ఇది నా పవన సుత.. నామ! ఆయనే చిరునామాగా ఉన్న ఎందరి కోసమో రాస్తున్న వీలునామా!!
ఇందులో అక్షరం అక్షరం ఆయనకే అంకితమిస్తున్న (ఈ ఖాళీ మీరే పూరించుకోండి)!!! ప్రత్యేక కధనం సీనియర్ జర్నలిస్ట్ ఆది
మేం దేవినేని అవినాష్ కి ప్రొమోషనల్ వర్క్ చేయడానికి బెజవాడ వెళ్లాం. ఈ పనులన్నీ అవినాష్ కజిన్ సిస్టర్ చూసేలా మాకు చెబితే ఆమెను కలిశాం. ఆమె మాతో అన్న మాట ఏంటంటే.. పవన్ కళ్యాణ్ తెలిసి అంటాడో తెలీక అంటాడో తెలీదుగానీండీ.. ఆయన ఏదంటే అదే ఒక సంచలనమండీ! ఇంత మంది రాజకీయ మేథావులున్నారు.. వాళ్లకు లేని రీచ్ ఆయనకుంది. అదే ఆయన్నో పెద్ద పొలిటికల్ పవర్ జంక్షన్ గా మార్చిందని డిక్లయిర్ చేశారామె.
కట్ చేస్తే.. దాని ఫలితం నేడు.. పవన్ కళ్యాణ్ 21కి ఇరవై ఒక్క అసెంబ్లీ సీట్లు, రెంటికి రెండు పార్లమెంటు స్థానాల గెలుపుతో.. ఇతడు పవన్ కాదు తుఫాన్ అని ఏకంగా మోదీ చేతే అనిపించుకున్నారు. దీన్నిబట్టీ చెప్పొచ్చు.. పవన్ లో నిజంగానే ఏదో ఒక మానియా ఉందని. ఇప్పుడాయన స్టేటస్ పవర్ పాలిటిక్స్ కి కేరాఫ్ అడ్రెస్. నేను చూడగా నాకు అర్ధమైన విషయమేంటంటే.. పవన్ కళ్యాణ్ నిజంగానే ఏదో మాజిక్ చేస్తున్నాడనిపిస్తోంది. అరే అదేంటయ్యా బాబూ.. ఆయన చాలా చాలా రకాల మాటలంటాడు. నాటోన్లీ కాంట్రవర్షియల్ బట్ ఆల్సో కాంట్రిడిక్షనల్ కామెంట్స్ చేస్తుంటాడు. ఆ మాటకూ ఈ మాటకు అస్సలు పొంతనే ఉండదు.
ఇదే తిరుమల లడ్డూ- ఆవు నెయ్యి అంశమే తీసుకుంటే ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నాడా? అది జరిగింది తిరుమల కొండ అయితే దుర్గమ్మ కొండ మెట్లు కడిగి కుంకుమ పెడతాడు. ఇక బీఫ్ తినాల్సి వస్తే తింటాననే అంటాడు. నా కూతురు, భార్య ఇద్దరూ క్రిస్టియన్లంటాడు. బైబిల్ చేతబట్టి క్రీస్తు వ్యాఖ్యలు చదువుతాడు. నెత్తికి టోపీ, ముఖానికి గెడ్డం పెంచి ముస్లమాన్లలో ముస్లమాన్ని నేనంటాడు. అదే సమయంలో సనాతన ధర్మానికో బోర్డు కావాలనీ ఎలుగెత్తుతాడు. తన వాహనానికి ఏకంగా వారాహీ అమ్మవారి నామకరణం చేస్తాడు. ఇన్ని వేరియేషన్లు.. ఒక్క మనిషిలో ఎలా సాధ్యం!? అని నోరెళ్లబెడుతుంటారు చాలా మంది.
ఇంకా డీప్ గా వెళ్తే మీకు ఆంధ్ర ప్రాంతీయ అభిమానం కూడా లేదా? అంటూ ప్రాంతీయ వాదాన్ని రెచ్చగొడతాడు. అవసరమైతే చేగువేరాను తీసుకొచ్చి తన రాజకీయ సామాజిక సిద్ధాంతాల్లో అత్యంత కీలకమైనది ఇదేనని సెలవిచ్చేస్తాడు. ఒక మనిషిలో కమ్యూనిజం, మతతత్వ వాదం.. అందులోనూ రకరకాల వేరియేషన్స్.. హిందూ- ముస్లిం- క్రిస్టియన్ తేడా లేకుండా అన్నిటికీ తానే అతి పెద్ద ఐకానిక్ లీడర్షిప్ గా అవతరించడం సాధ్యమయ్యే పనేనా? అంటే అవుననే తెలుస్తోంది. పవన్ అందుకు జంక్షన్ బాక్స్ ఏమోనని కొడుతోంది.
