For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

Rachakonda News : ప్రజలు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి : కమిషనర్ తరుణ్ జోషి ఐపీఎస్

07:49 PM Apr 08, 2024 IST | Sowmya
Updated At - 07:49 PM Apr 08, 2024 IST
rachakonda news   ప్రజలు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి   కమిషనర్ తరుణ్ జోషి ఐపీఎస్
Advertisement

సైబర్ నేరాల దర్యాప్తు, నమోదు చేయవలసిన సెక్షన్లు మరియు విచారణ పద్ధతుల మీద నేరేడ్ మెట్ లోని కమిషనర్ కార్యాలయంలో రాచకొండ కమిషనరేట్ పరిధిలోని స్టేషన్ హౌస్ అధికారులు, ఆయా స్టేషన్ల సైబర్ నేరాల దర్యాఫ్తు సిబ్బందికి ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సైబర్ నేరాల నమోదులో పాటించవలసిన వివిధ సెక్షన్లకు సంబంధించిన నిబంధనల మీద సంపూర్ణ అవగాహన కల్పించడం జరిగింది.

సైబర్ సేఫ్టీ ఎకోసిస్టమ్ లో భాగంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్యూరిటీ, క్లౌడ్ సెక్యూరిటీ, డేటా సెక్యూరిటీ, నెట్వర్క్ సెక్యూరిటీ వంటి వాటి మీద అవగాహన కల్పించడం జరిగింది. మహిళలకు అంతర్జాలంలో ఎదురవుతున్న వివిధ రకాల వేదింపులు, సామాజిక మాధ్యమాలలో జరిగే మోసాల వంటి సున్నితమైన కేసుల విచారణలో తీసుకోవలసిన జాగ్రత్తల గురించి వివరించడం జరిగింది. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల డేటా చౌర్యం, లేదా ప్రజల వ్యక్తిగత మరియు సున్నితమైన డేటా చౌర్యం వంటి కేసుల నమోదు సెక్షన్లు, మరియు విచారణ పద్ధతుల గురించి వివరించారు. స్వదేశీ, విదేశీ హ్యాకర్ల సైబర్ టెర్రరిజం ద్వారా దేశ అంతర్గత భద్రతకు ఎదురవుతున్న సవాళ్ళు, దాన్ని ఎదుర్కోవాల్సిన పద్ధతులు, సైబర్ టెర్రరిజం వంటి నేరాలకు పాల్పడిన నేరస్తుల కేసుల విచారణలో అవలంబించవలసిన విధానాల మీద సంపూర్ణ అవగాహన కల్పించడం జరిగింది. డీప్ ఫేక్ వీడియోలు, బ్యాంక్ లావాదేవీల మోసాలను త్వరిత గతిన విచారణ చేయడంలో పాటించవలసిన విధానాలు మరియు సోషల్ మీడియా సంబంధిత నేరాల విచారణలో పాటించవలసిన స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ మీద సిబ్బందికి అవగాహన కల్పించడం జరిగింది.

