For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

నాన్న అడుగుజాడల్లోనే నా పయనం: మంత్రి కేటీఆర్ స్పెషల్ ఇంటర్వ్యూ

03:49 PM May 11, 2024 IST | Sowmya
Updated At - 03:49 PM May 11, 2024 IST
నాన్న అడుగుజాడల్లోనే నా పయనం  మంత్రి కేటీఆర్ స్పెషల్ ఇంటర్వ్యూ
Advertisement

ఆయన పొలిటికల్‌ పంచ్‌ విసిరితే అవతలి వ్యక్తి దగ్గర సమాధానం ఉండదు. పబ్లిక్‌ మీటింగ్‌లో పక్కాగా ప్రసంగిస్తారు. పారిశ్రామికవేత్తలను పలకరిస్తే చాలు రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువలా వచ్చేస్తాయి. ఐటీ మేధావులతో మేటిగా మాట్లాడగలరు. రాజకీయ ప్రత్యర్థులకు దీటుగా బదులివ్వగలరు. అభివృద్ధే తారక మంత్రంగా తెలంగాణ పురోగతిలో కీలకంగా వ్యవహరిస్తున్నారు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె. తారకరామారావు. విజన్‌ ఉన్న మన నేత పుట్టినరోజు నేడు. ఇటీవల ‘హానెస్టీ బై తన్మయ్‌ భట్‌’ కార్యక్రమంలో కేటీఆర్‌తో పాడ్‌కాస్టర్‌, యూట్యూబర్‌ తన్మయ్‌ భట్‌ ముఖాముఖి నిర్వహించారు. ఆ ఇంటర్వ్యూకి తెలుగు రూపం..

నాన్న అడుగుజాడల్లోనే నా పయనం...
★ ఇప్పుడు నేను ఇంటర్వ్యూ చేస్తున్న వ్యక్తి ‘సర్‌’ అని పిలవడానికి ఒప్పుకోరు, అందుకే రామ్‌ అని సంబోధిస్తాను..

Advertisement GKSC

తప్పకుండా. నాకింకా నైట్‌హుడ్‌ (నైట్‌హుడ్‌ వచ్చిన వారిని ‘సర్‌’ అని సంబోధిస్తారు) రాలేదుగా (నవ్వుతూ..)

★ మీరెప్పుడైనా ఎలిజబెత్‌ రాణిని కలిశారా ?

ఇప్పటి వరకైతే లేదు. భవిష్యత్తులో కలుస్తానేమో! నెట్‌ఫ్లిక్స్‌లో వచ్చే ‘ద క్రౌన్‌’ టీవీ సిరీస్‌కు మా అబ్బాయి వీరాభిమాని. అందుకే, నా లండన్‌ పర్యటన తర్వాత ‘క్వీన్‌ని కలవకుండా వచ్చావేం?’ అని అడిగాడు. ‘ప్రిన్స్‌నే కలవలేకపోయాను క్వీన్‌నేం కలుస్తాన’ని బదులిచ్చా.

★ మీ అబ్బాయి ముందు ఏమైనా గొప్పలకు పోతారా ?

వాడు నాకు ఆ అవకాశమే ఇవ్వడు. నేను బయటే మంత్రిని. ఇంట్లో మామూలు తండ్రినే! పెత్తనమంతా పిల్లలదే! టీవీ రిమోట్‌ వాళ్ల కంట్రోల్‌లోనే ఉంటుంది.

★ పిల్లలు మీతో ఏమైనా పరాచకాలు ఆడతారా ?

చాలా విషయాల్లో నన్ను ఆటపట్టిస్తుంటారు. సరదాగా వాళ్లతో మాట్లాడేటప్పుడు ఈ జెనరేషన్‌కు సంబంధించిన కొత్త పదాలు ఏవైనా ప్రయోగిస్తే.. నా వంక వింతగా చూస్తారు. ‘నీకు ఇవన్నీ అవసరమా?’ అన్నట్టుగా గేలి చేస్తారు (నవ్వులు). వాళ్ల స్పీడ్‌తో పోలిస్తే నేనో పదేండ్ల కిందటే ఉండిపోయానేమో అనిపిస్తుంటుంది.

