నూతన సంవత్సరంలో అధికారులు మరియు సిబ్బంది నూతనోత్సాహంతో పనిచేయాలి : సీపీ సుధీర్ బాబు ఐపీఎస్
Rachakonda News : 2025 నూతన సంవత్సరం ఆరంభం సందర్భంగా నేరేడ్ మెట్ లోని రాచకొండ కమిషనరేట్ కార్యాలయంలో కమిషనర్ శ్రీ సుధీర్ బాబు ఐపీఎస్ గారి ఆధ్వర్యంలో రాచకొండ డిసిపిలు, అదనపు డీసీపీలు, ఏసీపీలు, ఇన్స్పెక్టర్లు మరియు మినిస్టీరియల్ అధికారులు, సిబ్బంది తదితరులతో నూతన సంవత్సర వేడుకలు నిర్వహించబడ్డాయి.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కమిషనర్ శ్రీ సుధీర్ బాబు ఐపీఎస్., గారు మాట్లాడుతూ... పోలీసు ఉద్యోగం అనేది ఎన్నో సవాళ్లతో కూడుకున్నదని, శాంతిభద్రతల పరిరక్షణ కోసం అహర్నిశలు కృషిచేసినప్పటికీ తగినంత గుర్తింపు లభించని సందర్భాలు కూడా ఉంటాయని, అయినా మన బాధ్యతలను అంకితభావంతో నిర్వర్తించాలని సూచించారు. అధికారులు మరియు సిబ్బంది వివిధ రకాల సమస్యలతో న్యాయం కోసం స్టేషన్ కు వచ్చే బాధితులతో సహానుభూతితో వ్యవహరించాలని, వారి సమస్యలను ఓపికగా వినాలని, స్నేహపూర్వకంగా వ్యవహరించాలని సూచించారు. ఉన్నతాధికారులు మరియు క్షేత్రస్థాయి సిబ్బంది నూతన క్రిమినల్ చట్టాలను గురించిన సంపూర్ణ పరిజ్ఞానం కలిగి ఉండాలని, నూతన చట్టాల అమలులో ఎదురవుతున్న అవరోధాలను ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు తెలియజేస్తూ ఉండాలని సూచించారు.
అన్ని విభాగాల అధికారులు మరియు సిబ్బంది సమిష్టిగా పనిచేయాలని దానితోపాటు ప్రతి ఒక్కరూ తమ వ్యక్తిగత ఉద్యోగ బాధ్యతలను మరియు ఉన్నతాధికారులు అప్పగించిన విధులను క్రమశిక్షణతో నిర్వర్తించాలని సూచించారు. అన్ని విభాగాల ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు తమ కిందిస్థాయి అధికారులు మరియు సిబ్బందికి మార్గ నిర్దేశనం చేస్తూ క్షేత్రస్థాయిలో పనిచేసే సిబ్బందికి ఎదురయ్యే సమస్యలను పరిష్కరించేలా నాయకత్వం వహించాలని కమిషనర్ సూచించారు. రాచకొండ పరిధిలోని అన్ని స్థాయిల అధికారులు మరియు సిబ్బంది సమిష్టి కృషితోనే గరిష్ట శిక్షా రేటు సాధించగలిగామని, ప్రతి సంవత్సరం నేర నిరూపణ శాతం విషయంలో రాచకొండ కమిషనరేట్ అగ్రభాగాన నిలుస్తుండడం మంచి విషయం అని పేర్కొన్నారు.
రాష్ట్రంలో త్వరలోనే స్థానిక సంస్థలకు మరియు పంచాయతీలకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇప్పటినుండే తమ పరిధిలో ఎటువంటి అవాంఛనీయ పరిస్థితులు ఎదురుకాకుండా ముందస్తు భద్రతా చర్యలు ఇతర జాగ్రత్త చర్యలు మొదలుపెట్టాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో రాచకొండ డిసిపిలు, అదనపు డీసీపీలు, ఏసీపీలు, ఇన్స్పెక్టర్లు, మినిస్టీరియల్ అధికారులు మరియు ఇతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
అంబర్ పేట పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో నూతన సంవత్సర వేడుకలు
రాచకొండ కమిషనరేట్ పరిధిలోని అంబర్ పేట ఆర్మ్డ్ హెడ్ క్వార్టర్స్ లో ఈరోజు జరిగిన నూతన సంవత్సర వేడుకలలో కమిషనర్ శ్రీ సుధీర్ బాబు గారు స్వయంగా పాల్గొని అధికారులు మరియు సిబ్బందికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా కమీషనర్ గారు మాట్లాడుతూ రాచకొండ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణలో సివిల్, ట్రాఫిక్, క్రైం వంటి ప్రధాన విభాగాలతో పాటు ఏఆర్ విభాగం కూడా ఎంతో సమర్థవంతంగా పనిచేస్తొందని పేర్కొన్నారు. ఎన్నో సమస్యాత్మక పరిస్థితుల్లో ఘర్షణల నివారణలో, పండుగల బందోబస్తు, ఎన్నికల బందోబస్తు నిర్వహణ, గణేష్ నిమజ్జనం ఊరేగింపు వంటి విధుల నిర్వహణలో ఆర్మ్డ్ రిజర్వు పోలీసుల కృషి ఎంతో ఉందని అభినందించారు. ఈ నూతన సంవత్సరంలో కూడా నిబద్ధతతో విధులు నిర్వర్తిస్తూ రాచకొండ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణలో తమ వంతు బాధ్యత నిర్వర్తించాలని కమిషనర్ సూచించారు.