నేర పరిశోధన, విచారణలో అధికారులు నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలి : సీపీ సుధీర్ బాబు ఐపీఎస్
ఈ నూతన సంవత్సరంలో రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి నేరాల శాతం తగ్గింపుకు మరియు శాంతి భద్రతల పరిరక్షణ కోసం తీసుకోవాల్సిన ప్రత్యేక చర్యలలో భాగంగా కమిషనర్ శ్రీ సుధీర్ బాబు ఐపీఎస్ గారు రాచకొండ పరిధిలోని డీసీపీలు, ఏడీసీపీలు మరియు ఇతర అన్ని స్థాయిల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా నేర పరిశోధనలో ఉపయోగిస్తున్న పలు రకాల టెక్నాలజీ పద్ధతులను మరియు క్షేత్రస్థాయి సిబ్బందికి విధి నిర్వహణ మరింత సులభతరం అయ్యేందుకు ఉపయోగపడే నూతన టెక్నాలజీ గురించి కమిషనర్ చర్చించారు. నేర పరిశోధనలో మరియు విచారణలో నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని మరియు అందుబాటులోకి వస్తున్న నూతన విచారణ విధానాలను అవలంబించాలని అధికారులకు కమిషనర్ సూచించారు.
రాచకొండ పరిధిలోని అన్ని విభాగాల పోలీసు సిబ్బంది నేర విచారణలో నూతన సాంకేతిక వినియోగం పట్ల అవగాహన పెంచుకోవాలని, అందుకోసం ఐటీ సెల్ వారి సహాయాన్ని తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిసిపి సైబర్ క్రైమ్ అరవింద్ బాబు, డిసిపి అడ్మిన్ ఇందిర, ఏసిపి సి.సి.ఆర్.బి రమేష్, ఏసిపి ఐటి సెల్ నరేందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.