బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించడానికి కట్టుదిట్టమైన చర్యలు : సీపీ తరుణ్ జోషి ఐపీఎస్
Rachakonda News : సంతోషంగా చదువుకుంటూ ఆటపాటలతో సాగాల్సిన పిల్లల బాల్యాన్ని చిదిమేస్తున్న బాలకార్మిక వ్యవస్థను సమూలంగా నిర్మూలించాల్సిన అవసరం ఉందని రాచకొండ కమిషనర్ శ్రీ తరుణ్ జోషి ఐపీఎస్ పిలుపునిచ్చారు. ఈ రోజు నెరెడ్ మెట్ లోని రాచకొండ కమిషనరేట్ కార్యాలయంలో ఆపరేషన్ ముస్కాన్ పదో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తప్పిపోయిన పిల్లలను గుర్తించడం మరియు భిక్షాటన, బాలకార్మికులు, మానవ అక్రమ రవాణా, వెట్టిచాకిరీ మొదలైనవాటిలో నిమగ్నమైన వారిని రక్షించే లక్ష్యంతో చేపట్టిన ఆపరేషన్ ముస్కాన్-10 పనితీరుపై చర్చించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో కమిషనర్ మాట్లాడుతూ.. సమాజంలో బాలకార్మిక వ్యవస్థ ఒక వ్యాధిలాగా మారిందని, అది ఎంతో మంది అమాయక పిల్లల బాల్యాన్ని నాశనం చేస్తోందని పేర్కొన్నారు. ప్రధానంగా తల్లిదండ్రుల పేదరికం వల్ల పిల్లలు వెట్టిచాకిరీ కోరల్లో చిక్కుకుని తమ బంగారు భవిష్యత్తును కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితి ఎలా ఉన్నా, తమ పిల్లలను మాత్రం వెట్టిచాకిరీ కూపంలోకి నెట్టకూడదని, పిల్లల చదువు కోసం ప్రభుత్వం ఉచితంగా ఎన్నో కార్యక్రమాలు, పథకాలు అమలు చేస్తోందని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వెట్టి చాకిరీ నిర్మూలనలో ప్రజా భాగస్వామ్యం ఉండాలని, ప్రజలు కూడా దాన్ని తమ నైతిక బాధ్యతగా భావించాలని పిలుపునిచ్చారు.
రాచకొండ పరిధిలో మానవ అక్రమ రవాణా మరియు బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించడానికి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని సీపీ పేర్కొన్నారు. మానవ అక్రమ రవాణా మీద ఉక్కు పాదం మోపుతున్నామని, ప్రత్యేక బృందాల ద్వారా ఎంతో మందిని రక్షించామని, కేసులు నమోదు చేశామని తెలిపారు. "ఆపరేషన్ ముస్కాన్-10" ద్వారా నిరాశ్రయులైన పిల్లలను మరియు భిక్షాటనలో చిక్కుకున్న పిల్లలు మరియు బాలకార్మికులను బలవంతంగా రక్షించడం మరియు పునరావాసం కల్పించడం లక్ష్యంగా 1 జూలై 2024 నుండి 31 జూలై 2024 వరకు ప్రత్యేక డ్రైవ్ చేపడతామన్నారు. ఇందుకోసం ఒక సబ్ ఇన్‌స్పెక్టర్, నలుగురు పోలీసు కానిస్టేబుల్‌లు ఉండేలా (ఒక మహిళా పోలీసు కానిస్టేబుల్‌తో సహా) ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామన్నారు. ఈ బృందాలు అక్రమ రవాణాలో చిక్కుకున్న పిల్లలను రక్షించి పునరావాసం కల్పిస్తాయి. వివిధ కారణాల వల్ల వారి కుటుంబాల నుండి విడిపోయిన లేదా తప్పిపోయిన పిల్లలను గుర్తించడానికి "దర్పన్" అనే ఫేషియల్ రికగ్నిషన్ సాఫ్ట్‌వేర్ అప్లికేషన్‌ను ఉపయోగిస్తున్నట్లు తెలిపారు. ఒడిషా, బీహార్ వంటి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన ఇటుక బట్టి కార్మికుల పిల్లలు విద్యకు దూరం కాకూడదు అని వారి నివాస ప్రాంతంలోనే వర్క్ సైట్ పాఠశాలలను నడుపుతున్న విషయం గుర్తుచేశారు.
ఈ కార్యక్రమంలో డీసీపీ ఉమెన్ సేఫ్టీ ఉషా విశ్వనాథ్, ఏసిపి వెంకటేశం, రంగారెడ్డి జిల్లా సంక్షేమ అధికారిణి పద్మజా రమణి, మేడ్చల్ జిల్లా సంక్షేమ అధికారి శ్రీ కృష్ణా రెడ్డి, రంగారెడ్డి జిల్లా సిడబ్ల్యుసి చైర్ పర్సన్ శ్రీ నరేందర్ రెడ్డి, మేడ్చల్ జిల్లా సిడబ్ల్యుసి చైర్ పర్సన్ శ్రీ రాజా రెడ్డి, యాదాద్రి సిడబ్ల్యుసి చైర్ పర్సన్ శ్రీమతి జయశ్రీ, మేడ్చల్ జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ రఘునాథ్ స్వామి, మేడ్చల్ & యాదాద్రి జిల్లాల డి.సి.పి.ఓ. లు ఇంతియాజ్, సైదులు, బాలరక్ష భవన్ అధికారులు, కార్మికశాఖ అధికారులు, విద్యాశాఖ అధికారులు, బచపన్ బచావో ఆందోళన్ ప్రతినిధి వెంకటేశ్వర్లు, చైల్డ్ లైన్ అధికారులు మరియు ఇతర రాచకొండ పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.