ఒక సామాన్యుడు సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్‌గా ఎలా మారాడు ?
Latest Film News : ఒక మీడియా సంస్థకోసం కొన్ని లక్షల రూపాయల పని చేస్తే పక్కకు పిలిచి కొన్నివేల రూపాయలు చేతిలో పెడితే ఆ డబ్బులు వద్దని వాళ్లకే ఇచ్చేశాడతను. కట్‌చేస్తే ఆటోకి కూడా డబ్బులు లేవు…నడుచుకుంటూ తన అన్నిరోజుల కష్టాన్ని తలచుకుంటూ వళ్లంతా చెమటతో కళ్లవెంట కారుతున్న నీళ్లతో 7 కిలోమీటర్లు నడిచి ఇంటికి వెళ్లాడు. మరోసారి తను ఉంటున్న ఇల్లుని ఖాళీచేయిస్తే లారీలో సామాను పెట్టుకుని అద్దెంటికోసం రోజంతా రోడ్లమీద తిరిగాడు. ఆ రోజున తను డిసైడ్ చేసుకున్నాడు. ఏ హైదరాబాద్‌లో అయితే డబ్బుల్లేక రోడ్లపై నిలబడ్డానో అదే హైదరాబాద్‌లో నాకు సొంత ప్లేసుండాలని నిర్ణయించుకున్నాడు. కట్‌చేస్తే మూడుచోట్ల స్థలాలు కొన్నాడు.
అతనిలోని సంగీత దర్శకుడు ఎంతో కసి పెంచుకున్నాడు. నా పాటలు ఈ మీడియా హౌస్‌లో కాదు..ప్రపంచంలోని తెలుగు వారందరూ వినాలి అనుకుని దిక్కులు పెక్కటిల్లేలా అరిచేస్తూ గిటార్ తీశాడు. ఆ అరుపులు ఏ దేవుడు విన్నాడో…..‘రఘునందన, రఘు రఘు నందన …’ అంటూ ‘హనుమాన్’ చిత్రానికి సంగీతాన్ని అందించి తన పాటలు విశ్వమంతా తెలిసేలా చేసుకున్న ఆ సంగీత దర్శకుడే గౌర హరి. చిన్నప్పటినుంచే సంగీతం అనే మత్తులో తేలేవాడు. తేజా సజ్జా, ప్రశాంత్ వర్మలతో పాటు సంగీత దర్శకునిగా హనుమాన్ సినిమాకి నేషనల్ అవార్డు వచ్చినా ఆశ్చర్యపడాల్సిన పనిలేదు. ప్రస్తుతం ‘మిరాయి’ చిత్రంతో మరోసారి తన సంగీతంతో మెరుస్తున్నాడు.