గతంలో ఇలాంటి క్వాలిఫికేషన్లు.. బాబు- జగన్ తో పోలిస్తే జగన్ రెడ్డికే అధికంగా ఉండేవి. జగన్ పేరుకు రెడ్డి. మత పరంగా క్రిష్టియన్. ఇక తండ్రి పార్టీ కాంగ్రెస్ ద్వారా వచ్చిన ముస్లిం సపోర్ట్. బావ అనిల్ ద్వారా ఇటు క్రైస్తవ మతస్తుల మద్దతు… అటు తాను బ్రాహ్మణుడు కూడా కావడంతో ఇదో రకం సపోర్టు. మొన్నామధ్య మేనల్లుడు రాజారెడ్డి కమ్మవారమ్మాయిని పెళ్లాడ్డంతో ఆ వర్గంలోనూ అంతో ఇంతో సానుభూతి. ఇక తన బంధువుల్లో ఎస్సీలుంటారన్న స్వయం ప్రకటనలూ వెరసీ జగన్ రెడ్డి.. సామాజిక సమీకరణాల విషయంలో బాబుకన్నా ఎంతో ముందుండేవాడు . ఈ టాపిక్ లో టాప్ పొజిషన్ జగన్ దే అయ్యేది. ఒక సారి యనమల, సోమిరెడ్డి తరహా నాయకులతో కూడిన టీడీపీ జూమ్ మీటింగ్ లో దీనిపై సుదీర్ఘ చర్చ కూడా జరిగింది. టీడీపీని పలు సామాజిక వర్గాలు వదిలేస్తున్నాయని వారిలో వారు మధనపడ్డ పరిస్థితులు.
అప్పుడొచ్చాడొక టార్చ్ బేరర్!!! ఇన్నాళ్ల పాటు.. మీరు చేసిన రాజకీయాలన్నీ ఒక ఎత్తు. ఆయనొచ్చాక ఒక ఎత్తు. రామ్ చరణ్- శంకర్ కాంబో టైటిల్ లాంటి గేమ్ చేంజర్ అంటారే సరిగ్గా అలాంటోడే.. అప్పటి వరకూ ఆయన నటించిన సినిమాలు ఆడితే ఆడినట్టు. లేకుంటే లేనట్టు. ఆ మహేష్ బాబు తాను నటించే.. సినిమాలు హిట్టు- ఫట్టు ఒక తెరన్మరణ(జీవన్మరణ) సమస్య అయితే- అదే పవన్ కి జయాపజయాలతో సంబంధమే లేదు. జస్ట్ ఆ కటౌట్ చాలు.. హిట్\ ఫ్లాపులతో పనిలేనంతగా అవకాశాల వెల్లువ.. ప్రేక్షకాభిమానజనాల్లో చెక్కు చెదరని ఆదరాభిమానాల నిలువ. వరుస వెంబడి సినిమాలు చేసుకుంటూ వెళ్లడమే.. ఈ తెరకాశం నీ హద్దురా.. అవకాశం వదలొద్దురా! అనేంత భారీ సిల్వర్ స్క్రీన్ కాన్వాస్. సినిమాల్లో ఇలాంటి అవధుల్లేని అతీతమైన విజయ పరంపర సృష్టించిన ఒకే ఒక్కడు పవన్ కళ్యాణ్. తన అన్నయ్య రాజకీయ పరాజయం ద్వారానా మరొకటా.. అనవసరం కానీ.. టాలీవుడ్ లో ఉంటూనే పోలీవుడ్(రాజకీయరంగం) లోకి ఎంట్రీ ఇచ్చాడు.
మొదటి పది బాల్స్ కష్టంగానే ఆడిన లారా- గిల్ క్రిస్ట్- సచిన్- సెహ్వాగ్- రిషభ్ పంత్ ల ఇన్నింగ్స్ ఎంత బోరింగో అంత బోరింగానే అనిపించింది. ఆ తర్వాత తన దశావతారాన్ని(పార్టీ పెట్టి పదేళ్ల తర్వాత) జూలు విదిల్చాడు భయ్యా.. ఒక రోజుల్లో రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయాడన్న ముద్రను అమాంతం చెరిపేస్తూ.. హండ్రడ్ కి 100% పక్కా సక్సెస్ తో చెలరేగిపోయాడని ఉర్రూతలూగిపోతున్నారు ఆయన ఫ్యాన్స్. దట్స్ ద పవన్ కా దస్ కా దమ్.