★ ఇంతకీ మీ పిల్లలు బుద్ధిమంతులేనా ?

ఇలాంటి ఇంటర్వ్యూల్లో ‘అవును’ అని చెప్పక తప్పదు.

★ వాళ్ల బాల్యం సహజంగానే గడుస్తున్నదని అనిపిస్తున్నదా ?

మేము ప్రజా జీవితంలో ఉండటం ఒకరకంగా మా పిల్లల స్వేచ్ఛకు భంగమే! అందరి పిల్లల్లా ఎక్కడికీ స్వతంత్రంగా వెళ్లలేరు. షాపింగ్‌లూ చేయలేరు. అందుకే, విదేశాలకు వెళ్లి చదువుకోమని చెబుతుంటా. అక్కడైతే వాళ్ల స్వేచ్ఛకు ఎలాంటి అడ్డంకులూ ఉండవు. మా అబ్బాయి అండర్‌ గ్రాడ్యుయేషన్‌ కోసం విదేశాలకు వెళ్లాలనుకుంటున్నాడు. అమ్మాయి చిన్నదే కాబట్టి, చూద్దాం!!

★ ఎప్పుడైనా పేరెంట్‌ టీచర్‌ మీటింగ్‌కు హాజరయ్యారా ?

కొన్నేండ్ల కిందటివరకూ అడపాదడపా వెళ్తుండేవాణ్ని. ఈ మధ్య కుదరడం లేదు.

★ టీచర్లు మీ పిల్లల గురించి సరైన ఫీడ్‌బ్యాక్‌ ఇస్తుంటారా ?

ఆ విషయంలో నన్ను కేవలం పేరెంట్‌గానే చూడమని చెబుతాను. మంత్రిగా ట్రీట్‌ చేయొద్దంటాను.

★ సాధారణంగా రాజకీయ నాయకుణ్ని కలిసే వ్యక్తులు ఎక్కడలేని మంచితనాన్ని ప్రదర్శిస్తుంటారు. మిమ్మల్ని కలిసే వ్యక్తుల్లో ఎందరు నిజాయతీగా ఉంటారనిపిస్తుంది ?

అలాంటి వాళ్లు చాలామందే కనిపిస్తారు. నాయకుడు మాట్లాడినా, కూర్చున్నా, తుమ్మినా సూపర్‌స్టార్‌లా భావించే అభిమానులూ ఉంటారు. అయితే, అదంతా ఆ పదవి వల్ల వచ్చేదే! ఈ స్థానంలో ఎవరున్నా, వారికీ అలాంటి గౌరవమే లభిస్తుంది. ఇక వ్యక్తిగతంగా అభిమానించే వాళ్లూ ఉంటారు, విమర్శించే వాళ్లూ ఉంటారు. నా వరకైతే ఎక్కువగా సామాజిక మాధ్యమాల్లో ఫీడ్‌బ్యాక్‌ గమనిస్తూ ఉంటాను. గ్రౌండ్‌ రియాలిటీ తెలుసుకుంటా. సోషల్‌ మీడియాలో ప్రశంసలే కాదు, విమర్శలూ వస్తుంటాయి. సామాజిక మాధ్యమం రెండువైపులా పదునున్న కత్తిలాంటిది. ప్రజాప్రతినిధిగా రెండిటినీ స్వీకరించాల్సిందే!

★ హైదరాబాద్‌లో బెస్ట్‌ బిర్యానీ అంటే ఏదని చెబుతారు ?

హ్‌మ్‌..! చాలా కష్టమైన ప్రశ్న ఇది. బిర్యానీ అంటేనే హైదరాబాద్‌. అందులో ఏది గొప్ప అని అడిగితే ఎలా చెప్పగలం బ్రదర్‌. నేను చెప్పే సమాధానం రాజకీయ విమర్శలకూ దారితీయొచ్చు (నవ్వులు). అయితే, రుచి అనేది ఆ రోజు మన మూడ్‌ను బట్టి ఉంటుంది. హైదరాబాద్‌లో ఎక్కడికి వెళ్లినా అద్భుతమైన బిర్యానీ రుచి చూడొచ్చు.