Advertisement GKSC

ఈ కార్యక్రమంలో సీపీ శ్రీ తరుణ్ జోషి ఐపీఎస్ గారు మాట్లాడుతూ.. సైబర్ నేరాల దర్యాప్తులో ఎంతో అభివృద్ధి చెందిన యూరప్ దేశాల పోలీసు వ్యవస్థ కంటే భారతదేశ పోలీసులు ఎక్కువ సమర్థవంతంగా పని చేస్తున్నారని పేర్కొన్నారు. భవిష్యత్తులో సమాజంలో నేరాలు ప్రధానంగా అంతర్జాలం ఆధారంగానే జరుగుతాయని, వివిధ దేశాల మధ్య జరిగే యుద్ధాలు కూడా సైబర్ దాడుల ద్వారానే జరుగుతాయని పేర్కొన్నారు. సైబర్ నేరాల విచారణ వేగవంతం చేయడానికి ఉపయోగపడేలా త్వరలోనే సిబ్బందికి మరిన్ని శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. సైబర్ నేరాల దర్యాఫ్తు అధికారులు ఆఫ్లైన్ మరియు ఆన్లైన్ విధానాల ద్వారా నేషనల్ సైబర్ ఫోరెన్సిక్ లేబొరేటరీ సహాయం తీసుకోవచ్చని తెలిపారు. దేశ సైబర్ భద్రతను పెంచడానికి నేషనల్ సైబర్ సెక్యూరిటీ పాలసీ ప్రకారం చేపడుతున్న చర్యల గురించి వివరించారు. సైబర్ నేరాలను అరికట్టేందుకు మరియు దర్యాఫ్తు చేయడంలో లా ఎన్ఫోర్స్ మెంట్ ఏజెన్సీలను బలోపేతం చేయడంలో ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ పోషిస్తున్న పాత్రను గుర్తు చేశారు. నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ ద్వారా సాధారణ ప్రజలు ముఖ్యంగా మహిళలు మరియు పిల్లలు తమకు ఎదురయ్యే సైబర్ నేరాలను గురించి ఆన్లైన్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. దేశ ప్రజలకు సైబర్ భద్రతను అందించడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం గత ఏడాది తీసుకువచ్చిన డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్-2023 గురించి కమిషనర్ వివరించారు.

నేటి ఆధునిక సాంకేతిక యుగంలో వివిధ రకాల అవసరాలకు ఎన్నో రకాల సాంకేతిక పరికరాలు ఉపయోగించడం జరుగుతోందని, వాటి వల్ల పలు రకాల మార్గాలలో జరిగే నేరాల వల్ల ఎంతో మంది బాధితులు నష్టపోతున్నారని కమిషనర్ తెలిపారు. డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డుల వివరాలను సురక్షితంగా ఉంచుకునేలా, సరైన సైబర్ సెక్యూరిటీ లేని ప్రదేశాల్లో అటువంటి కార్డులు వీలైనంత వరకు ఉపయోగించకుండా తీసుకోవలసిన జాగ్రత్తల గురించి ప్రజలలో అవగాహన కల్పించేలా చర్యలు తీసుకోవాలని, ఆర్థిక సంబధిత నేరాల దర్యాప్తులో తీసుకోవలసిన చట్టపరమైన జాగ్రత్తల గురించి పూర్తిగా అవగాహన కలిగి ఉండాలని అధికారులను ఆదేశించారు. లాటరీలో డబ్బు గెలుచుకున్నారని వచ్చే మోసపూరిత, ఫోన్ కాల్స్ మరియు మెసేజ్ ల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. వీలైనంత వరకు సురక్షితం కాని పబ్లిక్ వైఫైలను ఉపయోగించి ఎటువంటి డిజిటల్ చెల్లింపులూ చేయకూడదని సూచించారు. యువత సోషల్ మీడియాలో అప్రమత్తంగా ఉండాలని, అపరిచిత వ్యక్తులతో జాగ్రత్తగా వ్యవహరించాలని కమిషనర్ సూచించారు. అంతర్జాలంలో ఎటువంటి వేధింపులు ఎదురైనా తక్షణమే పోలీసులకు సమాచారం అందించాలని, అవసరమైన పక్షంలో పోలీసులు బాధితుల వివరాలు గోప్యంగా ఉంచుతారని తెలిపారు. సైబర్ క్రైమ్ పోలీస్ టోల్ ఫ్రీ నంబర్ 1930 ను సంప్రదించడం ద్వారా సైబర్ నేరాల మీద ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు.

ఈ కార్యక్రమంలో డీసీపీ చంద్ర మోహన్ సైబర్ క్రైమ్స్, ఏసిపి వెంకటేశం, ఏసిపి నరేందర్ గౌడ్, ccrb ఏసిపి రమేష్ కుమార్, ఇన్స్పెక్టర్ ఆశిష్ రెడ్డి, అడ్వకేట్ అశ్విన్ రెడ్డి, ఇతర అధికారులు మరియు వివిధ స్టేషన్ల సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement
Author Image