Rains : ఏపీలో శుక్ర, శని వారాల్లో భారీ వర్షాలు... ప్రజలు జాగ్రత్తగా ఉండాలంటున్న వాతావరణ శాఖ !
Rains : వాతావరణ శాఖ సూచనల ప్రకారం నైరుతి బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న హిందూ మహాసముద్రం ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడిందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డా.బి.ఆర్ అంబేద్కర్ తెలిపారు. ఇది రాబోయే 48 గంటల్లో మరింత బలపడే అవకాశం ఉందని శనివారం లోపు వాయువ్య దిశగా కదులుతూ తమిళనాడు-పుదుచ్చేరి తీరాల వైపు పయనించే అవకాశం ఉందని వెల్లడించారు.
దీని ప్రభావంతో శుక్ర వారం, శని వారం రెండు రోజుల పాటు దక్షిణ కోస్తా, రాయల సీమలో అక్కడక్కడా పిడుగులతో కూడిన భారీ వర్షాలు, చాలా చోట్ల తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఒక ప్రకటన విడుదల చేశారు. ఆ ప్రకటనలో... దక్షిణాంధ్ర - తమిళనాడు తీరాల వెంబడి శనివారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని సూచించారు. పిడుగులతో కూడిన వర్షాల నేపధ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని... లోతట్టు ప్రాంత ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
రైతులు వ్యవసాయ పనుల్లో తగిన చర్యలు తీసుకోవాలని... ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడేప్పుడు చెట్ల కింద నిలబడవద్దని విజ్ఞప్తి చేశారు. కరెంట్ పోల్స్ వంటి వాటికి దూరంగా ఉండాలని... కాలువలు, చెరువులకు సమీప ప్రాంతాల్లో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. చెరువులకు గండ్లు పడే అవకాశం ఉంటే.., వారిని సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. సిటీల్లో నివశించే పౌరులు మ్యాన్ హోల్స్ విషయంలో జాగ్రత్తగా వహించాలన్నారు. ఇటువంటి పరిస్థితుల్లోనే ప్రజలు అధికారులకు సహకరించి జాగ్రత్తగా ఉండాలని కోరారు.
శక్ర,శనివారం2-రోజులపాటు దక్షిణకోస్తా,రాయలసీమలో అక్కడక్కడ పిడుగులతో కూడిన భారీవర్షాలు,అనేకచోట్ల తేలికపాటి నుండి మోస్తారువర్షాలు పడే అవకాశం ఉందని విపత్తులసంస్థ ఎండి డా.బిఆర్ అంబేద్కర్ తెలిపారు. దక్షిణాంధ్ర-తమిళనాడు తీరాల వెంబడి శనివారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని సూచించారు. pic.twitter.com/BpRqzOG7sY
— Andhra Pradesh State Disaster Management Authority (@APSDMA) November 9, 2022