★ ఇంతకీ మీరు ఎలాంటి పొలిటీషియన్‌ ?

రాజకీయం అనే పదమే తప్పు అన్నట్టుగా మాట్లాడతారే ?

★ కొందరు అలా మార్చేశారు కదా ?

హ్‌మ్‌..! ఎవరైనా ‘పొలిటీషియన్‌’ అని ట్వీట్‌ చేస్తే, పొగుడుతున్నారో, విమర్శిస్తున్నారో అర్థం కావడం లేదు.

★ నేను మిమ్మల్ని పొలిటీషియన్‌గా చూడను! ఒక సీఈవో, ఫౌండర్‌ అని పిలుస్తాను.

ఇది కూడా విమర్శలానే ఉంది. కానీ, ఓకే !

★ తెలంగాణ ఏర్పడి ఎమినిదేండ్లు అయింది కదా! రాష్ట్రం సాధించిన పురోగతిపై మీరు సంతృప్తిగా ఉన్నారా ?

75ఏండ్ల స్వతంత్ర దేశ చరిత్రలో తెలంగాణ రాష్ట్రం విజయవంతమైన స్టార్టప్‌ అని గర్వంగా చెప్పగలను. అతి తక్కువ వ్యవధిలో తెలంగాణ ఈ ఘనత సాధించింది. 2014లోతెలంగాణ తలసరి ఆదాయం రూ.1,24,000. ఇప్పుడు రూ.2,78,000. అప్పట్లో రాష్ట్ర జీఎస్‌డీపీ రూ. 5.06 లక్షల కోట్లు, ఇప్పుడు రూ. 11.55 లక్షల కోట్లు. అప్పుడు ఐటీ ఎగుమతులు రూ. 57వేల కోట్లు. ప్రస్తుతం రూ. 1.83 లక్షల కోట్లు. రాష్ట్రంలో సాగు విస్తీర్ణం 119 శాతం పెరిగింది. తలసరి విద్యుత్‌ వినియోగంలో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. అటవీ విస్తీర్ణం కూడా 7.7 శాతం పెరిగింది. సంక్షేమం-అభివృద్ధి, ఐటీ-వ్యవసాయం, పరిశ్రమలు-పర్యావరణం ఇలా అన్ని రంగాల్లో సంతులిత వృద్ధి కొనసాగుతున్నది.

★ పరిపాలనలో మీరు కొత్త ఒరవడి సృష్టిస్తున్నారు. అయితే, సంప్రదాయ పాలకులు విప్లవాత్మకమైన మార్పులను అంతగా ఆదరించరు కదా !

మీ మాటను కొంతవరకు అంగీకరిస్తాను. కానీ, మీరు కెమెరాతో తెలంగాణలో పర్యటించండి. నిజానిజాలు తెలుసుకోండి. లోకానికి తెలియ జేయండి. ప్రపంచంలో అతిపెద్ద లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్ట్‌ ‘కాళేశ్వరం’ నిజమో, కాదో ప్రజలకు తెలపండి. ప్రపంచంలోనే అతిపెద్ద ఇంక్యుబేటర్‌ టీ-హబ్‌. ఇది అవునో, కాదో లోకం ముందు ఉంచండి. మా రాష్ట్రం పర్‌క్యాపిటా(తలసరి ఆదాయం), జీఎస్‌డీపీ రెట్టింపు అయ్యాయో లేదో తెలుసుకొని మీరే జనానికి చెప్పండి. భారతదేశానికి ఆర్థికంగా చేయూతనిస్తున్న రాష్ర్టాల్లో తెలంగాణది నాలుగో స్థానం.
ఈ నిజాన్ని వెలికితీయడానికి మీరు పెద్దగా కష్టపడాల్సిన పనీ లేదు. ఆర్బీఐ రిపోర్ట్‌ చూస్తే మీకే తెలిసిపోతుంది.

★ ప్రజలు వారి అవసరాలకు సరిపడా సంపాదిస్తున్నప్పుడు మిగతా విషయాల గురించి పట్టించుకోరు కదా !