ఇప్పుడు టాపిక్ ఏంటంటే.. పవన్ ప్రాయశ్చిత్త దీక్ష, సనాతన బోర్డు డిమాండ్. ఈ క్రమంలో అటు తమ మెగా కాంపౌండ్ పెట్ యాక్టర్ ప్రకాష్ రాజ్(ఒక సమయంలో మెగా ఫ్యామిలీ సపోర్టుతో మా అధ్యక్షుడిగా పోటీ పడ్డవాడు) తో కూడా వెరవక గొడవలు. వీటన్నిటిని బట్టీ చూస్తుంటే పవన్ని ఎలా అర్ధం చేసుకోవాలి? అన్న దగ్గర చాలామంది మైండ్ సెట్స్ ఆగిపోతున్నాయ్. ఈ పాయింట్ దగ్గర వారి వారి ముఖ చిత్రాలు స్ట్రక్ అయిపోతున్నాయ్. వీళ్లందరి తుప్పు వదిల్చేలా.. ఆయన్ను మనం ఎలాంటి కామెంటింగ్ తో డిస్క్రయిబ్ చేయాలని చూస్తే. నిజంగానే పవన్ ఒక కాకిలాంటి వాడు. కాకి ఒకటి ఉన్నది. కావు కావు మన్నది. నీటి దాహమేసెను.. ఆ కుండలోని నీరు.. లోనలోన ఉన్నది. ఆ కాకికో కొత్త యోచనొచ్చెను… రాయి రాయి తీసెను. కుండలోన వేసెను. కుండ నీరు నిండెను. హాయిగా తాగి సేదదీరెను. దాహమంత తీరెను.. అన్నట్టుగానే సాగుతుందీ పొలిటికల్ పవన సుత నామ కథ- కమామిషూ!
పవన్ కళ్యాణ్ వివిధ సమయాల్లో అన్న కామెంట్లు.. కేవలం అవి కామెంట్లు కావు.. ఖచ్చితమైన లక్ష్య చేధనతో కూడున్న ఉద్దేశ పూర్వకమైనవే. ఆయనేం మీరనుకున్నంత బఫూన్ కాడు. బహుత్ బడా మెజీషియన్. ఈ భూప్రపంచం మీద మూడు పెళ్లిళ్లు చేసుకున్నా కూడా ఎందరో ఏకపత్నీ వ్రతుల ఆరాధ్య దైవంగా నిలిచిన వాడు. రాజకీయ అనామకుడివి నీకేం తెలీదు.. నిన్ను అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వం అన్న వారిని ఏకంగా అసెంబ్లీలోనే లేకుండా చేశాడు. నువ్వు రెండు చోట్ల ఓడిపోయావ్ అంటూ అవహేళన చేసిన వాళ్లలో కొందర్నిక రెండు జన్మలు ఎత్తినా గెలవని దుస్థితిలోకి నెట్టేశాడు. గాడిదలా వయసొచ్చింది సిగ్గు లేదా? అంటూ తక్కువ చేసి మాట్లాడిన వారిని ఏకంగా రాష్ట్రం దాటి, మరో పార్టీ మారే సిట్యువేషన్ కి తెచ్చేశాడు. ఇన్నేసి క్వాలిఫికేషన్లు ఒక్కడిలో అంటే.. అదేమంత తేలికైన విషయం కాదు!!!
ఇప్పుడు చూస్తే.. గతంలో తన తండ్రి దీపారాధనలో సిగరెట్ ముట్టించాడన్న సంచలన కామెంట్ చేసి ఏకంగా కమ్యూనిస్టుల్లోనే అలజడి చెలరేగేలా చేసిన వాడు.. వివేకానందుడు చెప్పాడు బీఫ్ తినడంలో తప్పే లేదన్నవాడు.. తన కూతురు బాప్తిజం తీస్కుందన్నవాడు. తన భార్య క్రిష్టియన్ అన్నవాడు.. చెగువేరా విప్లవాత్మక ఆలోచనలే తన ఊపిరిగా మాట్లాడిన వాడు.. తాను ఎంతో ఇష్టంగా ముస్లిమ్ గెడ్డం పెంచుతానన్న వాడు. ఏకంగా సనాతన బోర్డుకు డిమాండ్ చేస్తున్నాడంటే. ఇది తెలిసీ తెలియని రాజకీయమా!? లేక.. కుల-మత-వర్గ- ప్రాంత- వైషమ్యాలన్నిటినీ చెరిపేస్తూ.. అన్నీ తానై విస్తరిస్తున్న హిందుత్వమంత విశాల రాజకీయ వట వృక్షమా.. అర్ధంకాని గజిబిజి. Ssss.. మన ఊహ\ ద గెస్సింగ్ కరెక్టే. హిందుత్వం కూడా ఇంతేగా.. ఇక్కడ అన్నీ అందరికీ ఆమోదయోగ్యమే. ఇదే హిందూ జీవన విధానంలోంచి బౌద్ధ- జైన- సిక్కు ఇలా ఎన్ని మతాలు ఉద్భవించలేదు??? హిందూత్వం అసలు సిసలు ఆత్మ స్వరూపం ఇది కాదా!!!
