బ్రహ్మోత్సవాలు ముగిసే వరకు అధికారులు మరియు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి : సీపీ సుధీర్ బాబు, ఐపీఎస్
కీసరగుట్ట బ్రహ్మోత్సవాల బందోబస్తు ఏర్పాట్లు పరిశీలించిన రాచకొండ పోలీస్ కమిషనర్
Keesaragutta Brahmotsavam : మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా జరగనున్న కీసరగుట్ట బ్రహ్మోత్సావాల నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా, ప్రశాంతంగా జరిగేందుకు తీసుకోవలసిన భద్రతాపరమైన చర్యలు మరియు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చేయాల్సిన ఏర్పాట్ల గురించి రాచకొండ కమిషనర్ శ్రీ సుధీర్ బాబు ఐపీఎస్ గారు బందోబస్తు విధుల్లో ఉన్న సివిల్, ట్రాఫిక్ మరియు ఇతర విభాగాల అధికారులు మరియు సిబ్బందితో సమన్వయ సమావేశం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో కమిషనర్ గారు మాట్లాడుతూ... బ్రహ్మోత్సావాల సమయంలో భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉండడం వల్ల భద్రతా పరమైన పొరపాట్లు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రజాప్రతినిధులు, విఐపీలతో పాటు సాధారణ భక్తులకు కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, మహిళా భక్తులు, పిల్లలు, వృద్ధుల కోసం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. బందోబస్తు విధుల్లో ఉన్న అధికారులు మరియు సిబ్బంది తమకు కేటాయించిన విధులను అత్యంత జాగ్రత్తగా నిర్వహించాలని, బ్రహ్మోత్సవాలు ముగిసే వరకు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వైద్యబృందం అప్రమత్తంగా ఉండాలని, అత్యవసర పరిస్థితుల్లో ప్రజల సౌకర్యార్థం డాక్టర్ల బృందంతో పాటు అంబులెన్సును, బీపీ షుగర్ వంటి వాటితో పాటు ఇతర అత్యవసర మందులు కూడా అందుబాటులో ఉంచాలని సూచించారు.
భక్తులతో పాటు బందోబస్తు విధుల్లో ఉన్న పోలీసు సిబ్బంది యొక్క క్షేమం కూడా తమకు అంతే ముఖ్యమని, పోలీసు సిబ్బంది అనుకోని పరిస్థితుల్లో అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉందని, అంతేకాకుండా ప్రత్యేక వైద్య చికిత్స తీసుకుంటున్న సిబ్బందికి అవసరమయ్యే మందులు కూడా అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు. సురక్షితమైన తాగునీరుతో పాటు వేసవి తాపానికి కొందరు వడదెబ్బకు గురయ్యే ప్రమాదం ఉంది కాబట్టి ఓఆర్ఎస్ ప్యాకెట్లు విస్తృతంగా అందుబాటులో ఉంచాలని సూచించారు. పారిశుధ్య ఏర్పాట్లు సక్రమంగా ఉండాలని, మహిళల కోసం ప్రత్యేకంగా మొబైల్ టాయిలెట్లు ఏర్పాటు చేసేలా చూడాలని సంబంధిత అధికారులకు సూచించారు.
ఆలయ ప్రాంగణంలో అన్ని వైపులా ఏర్పాటు చేసిన సిసిటీవీ కెమెరాల ద్వారా కమాండ్ కంట్రోల్ అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ ఉండాలని, మహిళా భక్తుల రక్షణ కోసం షీ టీం బృందాలు కూడా విధుల్లో ఉండాలని పేర్కొన్నారు. భారీసంఖ్యలో భక్తులు దైవదర్శనం కోసం వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు సమన్వయంతో పనిచేసి బ్రహ్మోత్సవాలు ప్రశాంతంగా జరిగేలా చూడాలని కమిషనర్ సూచించారు. ఈ కార్యక్రమంలో మల్కాజ్ గిరి డిసిపి పివి పద్మజ ఐపిఎస్, డిసిపి క్రైమ్ అరవింద్ బాబు, ఐటి సెల్ ఏసీపీ నరేందర్ గౌడ్ మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.