ఎంతమంది సంపన్నులు ఉన్నారు. ఇద్దరో, నలుగురో బిలియనీర్లు అయిపోతే సరిపోతుందా! అత్యంత ధనికుల జాబితాలో ఐదోస్థానం, ఆరోస్థానంలో వీళ్లు ఉంటే అది దేశాభివృద్ధా? వాళ్లు దేశానికి, దేశ ఆర్థిక పురోగతికి ప్రతినిధులు ఎలా అవుతారు? ప్రస్తుతం దేశంలో నిరుద్యోగిత రేటు గడిచిన 40 ఏండ్లలో ఎప్పుడూ లేనంతగా ఎక్కువగా ఉంది.

★ ద్రవ్యోల్బణం 30 ఏండ్లలో ఎన్నడూ లేనంతగా పెరిగిపోయింది. ఇంకేం మాట్లాడుకోవాలి? ఆర్థిక విధానాల గురించి ఏమని చెప్పుకోవాలి ?

ఈ మధ్య తెలంగాణ మోడల్‌ అని వినిపిస్తున్నది. గతంలోనూ రాష్ట్ర మోడల్‌ అని చెప్పి ఒకరు ప్రధాని అయ్యారు! హా! గోల్‌మాల్‌ గుజరాత్‌ మోడల్‌ అని ఊదరగొట్టి ప్రధాని అయ్యారు. ఇప్పుడు గుజరాత్‌లో చూస్తే కరెంట్‌ కోతలు కనిపిస్తున్నాయి. కొన్నిచోట్ల తాగేందుకు నీరు కూడా లేదు.

★ ఇది కట్‌ చేసేద్దాం! (నవ్వుతూ..)

భయమెందుకు? నేనే కదా అంటున్నది. మీరేం అనడం లేదు కదా! ఈ మాటలన్నీ అన్నది నేనే! ఏదైనా కేసు పెడితే, నాపై పెట్టండి.

★ నాలుగు నెలల కిందట బెంగళూరుకు షిఫ్ట్‌ అయ్యాను. నేను హైదరాబాద్‌కు ఎందుకు రావాలో చెప్పండి ?

గ్లోబల్‌ ఏజెన్సీ మెర్సర్‌ సర్వే ప్రకారం ఐదేండ్లుగా (2015-20) దేశంలో నివాసయోగ్యమైన నగరాల్లో హైదరాబాద్‌ టాప్‌లో నిలిచింది.

★ మరి బెంగళూరు ప్లేస్‌ ఏంటి ?

నేను చెప్పడం ఎందుకు? మా పోటీ బెంగళూరుతో కాదు. ఒక పారిశ్రామికవేత్త ఇండియాలో ఇన్వెస్ట్‌ చేయాలి అనుకున్నప్పుడు, ఇక్కడ ఏ ప్రాంతంలో పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తాడు. వారి విజయం వాళ్లు ఎంచుకునే గేట్‌ వే మీద ఆధారపడి ఉంటుంది. ఉత్తర్‌ప్రదేశ్‌ నుంచి చూస్తే ఒకరకమైన ఇండియా కనిపిస్తుంది. హైదరాబాద్‌ గేట్‌ వే నుంచి వెళ్తే వినూత్నమైన భారత్‌ కనిపిస్తుంది. ఎక్కడినుంచి ప్రవేశించాలో ఇన్వెస్టర్లు పరిశీలించి నిర్ణయం తీసుకోవాలి. ఇండియా అంటే దేశంగా ఒకటే! కానీ, ఇక్కడ అనేక రాష్ట్రాలు ఉన్నాయి. ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధమైన పరిస్థితులు ఉన్నాయి. అందుకే, సరైన గేట్‌వే ఎంచుకోవాలి. ఒక్క మాటలో చెప్పాలంటే హైద రాబాద్‌ ‘గ్రేట్‌ వే ఆఫ్‌ ఇండియా’ అని నమ్మకంగా చెప్పగలను.

