For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

తెలంగాణకు మరో ప్రతిష్ఠాత్మక సంస్థ

04:23 PM Jan 17, 2023 IST | Sowmya
Updated At - 04:23 PM Jan 17, 2023 IST
తెలంగాణకు మరో ప్రతిష్ఠాత్మక సంస్థ
Advertisement

పలు అంతర్జాతీయ సంస్థలకు కేంద్రంగా విలసిల్లుతున్న హైదరాబాద్‌ నగరానికి మరో సంస్థ రానుంది. ప్రపంచ ఆర్థిక వేదిక (వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరమ్‌)కు చెందిన సీ4ఐఆర్‌ (సెంటర్‌ ఫర్‌ ఫోర్త్‌ ఇండస్ట్రియల్‌ రెవల్యూషన్‌) కేంద్రాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేయనున్నారు. దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో దీనికి సంబంధించిన ఒప్పందంపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు సమక్షంలో వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరమ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ జెరేమీ జర్గన్స్‌, రాష్ట్ర ప్రభుత్వ లైఫ్‌ సెన్సెస్‌ ఫౌండేషన్‌ సీఈవో శక్తి నాగప్పన్‌ సంతకాలు చేశారు.

ఈ కార్యక్రమంలో ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్‌, వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరమ్‌ అధ్యక్షుడు బోర్గ్‌ బ్రెండేతోపాటు ఇతర అధికారులు పాల్గొన్నారు. నాలుగు ఖండాలలో విస్తరించిన డబ్ల్యూఈఎఫ్‌ నాలుగో పారిశ్రామిక విప్లవం నెట్‌వర్క్‌లో తెలంగాణ 18వ కేంద్రం కానున్నది. జీవశాస్త్రాలు(లైఫ్‌ సైన్సెస్‌), ఆరోగ్య సంరక్షణ అంశాలపై ఈ కేంద్రం అధ్యయనం చేయనుంది. భారతదేశంలో సీ4ఐఆర్‌ విభాగాన్ని ఏర్పాటుచేయడం ఇదే తొలిసారి.

Advertisement GKSC

తెలంగాణ సత్తాకు నిదర్శనం : కేటీఆర్‌
లైఫ్‌ సైన్సెస్‌ రంగంలో తెలంగాణ రాష్ట్రానికి ఉన్న అనుకూలతలు, సత్తాకు ఈ కేంద్రం ఏర్పాటే నిదర్శనమని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. తెలంగాణతోపాటు ప్రపంచవ్యాప్తంగా లైఫ్‌ సెన్సెస్‌ రంగం ఎదుగుదల, ఎకో సిస్టం పెంపొందించడానికి ఈ కేంద్రం ఏర్పాటును ముందడుగుగా భావించాలని అన్నారు. జీవ శాస్త్రం, ఆరోగ్య రంగంలో ఉన్న అవకాశాలను భారతదేశం అందిపుచ్చుకోవడానికి ఈ కేంద్రం దోహదపడగలదని అన్నారు.

ఉపాధి కల్పనలో కీలక పాత్ర : బోర్గ్‌ బ్రెండే
హెల్త్‌ కేర్‌, లైఫ్‌ సైన్సెస్‌ రంగాల్లో అగ్రగామిగా నిలిచేందుకు భారతదేశానికి అవకాశం ఉన్నదని వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరమ్‌ అధ్యక్షుడు బోర్గ్‌ బ్రెండే పేర్కొన్నారు. ప్రభుత్వం, పరిశ్రమల మధ్య సమన్వయంతో పాటు ఉద్యోగ, ఉపాధి కల్పన విషయాల్లో సీ4ఐఆర్‌ కేంద్రం కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. హైదరాబాద్‌లో సీ4ఐఆర్‌ ఏర్పాటు వల్ల ఉపాధి అవకాశాలు పెరుగుతాయని చెప్పారు.

హైదరాబాద్‌కు మంచి ట్రాక్‌ రికార్డు : శ్యామ్‌
వ్యాక్సిన్‌లు, ఎన్నో ఔషధాల తయారీలో భారతదేశం, హైదరాబాద్‌లకు మంచి ట్రాక్‌ రికార్డు ఉన్నదని వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం హెల్త్‌ కేర్‌ హెడ్‌ డాక్టర్‌ శ్యామ్‌ బిషెన్‌ పేర్కొన్నారు. నాలుగో పారిశ్రామిక విప్లవ సాంకేతికతను ఉపయోగించుకొని ఆరోగ్య సంరక్షణలో గ్లోబల్‌ పవర్‌ హౌస్‌గా ఇండియా మారుతుందని తెలిపారు. ఈ ఎదుగుదలకు తెలంగాణ రాష్ట్రమే నాయకత్వం వహిస్తుందని చెప్పారు. ఆరోగ్య సంరక్షణ రంగంలో వినూత్న మార్పులు తేవడంతోపాటు రోగులకు సౌకర్యాలను మెరుగుపరచడంలో ఈ కొత్త కేంద్రం కీలక పాత్ర పోషించగలదన్నారు.

Advertisement
Author Image