Butterfly : 13 ఏళ్ల చిన్నారి రాసిన 'బటర్ ఫ్లై' నవల ఆధారంగా తెరకెక్కనున్న అద్భుత చిత్రం
సైరా పదిన్నర సంవత్సరాల వయసులో బటర్ఫ్లై అనే నవలను రాసింది. సైర మన దేశంలోనే అతిపిన్న వయస్కురాలైన నవలా రచయిత. ఇప్పుడు సైరా వయస్సు 13 సంవత్సరాలు. ఈ నవల పేరు చూసి ఇది చిన్న పిల్ల రాసిన ఫెయిరీ టేల్ అనుకుంటే పొరపడినట్లే. తను రెండవ క్లాస్ లో ఉన్నప్పుడు మొదటిసారి తన ఫ్రెండ్ నోటినుంచి ఆమె తల్లితండ్రుల విడాకుల గురించి విన్నది. ఆ తర్వాత ప్రతి రెండు మూడు నెలలకు ఇంకో క్లాస్మెట్ తల్లితండ్రులు విడిపోవడం ఆ పిల్లలు ఎప్పుడూ ఏడుస్తూ గడపడం చూసి మొదట వాళ్లను ఓదార్చే ప్రయత్నం చేసి విఫలమైంది.
తను చాలా మధనపడి తన వయసు ఉన్న ఈ పిల్లల సమస్యపై తనే బాగా రాయగలనని అనుకుని రాయడం మొదలు పెట్టింది. మొత్తం తొమ్మిది రోజుల్లో ఈ బుజ్జి నవలను పూర్తి చేసింది. సైర ఇప్పుడు బంజారా హిల్స్ లో ఉన్న మెరిడియన్ స్కూల్ లో 9 వ తరగతి చదువుతుంది. సైర బాగా పాడుతుంది. సైరా పలు యాడ్ ఫిల్మ్స్ కి స్క్రిప్టు రాసింది. కొన్ని యాడ్స్ లో నటించింది. జనవరి 26 నుండి 28 వరకు జరిగిన హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్ లో పానలిస్టు గా ఆహ్వానం అందుకొని పాల్గొన్న అతి పిన్న వయస్కురాలైన రచయిత సైరా. ఆమె తల్లి రుబీనా పర్వీన్ నేషనల్ అవార్డ్ విన్నింగ్ సోషల్ ఆంత్రప్రెన్యూర్, యాడ్ ఫిల్మ్ మేకర్, తండ్రి డాక్టర్ మజహరుల్లా ఖాన్ ఖైషగి IIT నుంచి ఇంజనీరింగ్ లో PhD చేసి ఇరిగేషన్ డిపార్టుమెంటులో డిప్యూటి సూపరెండెంట్ ఇంజనీర్ గా పని చేస్తున్నారు.
సైరా ఇంగ్లీషులో రాసిన Butterfly నవలను అన్వేక్షికి పబ్లికేషన్స్ ప్రచురించింది. అక్టోబర్ 8 న జూబ్లీహిల్స్ క్లబ్లో పుస్తకావిస్కరణ జరిగింది. సైరా రాసిన బటర్ ప్లై పై ఇప్పుడు బాగా చర్చ జరుగుతోంది. ఇప్పటికే చాలా కాపీలు అమ్ముడౌతున్నాయి. ఈ నవల అమేజాన్లో అందుబాటులో ఉంది. సైరా ఇంకా తొమ్మిది కథలు కూడా రాసింది. త్వరలో సైరా కథల సంపుటి రాబోతోంది. సైరా తల్లి రుబీనా మాట్లాడుతూ “ విడాకుల రేటు రోజు రోజుకు పెరుగుతుండడంతో కుటుంబాలు తీవ్ర వత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ఇలాంటి తరుణంలో ఈ కథాంశానికి మంచి డిమాండ్ తో పాటు, కమర్షియల్ వయబులిటీ ఉండడంతో రీజనల్, నేషనల్ ప్రొడక్షన్ హౌసెస్ సినిమా గా నిర్మించడానికి మమ్మల్ని సంప్రదిస్తున్నారు. త్వరలో Butterfly వెండితెరకు ఎక్కనుంది.” అన్నారు.