★ హైదరాబాద్‌ ప్రత్యేకతలు ఏం చెబుతారు ?

ఏ రంగంలో చూసుకున్నా హైదరాబాద్‌ ప్రత్యేకమైనదే! లైఫ్‌ సైన్సెస్‌ రంగంలో చూసుకుంటే, ప్రపంచవ్యాప్తంగా మూడింట ఒక వంతు వ్యాక్సిన్లు ఉత్పత్తి అయ్యేది హైదరాబాద్‌లోనే. భారతదేశ ఔషధ సంస్థల్లో 40 శాతం హైదరాబాద్‌లోనే ఉన్నాయి. ఎన్నో ప్రత్యేకతల సమాహారం హైదరాబాద్‌. ఇక్కడ భాషా భేదాలు కనిపించవు. ఉత్తరాది, దక్షిణాది కలగలసిన నగరం ఇది. ఇక్కడ బిర్యానీ.. పరాఠాతో దోస్తీ చేస్తుంది. జీవశాస్త్రం.. సాంకేతికతతో జట్టుకట్టింది. ఈ నగరానికి ఎవరు వచ్చినా ఒంటరి అన్న భావన కలుగదు. భాష, కట్టూబొట్టూ ఆధారంగా మనుషులను వేరు చేసే పరిస్థితులూ ఇక్కడ కనిపించవు. మతసామరస్యంతో విలసిల్లుతున్న నగరం ఇది. విశాల దృక్పథంతో సాంకేతికంగా పురోగమిస్తున్న గ్లోబల్‌ సిటీ హైదరాబాద్‌. బెంగళూరు కన్నా బెటర్‌ సిటీ అని చెప్పగలను. ముఖ్యంగా ఇక్కడ ప్రగతిశీల ప్రభుత్వం ఉంది.

★ మీ నాన్నతో అనుబంధం ఎలా ఉంటుంది? ఎప్పుడైనా ఆయన అభిప్రాయంతో విభేదించారా ?

ఆయన నాకు తండ్రి మాత్రమే కాదు. మా బాస్‌ కూడా! మీరు మీ బాస్‌తో విభేదిస్తారా ?

★ హా! చాలా మర్యాదగా నా అభిప్రాయం చెబుతాను.
నేనూ అంతే! అవసరమైతే విభేదిస్తాను. చాలా హుందాగా నా అభిప్రాయం చెబుతాను. నాకూ, మా అబ్బాయికీ చాలా విషయాల్లో భిన్నాభిప్రాయాలు ఉంటాయి. అలాగే మా నాన్నతో నాకూ ఉంటాయి. ఆయన సుదీర్ఘ అనుభ వజ్ఞుడు. ప్రపంచాన్ని చదివిన దార్శనికుడు. ఆయన దృష్టికోణం గొప్పగా ఉంటుంది. నా పరిధిలో నాకు కొన్ని అభిప్రాయాలు ఉంటాయి. కొన్నిసార్లు రెండూ ఒకటి అవ్వాల్సిన పనిలేదు. అప్పుడు నా అభిప్రాయం తప్పకుండా చెబుతాను. అయితే, అంతిమంగా ఆయన సరైన నిర్ణయం తీసుకుంటారు. దానికి కట్టుబడి ఉంటాను.

★ మిమ్మల్ని ‘తండ్రికి తగ్గ తనయుడు’ అని అంటుంటారు కదా! ఆయన నుంచి పొందిన లక్షణాలు ఏంటి ?

ఆయనతో పోల్చుకునే ధైర్యం నాకు లేదు. స్వయంకృషితో ఎదిగిన వ్యక్తి ఆయన. పార్టీ నిర్మాణం కావచ్చు, తెలంగాణ ఉద్యమం కావచ్చు, తెలంగాణ సాధన కావచ్చు… అన్నీ ఆయన స్వయంగా సాధించినవి. ఆయన కారణంగానే నేనూ ఈ స్థాయిలో ఉన్నానని భావిస్తాను. ఆయన అడుగుజాడల్లో నడుస్తున్నాను.

★ ఆంత్రప్రెన్యూర్స్‌కి మీరు ఇచ్చే సలహా ఏంటి ?

