For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

Gulf News : రాహుల్ గాంధీ గల్ఫ్ హామీలపై ఆశలు ◉ సీఎం రేవంత్, మంత్రి పొన్నం, ఎమ్మెల్సీ జీవన్ లపై బాధ్యత

11:17 PM Dec 27, 2023 IST | Sowmya
Updated At - 11:17 PM Dec 27, 2023 IST
gulf news   రాహుల్ గాంధీ గల్ఫ్ హామీలపై ఆశలు ◉ సీఎం రేవంత్  మంత్రి పొన్నం  ఎమ్మెల్సీ జీవన్ లపై బాధ్యత
Advertisement

గల్ఫ్ భరోసా - విశేషణ : 

భారత్ జోడో యాత్రలో 60వ రోజు మెదక్ జిల్లా నిజాంపేట సమీపంలో 13 నెలల క్రితం... 2022 నవంబర్ 6న సాయంత్రం ఇద్దరు గల్ఫ్ మృతుల కుటుంబ సభ్యులు రాహుల్ గాంధీని కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. నిర్మల్ జిల్లాకు చెందిన ఆదివాసీ వలస కార్మికుడు మూడ అశోక్ అబుదాబిలో చనిపోయాడు. గల్ఫ్ మృతుడు అశోక్ 10 నెలల కూతురు సాత్విక, తన తల్లి మూడ లక్ష్మితో పాటు రాహుల్ ను కలిసింది. పసిపాప అమాయక చూపులు, గల్ఫ్ మృతుని భార్య దీన స్థితిని చూసి చలించిన రాహుల్ తన పక్కనే ఉన్న మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ను ఆ కుటుంబానికి సహాయం చేయాలని కోరారు. జగిత్యాల జిల్లా వెలగటూర్ మండలం కొండాపూర్ కు చెందిన దళితుడు బచ్చల రాజనర్సయ్య షార్జాలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుని భార్య బచ్చల జమున తన బాధలను రాహుల్ తో పంచుకున్నారు.

Advertisement GKSC

తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ 2023 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా... 'అభయ హస్తం మేనిఫెస్టో' లో  'గల్ఫ్ కార్మికులు ఎన్నారైల సంక్షేమం' పేరిట ఎన్నారైలకు సంక్షేమ బోర్డు, గల్ఫ్ సంక్షేమ బోర్డు ఏర్పాటు, గల్ఫ్ దేశాల్లో చనిపోయిన కార్మికుని కుటుంబానికి  రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లింపు, టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ ఏర్పాటు అనే నాలుగు హామీలు ఇచ్చారు. ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ అప్పుడు సానుభూతి మాటలు తప్ప ఆర్థిక సహాయం చేయలేక పోయింది. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది కాబట్టి వెంటనే ప్రభుత్వం పక్షాన గల్ఫ్ మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లించాలని ఎమిగ్రంట్స్ వెల్ఫేర్ ఫోరం అధ్యక్షులు మంద భీంరెడ్డి  కోరారు. గల్ఫ్ హామీలను అమలు చేసి రాహుల్ గాంధీ గౌరవాన్ని కాపాడాలని ఆయన కోరారు.

భారత్ జోడో యాత్రలో రెండు గల్ఫ్ మృతుల కుటుంబాలను రాహుల్ కు పరిచయం చేసిన తెలంగాణ 'గల్ఫ్ కాంగ్రెస్' అధ్యక్షుడు సింగిరెడ్డి నరేష్ రెడ్డి, గల్ఫ్ జెఏసి చైర్మన్ గుగ్గిల్ల రవిగౌడ్ లు గల్ఫ్ సమస్యల గురించి రాహుల్ కు వినతిపత్రం సమర్పించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గల్ఫ్ కార్మికుల పట్ల వ్యవహరిస్తున్న నిర్లక్ష్య వైఖరి గురించి వారు వివరించారు. టిపిసిసి అధ్యక్షుడు ఎ. రేవంత్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీ టి. జీవన్ రెడ్డి, మధు యాష్కీ లు ఆ సమయంలో రాహుల్ గాంధీ పక్కనే ఉండి యాత్రలో పాల్గొన్నారు.

గల్ఫ్ వలస వ్యవహారాల విశ్లేషకులు మంద భీంరెడ్డి, ప్రవాసి మిత్ర లేబర్ యూనియన్ అధ్యక్షులు స్వదేశ్ పరికిపండ్ల, టిపిసిసి ఎన్నారై సెల్ చైర్మన్ డా. బి.ఎం. వినోద్ కుమార్ ల బృందం విజ్ఞప్తి మేరకు... భారత్ జోడో యాత్ర నిర్వహణలో ప్రధాన భూమిక పోషించిన సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్ కమిటీ గల్ఫ్ మృతుల కుటుంబాలు రాహుల్ గాంధీని కలవడానికి సహకరించింది.

ఐదేళ్ల క్రితం కూడా... 

2018 నవంబర్ 29న ఆర్మూర్ లో జరిగిన కాంగ్రెస్ ఎన్నికల ప్రచార సభలో... నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం బినోల గ్రామానికి చెందిన నూర్జహాన్‌బేగం, జగిత్యాల జిల్లా రాయికల్‌ వాస్తవ్యురాలైన దండుగుల లక్ష్మి అనే ఇద్దరు 'గల్ఫ్ విడో' లు తమ పిల్లలను వెంటబెట్టుకొని వచ్చి రాహుల్ గాంధీని కలిసి తమ బాధలు చెప్పుకున్నారు. బతుకుతెరువు కోసం ఒమన్‌ వెళ్లిన తన భర్త బషీర్‌ అక్కడే చనిపోయాడని, అప్పటినుంచి తాను తన ఇద్దరు పిల్లలు ఇక్రా తబస్సుమ్‌, ఎం.ఎ.అల్మాస్‌ లు దయనీయ జీవనం గడుపుతున్నామని నూర్జహన్‌బేగం వాపోయారు. కూలీ కోసం ఖతర్‌ వెళ్లిన తన భర్త దండుగుల జనార్దన్‌ అక్కడే గుండెపోటుతో మృతిచెందారని, ఉన్న ఆధారం కోల్పోవడంతో తాను తన ఇద్దరు పిల్లలు శశాంత్‌, అనిరుద్‌ లు జీవనం సాగించడం కష్టంగా మారిందని లక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు. తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. తమ ప్రభుత్వం వస్తే తప్పకుండా ఆదుకుంటామని రాహుల్‌గాంధీ వారికి హామీ ఇచ్చారు.

Advertisement
Author Image