R.S.S చెప్పినట్టు.. ఇక్కడ అన్యమతస్తులెవరూ లేరు. అది ఇస్లామ్ అయినా- క్రైస్తవం అయినా.. జైన- సిక్కు- పార్శీ- సిక్కు- మతాలు ఏవైనా.. అన్నీ ఇక్కడ ఆచరణనీయమే. ఆ మాటకొస్తే ఇక్కడి వారందరూ జన్మతః హిందువులే- మత పరంగా రకరకాల ఆచార పారాయుణులే. అలాంటి తత్వం మన మతంలోనే ఉన్నపుడు.. తాజాగా ఆయనీ పని చేసి, ఆ మాట ఎలా అంటాడు? ఒకప్పుడు బైబిల్ పట్టిన వాడు ఇప్పుడు ప్రాయశ్చిత్త దీక్షలు చేయడమేంటి?? గడ్డం పెంచి ముస్లిమ్ లా కనిపించడం మాత్రమే కాదు గొడ్డు మాంసం తినడంలో తప్పే లేదన్నవాడు.. దుర్గమ్మ మెట్లు కడగడమేంటని??? మనం చాలా చాలా హీనంగా ఆయన్ను తీసికడుతున్నాంగానీ. ఇది కదా నిజమైన హిందుత్వమంటే.. ఇతడు కాడా హిందూత్వపు గర్భంలోంచి పుట్టుకొచ్చిన అసలు సిసలు ముద్దు బిడ్డడంటే.. ఇది కదా ఏకత్వంలో- భిన్నత్వమంటే(భిన్నత్వంలో ఏకత్వంలాంటిదే) మీరు మీ దైనందిన జీవితాల్లోనిదే ఆయన తరచూ ఆచరిస్తున్నాడు ఇందులో తప్పేముందీ??? మీ మీ మతాచారాల్లో ఉన్నదే ఆయన ఎత్తి చూపుతున్నది. ఒక వేళ పవన్ కళ్యాణ్నే మనం సంస్కరించాలనుకుంటే మొదట.. మనల్ని మనం సంస్కరించుకోవాలిగా!!!
అదే జరగాలంటే మరో పాకిస్తాన్ని రాసివ్వక తప్పదు. ఇంకో బంగ్లాదేశ్ ని బయట పుట్టించక మానదు. ఇంకో ఇజ్రాయిల్ ని కనుగొనక తప్పదు. కాబట్టి… లోకా సమస్తు సుఖినోభవంతు నీ నిఖార్సయిన హైందవ జాతి నినాదమైతే.. సర్వేజనా శుఖినోభవంతు నీ విధానమైతే.. ఓం శాంతి శాంతి శాంతి నీ స్వస్తి వచనమైతే.. నువ్వు నేను మనమంతా నిస్సిగ్గుగా పవన్ కళ్యాణ్ని, ఆయన ఆచరణాత్మక జీవన శైలి, ఇతర విధి విధాయకాలను విధిగా… వినమ్రంగా ఒప్పుకొనక తప్పదు. ఈ పాటికే నేనేం చెప్పానో.. అర్ధం చేసుకుంటారని మనవి. ఏం చెప్పలేదో దాన్ని కూడా అర్ధం చేసుకోగలరని విజ్ఞప్తి!!!
ఇది నా పవన సుత.. నామ!
ఆయనే చిరునామాగా ఉన్న ఎందరి కోసమో రాస్తున్న వీలునామా!!
ఇందులో అక్షరం అక్షరం ఆయనకే అంకితమిస్తున్న (ఈ ఖాళీ మీరే పూరించుకోండి)!!! ప్రత్యేక కధనం సీనియర్ జర్నలిస్ట్ ఆది