అందుబాటులో ఉన్న కొత్త అవకాశాలను అందిపుచ్చుకున్నప్పుడే విజయం వరిస్తుంది. ఆంత్రప్రెన్యూర్లు మాత్రమే కాదు, ప్రభుత్వం కూడా అధునాతన సాంకేతిక వ్యవస్థలను ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇన్వెస్టర్లకు మంచి అవకాశాలు, సదుపాయాలు కల్పిస్తున్నాం. ఆంత్రప్రెన్యూర్లు సరైన ప్రభుత్వాన్ని భాగస్వామిగా ఎంచుకోగలిగితే విజయం సులభం అవుతుంది.

★ టీ హబ్‌ 2.0 ప్రత్యేకతలు ఏంటి ?

టీ-హబ్‌ తెలంగాణ అభివృద్ధికి ప్రతీక. 18 ఎకరాల సువిశాల ప్రాంగణంలో నిర్మించిన ప్రపంచంలోనే అతిపెద్ద ఇంక్యుబేటర్‌ ఇది. మొత్తం 5.80 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఒకే రూఫ్‌ కింద రెండు వేలకు పైగా స్టార్టప్‌లు పనిచేయొచ్చు. ఇన్నొవేట్‌, ఇంక్యుబేట్‌, ఇన్‌కార్పొరేట్‌ మా మంత్రం. ఈ క్యాంపస్‌లో టీ-హబ్‌ ఒక భాగం. భారతదేశంలోనే అతిపెద్ద ప్రొటోటైపింగ్‌ సదుపాయం కలిగిన టీ-వర్క్స్‌ పక్కనే ఏర్పాటవుతున్నది. ఈ ఆగస్టులో ప్రారంభం కానుంది. మరోపక్క ఇమేజ్‌ టవర్‌ నిర్మాణం కొనసాగుతున్నది. యానిమేషన్‌, మల్టీమీడియా, గేమింగ్‌, ఎంటర్‌టెయిన్మెంట్‌కు ఇది వేదికగా నిలవనుంది. వచ్చే ఏడాది అందుబాటులోకి వస్తుంది.

★ సింగిల్‌ స్టాప్‌ టీ-హబ్‌

అమెరికా, యూకే లాంటి దేశాల్లో పరిశోధనల కోసం విశ్వవిద్యాలయాలు నిధులు సమకూరుస్తుంటాయి. వాటివల్ల చాలామంది ఆంత్రప్రెన్యూర్లు తయారవుతారు. మనదేశంలో ప్రభుత్వం దగ్గర నిధులు సమృద్ధిగా ఉండవు. యూనివర్సిటీ ఫండింగ్‌, రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌కు నిధులు కేటాయించడం లాంటివీ జరగవు. ఫలితంగా యూనివర్సిటీల నుంచి ఇన్నొవేటర్లూ తక్కువగానే వస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం టీ-హబ్‌ను యూనిక్‌ సింగిల్‌ స్టాప్‌గా తీర్చిదిద్దుతున్నది. ఏ భారతీయుడైనా ఇక్కడికి వచ్చి తన ఆలోచనలకు కార్యరూపం ఇవ్వొచ్చు. సక్సెస్‌ఫుల్‌ ఆంత్రప్రెన్యూర్‌గా నిరూపించుకోవచ్చు.

★ పదవులు అశాశ్వతం

ఈ పదవులు, రాజకీయాలు తాత్కాలికమైనవే! వీటిని మనసుకు ఎక్కువగా తీసుకుంటే.. వ్యక్తిగత జీవితంలో ఇబ్బందులు తప్పవు. అందుకే, వేటి ప్రాధాన్యం వాటికిస్తాను. ఏ విషయాన్నయినా మరీ సీరియస్‌గా తీసుకుంటే.. సమస్యలు తప్పవు. ఈ భూమ్మీదికి ఏ మనిషీ రెండువందలు, మూడువందల ఏండ్లు జీవించడానికి రాలేదు. ఇక అధికారంలో ఐదు, పదేండ్లు, ఓ ఇరవై ఏండ్లు ఉండగలుగుతాం. ఉన్నంతకాలం ప్రజలకు ఎలా ఉపయోగపడ్డాం అన్నది ముఖ్యం.

