Police Amaraveerula Dinotsavam : పోలీసు అమరవీరుల త్యాగాలు అజరామరం : సీపీ డి ఎస్ చౌహాన్ ఐపీఎస్
పోలీసు అమరవీరుల దినోత్సవ సందర్భంగా రాచకొండ సిపి శ్రీ డి ఎస్ చౌహాన్ ఐపిఎస్ అక్టోబరు 21న అంబర్‌పేట సిఎఆర్ హెడ్‌క్వార్టర్స్‌లో పోలీసు అమరవీరుల స్మారక స్థూపానికి మరియు, పోలీసు అమరవీరుల చిత్రపటాలకి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా వేలాది మంది పోలీసులు విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయారని, 21 అక్టోబర్, 1959 లడఖ్‌లోని హాట్ స్ప్రింగ్స్ వద్ద చైనా సేనల ఆకస్మిక దాడిలో ప్రాణాలు అర్పించిన పది మంది సీఆర్‌పీఎఫ్ జవాన్ల స్మారకార్థం దేశవ్యాప్తంగా పోలీసు సంస్మరణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారని గుర్తు చేశారు. ప్రతి సంవత్సరం సంస్మరణ దినోత్సవాన్ని పోలీసు పతాక దినోత్సవంగా పాటిస్తున్నామని సీపీ గుర్తు చేశారు.
దేశాన్ని శాంతియుతంగా ఉంచేందుకు వేలాది మంది పోలీసులు తమ జీవితాలను అంకితం చేశారని, ఈ ఏడాది ఆగస్టు 31వ తేదీ వరకు దేశంలో 264 మంది పోలీసులు విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేశారని, రాచకొండ కమిషనరేట్‌లో 16 మంది పోలీసులు ప్రాణాలు కోల్పోయారని గుర్తు చేశారు.
రాచకొండ పోలీసుల సంక్షేమం కోసం ప్రత్యేక వైద్య శిబిరాలు, పోలీసు సిబ్బందికి, వారి కుటుంబ సభ్యులకు ఉచిత కోవిడ్ వ్యాక్సినేషన్, కుటుంబ ఆరోగ్య పరీక్షల శిబిరాలు తదితర అనేక భద్రతా చర్యలు చేపట్టామని, రక్తదాన శిబిరాలు నిర్వహించిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా గౌరవనీయులైన తెలంగాణ గవర్నర్‌చే రాచకొండ పోలీస్ కమిషనరేట్ హయ్యస్ట్ బ్లడ్ డొనేషన్స్ అవార్డు-2022 సాధించిందని గుర్తు చేశారు.
పోలీస్ డిపార్ట్‌మెంట్‌కు మద్దతు ఇస్తున్నందుకు మరియు ట్రాఫిక్, ఇంటెలిజెన్స్, ట్రైనింగ్, ఆక్టోపస్ వంటి ప్రత్యేక విభాగాలలో పనిచేస్తున్న పోలీసులకు ప్రత్యేక అలవెన్స్‌లు అందిస్తున్నారని, రాష్ట్ర ప్రభుత్వానికి సీపీ కృతజ్ఞతలు తెలిపారు. 2023 అక్టోబరు 21 నుంచి 31 వరకు రాచకొండ కమిషనరేట్ వ్యాప్తంగా పోలీసు పతాక దినోత్సవాన్ని పురస్కరించుకుని రక్తదాన శిబిరాలు, వ్యాసరచన పోటీలు, ఆన్‌లైన్ ఓపెన్ హౌస్, ఫోటోగ్రఫీ, షార్ట్ ఫిల్మ్ పోటీలు తదితర కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఇతర పౌరులు చురుకుగా పాల్గొనాలని సీపీ సూచించారు.
ఈ కార్యక్రమానికి హాజరైన మృతి చెందిన పోలీసు సిబ్బంది కుటుంబాలకు సీపీ ప్రగాఢ సానుభూతి తెలిపారు. వారితో మమేకమై, యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. పోలీసుల అత్యున్నత త్యాగాలను ప్రజలు గుర్తించాలని, సమాజాన్ని నేరరహితంగా ఉంచేందుకు పౌరులు సహకరించాలని సీపీ కోరారు. పోలీసు అమరవీరుల స్ఫూర్తితో రాచకొండ పరిధిలోని పోలీసు సిబ్బంది శాంతి భద్రతల పరిరక్షణ కోసం అంకితభావంతో కృషి చేయాలని కమిషనర్ సూచించారు.
ఈ సమావేశంలో యాదాద్రి డీసీపీ రాజేష్ చంద్ర ఐపీఎస్, రాచకొండ ట్రాఫిక్ డిసిపి 1 అభిషేక్ మహంతి ఐపీఎస్, మల్కాజిగిరి డీసీపీ దరావత్ జానకి ఐపిఎస్, ఎస్ఓటి డిసిపి 1 గిరిధర్ ఐపీఎస్, డీసిపి సైబర్ క్రైమ్ అనురాధ ఐపీఎస్, ఎల్బి నగర్ డీసీపీ సాయి శ్రీ, ట్రాఫిక్ డీసీపీ 2 శ్రీనివాసులు, డీసీపీ క్రైమ్స్ అరవింద్, డీసీపీ రోడ్ సేఫ్టీ శ్రిబాలా, ఎస్ఓటి డిసిపి 2 మురళీధర్, అడిషనల్ డీసీపీలు, పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షులు సి.హెచ్.భద్రా రెడ్డి, కృష్ణా రెడ్డి పాల్గొన్నారు.