ఎటువంటి ఆస్తి నష్టం జరగలేదు.
కందుకూరు పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన మరో కేసులో ఒక మైనింగ్ క్వారీ నుండి దాదాపు పదివేల రూపాయలు విలువైన మోటార్ వైర్లను దొంగిలించి తీసుకు వెళుతున్న నేరస్తులను పెట్రోల్ కార్ విధుల్లో ఉన్న సిబ్బంది అనుమానంతో వెంబడించి వారిని అడ్డగించి విచారించగా దొంగతనం చేసినట్టు నిర్ధారణ కాగా తక్షణమే వారిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేయడం జరిగింది.
మేడిపల్లి స్టేషన్ పరిధిలో నమోదైన ఒక చైన్ స్నాచింగ్ కేసులో ఏసిపి గారు, స్టేషన్ హౌస్ అధికారి మరియు స్టేషన్ క్రైమ్ టీమ్ అధికారులు సంఘటన జరిగిన స్థలాన్ని స్వయంగా సందర్శించి రాచకొండ ఐటి సెల్ సిబ్బంది సహాయంతో సమీపంలోని సీసీటీవీ కెమెరాలను పరిశీలించి అనుమానితుడి బైక్ నెంబర్ ద్వారా కేవలం 24 గంటల్లోనే నేరస్థుడిని పట్టుకొని కేసును చేదించడం జరిగింది.
ఈ కేసుల్లో సత్వరమే స్పందించి నేరస్తులను అతి తక్కువ సమయంలోనే పట్టుకున్న అధికారులు మరియు సిబ్బందిని కమిషనర్ గారు ప్రత్యేకంగా అభినందించి ప్రశంసా పత్రాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో డీసీపీ క్రైమ్ అరవింద్ బాబు, అదనపు డీసీపీ అడ్మిన్ శివకుమార్, ఏసిపి ఐటి సెల్ నరేందర్ గౌడ్, ఏసిపి సి.సి.ఆర్.బి రమేష్ మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.