★ అన్నింటా తెలంగాణ ప్రత్యేకం

ఈ రోజు తెలంగాణ అన్ని రంగాల్లోనూ తనదైన ముద్ర వేస్తున్నది. గూగుల్‌కు వెళ్లి ‘ప్రపంచంలో అతిపెద్ద లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్ట్‌ ఏది’ అని సెర్చ్‌ చేయండి. ‘కాళేశ్వరం ప్రాజెక్ట్‌ ఇన్‌ తెలంగాణ’ అని సమాధానం వస్తుంది. దీనిని మేం నాలుగేండ్లలోనే పూర్తి చేశాం. అలాగే ‘వరల్డ్‌ లార్జెస్ట్‌ ఇంక్యుబేటర్‌ ఏది?’ అని సెర్చ్‌ చేయండి. ‘టీ-హబ్‌’ అని సమాధానం వస్తుంది. ఇరిగేషన్‌, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ రెండిటినీ సమంగా అభివృద్ధి చేశాం. అలాగే అన్ని రంగాల్లోనూ ఇదే తరహా సంతులిత వృద్ధి కనిపిస్తుంది.

★ ప్రజల కోసమే అధికారం

రాజకీయాలు ఎన్నికల వరకే పరిమితం. అధికారంలోకి వచ్చాక రాజకీయాలతో పని లేదు. అభివృద్ధి, ప్రజా సంక్షేమమే పరమావధిగా భావించాలి. 1987లో భారత్‌, చైనా ఆర్థిక వ్యవస్థల సైజ్‌ 470 బిలియన్‌ డాలర్లు. 35 ఏండ్ల తర్వాత ఇప్పుడు చూస్తే చైనా ఆర్థిక వ్యవస్థ పరిమాణం 16 ట్రిలియన్‌ డాలర్లకు చేరుకుంది. మనం ఇంకా 5 ట్రిలియన్‌ డాలర్లకు ఎప్పుడు చేరుకుంటామా అని ఎదురుచూస్తున్నాం. మనం ఎక్కడ ఆగిపోయాం? మనం ఇంకా.. ‘ఎవరేం దుస్తులు ధరిస్తున్నారు, ఏం తింటున్నారు, ఏం తాగుతున్నారు’ అని ఆలోచిస్తున్నాం. అందరినీ అనుమాన దృష్టితో చూడటం, హలాల్‌, హిజాబ్‌ ఇలా సంకుచితంగా వ్యవహరిస్తున్నాం. మన దేశంలో 50 శాతం జనాభా సగటు వయసు 27 ఏండ్లు. జనాభాలో 60 శాతం వయసు 35 ఏండ్లు. మనది యువభారతం. ఎవరు పాలిస్తున్నారన్నది ముఖ్యం కాదు. ఈ మానవ వనరులను సద్వినియోగం చేసుకోగలిగితే దేశం పురోగమిస్తుంది. ఎన్నికలప్పుడు ఓ ఆరు నెలలు రాజకీయాలు చేయడం ఓకే, కానీ, మిగతా నాలుగున్నరేండ్లు ఆర్థికాభివృద్ధి, ఉపాధి కల్పన, ఉద్యోగ నియామకాలు వంటి వాటిపై దృష్టి సారించాలి.

