Manjummel Boys : 'మంజుమ్మెల్ బాయ్స్' ఏప్రిల్ 6న ఏపీ, తెలంగాణలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్
2006లో జరిగిన ఒక యదార్థ సంఘటన నుండి స్ఫూర్తితో, కొచ్చికి చెందిన కొంతమంది స్నేహితుల కథను అద్భుతంగా చూపించిన మలయాళ సర్వైవల్ థ్రిల్లర్ 'మంజుమ్మెల్ బాయ్స్' ప్రపంచ మార్కెట్‌లో రూ. 200 కోట్లను సంపాదించిన మొదటి మలయాళ చిత్రంగా చరిత్ర సృష్టించింది. చిదంబరం ఎస్ పొదువల్ దర్శకత్వంలో సౌబిన్ షాహిర్, గణపతి, ఖలీద్ రెహమాన్, శ్రీనాథ్ భాసి ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం మలయాళీ ప్రేక్షకులని అలరించి ఘన విజయాన్ని సాధించింది. ఇతర భాషల ప్రేక్షకుల నుంచి కూడా ఈ చిత్రానికి అద్భుతమైన ఆదరణ లభించింది.
పాన్ ఇండియా ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ ఈ ఇండియన్ బాక్సాఫీస్ సెన్సేషన్‌ను తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తోంది. తెలుగు హక్కులను సొంతం చేసుకున్న మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడక్షన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఇప్పుడీ చిత్రాన్ని సమ్మర్ స్పెషల్ గా ఏప్రిల్ 6న ఏపీ, తెలంగాణలో విడుదల చేయనున్నట్లు అనౌన్స్ చేశారు.
పరవ ఫిలింస్ బ్యానర్‌పై బాబు షాహిర్, సౌబిన్ షాహిర్, షాన్ ఆంటోని ఈ చిత్రాన్ని నిర్మించారు. తెలుగు వెర్షన్‌ను నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి సమర్పిస్తున్నారు. షైజు ఖలీద్ డీవోపీ కాగా, సుశిన్ శ్యామ్ సంగీతం అందించారు. వివేక్ హర్షన్ ఎడిటర్, అజయన్ చలిసేరి ప్రొడక్షన్ డిజైనర్. 2006లో కొడైకెనాల్‌లోని గుణకేవ్‌లో చిక్కుకున్న తమ స్నేహితుడిని రక్షించిన ఎర్నాకులం మంజుమ్మెల్ యువకుల నిజమైన అనుభవం ఆధారంగా తెరకెక్కిన చిత్రం 'మంజుమ్మెల్ బాయ్స్'.
తెలుగులోనూ అదే టైటిల్‌తో 'మంజుమ్మెల్ బాయ్స్' విడుదలౌతుంది. మైత్రీ మూవీ మేకర్స్ తెలుగు వెర్షన్‌కు బ్యాకింగ్ ఇవ్వడంతో తెలుగులో చాలా గ్రాండ్ రిలీజ్ అవుతుంది.