For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

తెలంగాణ శాసన సభా ప్రాంగణంలో 'మాహాత్మా జ్యోతీరావు ఫూలే' విగ్రహాన్ని ఏర్పాటు చేయండి : కల్వకుంట్ల కవిత, MLC

12:26 PM Jan 21, 2024 IST | Sowmya
Updated At - 12:26 PM Jan 21, 2024 IST
తెలంగాణ శాసన సభా ప్రాంగణంలో  మాహాత్మా జ్యోతీరావు ఫూలే  విగ్రహాన్ని ఏర్పాటు చేయండి   కల్వకుంట్ల కవిత  mlc
Advertisement

మాన్య శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్, సభాపతి, తెలంగాణ శాసన సభ, గారికి 

విషయం : ఆధునిక భారత వైతాళికులు "మాహాత్మా జ్యోతీరావు ఫూలే" విగ్రహాన్ని తెలంగాణ శాసన సభా ప్రాంగణంలో ఏర్పాటు చేయుట గురించి. 

Advertisement GKSC

ఆధునిక భారతదేశంలో పునరుజ్జీవన ఉద్యమ పితామహుడిగా మహాత్మా జ్యోతీరావు ఫూలే కృషి చిరస్మరణీయం. అణగారిన వర్గాల పట్ల, మహిళల పట్ల వివక్షకు చరమగీతం పాడుతూ ఈ దేశంలో సామాజిక సమానత్వానికి బాటలు వేసిన ఆద్యులు వారు. సంఘాన్ని సంస్కరిస్తూనే వివక్షకు గురైన వర్గాల గుడిసెలో అక్షర దీపం వెలిగించిన కాంతిరేఖ ఫూలే. మహోన్నతమైన ఈ వ్యక్తిత్వం తనను ఎంతగానో ప్రభావితం చేసిందని, ఫూలేను తన గురువుగా ప్రకటించుకున్నారు రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్. ఉన్నతమైన, ఉదాత్తమైన ప్రజాస్వామిక భావనలు చట్టసభలలో నిరంతరం ప్రతిఫలించాలనే ఉద్దేశ్యంతో మహనీయుల విగ్రహాలను ఆ ప్రాంగణంలో నెలకొల్పడం గొప్ప ఆదర్శం. గతంలో భారత జాగృతి నేతృత్వంలో జరిగిన ఉద్యమంతో ఉమ్మడి రాష్ట్రంలోనే అసెంబ్లీ ప్రాంగణంలో డా. అంబేద్కర్ విగ్రహ ఏర్పాటు జరిగింది. ఇది మనందరికీ గర్వ కారణం.

అదే కోవలోనే సమానత్వ స్ఫూర్తిని అనునిత్యం చట్టసభల స్మృతిపథంలో నిలిపే సదుద్దేశంతో మహాత్మా జ్యోతీరావు ఫూలే విగ్రహ ఏర్పాటు కూడా తెలంగాణ అసెంబ్లీలో జరగడం అవసరం. ఇది భారత జాగృతి సహా వివిధ సామాజిక సంస్థల, బీసీ సంఘాల చిరకాల కోరిక. తెలంగాణ స్వరాష్ట్రమై సుందర భవిశ్యత్తుకు బంగారు బాటలు వేసుకుంటున్న సమయంలో సమానత్వ స్ఫూర్తి పతాక "మహాత్మా జ్యోతీరావు ఫూలే" విగ్రహ ఏర్పాటు ప్రజాస్వామ్య స్ఫూర్తిని మరింత ఇనుమడింప జేయగలదు. కావున వెనుకబడిన వర్గాల నుండి ఎదిగిన బిడ్డగా తమరి ఆధ్వర్యంలోనే ఈ మహత్కార్యం జరగాలని అకాంక్షిస్తున్నాను. అందుకై అవసరమైన చర్యలు తీసుకోవలసిందిగా తమరిని సవినయంగా కోరుతున్నాను.

తెలంగాణ రాష్ట్రంలో సమానత్వ సౌభ్రాతృత్వాలు వెల్లి విరియాలని, ప్రజాస్వామిక భావనలు వికసించాలని మనస్ఫూర్తిగా అభిలషిస్తూ సెలవు తీసుకుంటున్నాను. కృతజ్ఞతాభినందనలు.

కల్వకుంట్ల కవిత, MLC
అధ్యక్షురాలు, భారత జాగృతి. తేది: 21-01-2024

Advertisement
Author Image