★ అభివృద్ధిలో భాగస్వాములు

ఎనిమిదేండ్ల కిందట ఒకసారి ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు విమానంలో వస్తున్నాం. ఫ్లయిట్‌లో అమెజాన్‌ ప్రతినిధులు కలిశారు. ‘కర్ణాటకలో ఇన్వెస్ట్‌ చేద్దాం అనుకున్నాం. కానీ, అక్కడి ఆర్థికశాఖతో కొన్ని చికాకులు కలుగుతున్నాయి. వాళ్లు అర్థం చేసుకోవడంలేద’ని చెప్పుకొచ్చారు. ఒకసారి హైదరాబాద్‌కు రండి. మనం మాట్లాడదాం అని చెప్పా. వారం తర్వాత చర్చలు మొదలయ్యాయి. వాళ్లు హైదరాబాద్‌లో ఫుల్‌ఫిల్‌మెంట్‌ సెంటర్‌ స్థాపించడానికి ముందుకొచ్చారు. ఇప్పుడు ఆసియాలోనే అతిపెద్ద అమెజాన్‌ ఫుల్‌ఫిల్‌మెంట్‌ సెంటర్‌కు హైదరాబాద్‌ వేదికైంది. అంతేకాదు, ప్రపంచంలోనే అతిపెద్ద అమెజాన్‌ క్యాంపస్‌ ఇక్కడే ఉంది. ప్రపంచంలోనే అతిపెద్ద డాటా సెంటర్‌కు కూడా హైదరాబాద్‌ వేదికవుతున్నది. వ్యాపారులను కేవలం పెట్టుబడిదారులుగా కాదు, రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములుగా భావించి వారికి అవకాశాలు కల్పిస్తున్నాం. ఫలితంగానే ప్రపంచంలోని బడాబడా వ్యాపార సంస్థలన్నీ హైదరాబాద్‌లో ఇన్వెస్ట్‌ చేయడానికి ఆసక్తి చూపుతున్నాయి.

My journey is in my father's footsteps,Minister KTR Birthday Special Interview,CM KCR,Honesty by Tanmay Bhatt Progrramme,telugu golden tv,my mix entertainements,V9 Newstelugu,www.teluguworldnow.com

★ కేటీఆర్ గారి ఇంటర్వ్యూ పై సోషల్‌ రెస్పాన్స్‌
ఆద్యంతం ఉల్లాసభరితంగా సాగిన ఇంటర్వ్యూను క్షణం వదలకుండా చూశాను. తెలంగాణ అభివృద్ధి కోసం కేటీఆర్‌ ఎంతలా పరితపిస్తున్నారో ఈ ఇంటర్వ్యూ చూస్తే అర్థమవుతుంది. ఆయన నిబద్ధత, దార్శనికత కలిగిన రాజకీయనేత అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
-భార్గవ్‌

ప్రతి రాష్ర్టానికి ఒక్కో కేటీఆర్‌ ఉంటే, ఈ దేశం పరిస్థితి ఊహించనంత ఉన్నతంగా ఉంటుంది. హైదరాబాద్‌ అభివృద్ధికి, తెలంగాణ పురోగతికి ఆయన చేస్తున్న నిర్విరామ కృషి అభినందనీయం.
-శాయర్‌

నేను బెంగళూరియన్‌ అని చెప్పుకోవడానికి గర్విస్తాను. తొమ్మిదేండ్ల నుంచి హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తున్నా. హైదరాబాద్‌ అభివృద్ధిలో కేటీఆర్‌ చొరవ ప్రశంసనీయం. ఇప్పుడు నేను హైదరాబాదీ అని నిర్మొహమాటంగా చెబుతాను.
-శ్రీహర్ష

థ్యాంక్యూ తన్మయ్‌. ఈ ఇంటర్వ్యూ కేటీఆర్‌లోని మరో కోణాన్ని చూపింది. బహిరంగ సభల్లో పక్కా పొలిటికల్‌ మార్క్‌ కనిపిస్తే, ఈ ముఖాముఖితో ఆయనలోని సెన్స్‌ ఆఫ్‌ హ్యూమర్‌ తెలిసింది. ఆయన ఆంగ్లభాషా పరిజ్ఞానానికి సాహో!
-వైభవ్‌

మాది మైసూర్‌. ఐటీలో బెంగళూరు, హైదరాబాద్‌ రెండూ మేటి నగరాలే! కానీ, హైదరాబాద్‌లో ఉన్నంత మత సామరస్యం ఈ మధ్య బెంగళూరులో కొరవడుతున్నది. తెలంగాణను చూసి కర్ణాటక రాజకీయాలు కొంతయినా మారాల్సి ఉంది.
-గిరీశ్

Advertisement
Author Image