Telangana Political News: వచ్చే నెలలోనే హెల్త్ ప్రొఫైల్: మంత్రి హరీశ్‌రావు
వచ్చే నెల మొదటివారంలో హెల్త్ ప్రొఫైల్ కార్యక్రమాన్ని ములుగు, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో ప్రయోగాత్మకంగా చేపట్టనున్నట్టు వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు. ఆ రెండు జిల్లాల్లో ప్రజారోగ్యశాఖ డైరెక్టర్ జీ శ్రీనివాసరావు, సీఎంఓఎస్డీ గంగాధర్, కుటుంబసంక్షేమశాఖ కమిషనర్ వాకాటి కరుణతో కూడిన కమిటీ పర్యటించి, ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. సోమవారం ఆయన బీఆర్కే భవన్‌లో వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. తెలంగాణ హెల్త్ ప్రొఫైల్‌లో ప్రస్తుతం ఎనిమిది టెస్ట్‌లు చేస్తున్నారని, తెలంగాణ డయాగ్నోస్టిక్స్ ద్వారా 57 రకాల పరీక్షలు చేసే అవకాశం ఉన్నందున ఆ దిశగా చర్యలు తీసుకోవాలని సూచించారు. తెలంగాణ డయాగ్నోస్టిక్స్‌లోని వైద్య పరికరాల ద్వారా వంద శాతం కచ్చితమైన ఫలితాలొస్తాయని, మరింత వేగంగా పరీక్షలు నిర్వహించవచ్చునని చెప్పారు.
హెల్త్ ప్రొఫైల్ రూపకల్పనలో భాగంగా ప్రతి ఇంటికీ వెళ్లి ఆరోగ్య సమాచారం సేకరించాలని, అంతా పక్కాగా ఉండాలని ఆదేశించారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రతి వ్యక్తి ఆరోగ్య సమాచారమంతా క్లౌడ్‌స్టోరేజీలో వెంటనే లభించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. హెల్త్‌ప్రొఫైల్ సమాచారాన్ని పక్కాగా సేకరిస్తే ఎలాంటి వైద్యసేవలు, వైద్యనిపుణులు, మందులు, వైద్యపరికరాలు అవసరమో తెలుస్తుందని చెప్పారు. హెల్త్ ప్రొఫైల్ నిర్వహణ కోసం ప్రతి వ్యక్తి ఆరోగ్య సమాచారం, ఆధార్ నంబర్, డెమోగ్రాఫిక్ వివరాలు, షుగర్, బీపీ, ఇతర వ్యాధుల సమాచారం సేకరిస్తారు. దీనివల్ల వ్యక్తుల ఆరోగ్యానికి సంబంధించిన రిస్ అసెస్మెంట్, హైరిస్ వారిని గుర్తించడం, వైద్యసేవలు సత్వరమే అందించడం సులువు అవుతుంది. పరీక్షలు పూర్తయినవారి ఆరోగ్య సమాచారాన్ని డిజిటల్ రూపంలో క్లౌడ్‌స్టోరేజీలో భద్రపరుస్తారు.
త్వరలో మరో 13 డయాగ్నోస్టిక్ సెంటర్లు
---------------------------
మరో 13 జిల్లాల్లో త్వరలోనే తెలంగాణ డయాగ్నోస్టిక్ సెంటర్లు నెలకొల్పేందుకు ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ ప్రయత్నిస్తున్నది. వీటిని జయశంకర్ భూపాలపల్లి, కామారెడ్డి, మంచిర్యాల, మేడ్చల్ మల్కాజిగిరి, నాగర్‌కర్నూల్, నారాయణపేట, పెద్దపల్లి, రంగారెడ్డి, సూర్యాపేట, వనపర్తి, వరంగల్, హనుమకొండ, యాదాద్రి భువనగిరిలో డయాగ్నోస్టిక్ సెంటర్లు ఏర్పాటు చేయనున్నారు. రాష్ట్రంలో ఇప్పటికే 19 జిల్లాల్లో డయాగ్నోస్టిక్ సెంటర్లు ఏర్పాటుచేశారు. వాటి ద్వారా 57 రకాల వైద్య పరీక్షలు చేస్తున్నారు. మొదటి రెండు నెలల్లోనే 1,15,711 మందికి రూ.22 కోట్ల విలువైన రోగ నిర్ధారణ పరీక్షలు చేశారు. ఒక్కొక్క డయాగ్నస్టిక్ సెంటర్ ఏర్పాటు కోసం రూ. 2.5 కోట్ల వరకు ప్రభుత్వం ఖర్చు చేస్తున్నది. ఇందులో డయాబెటిక్ ప్రొఫైల్, హార్మోన్స్, లివర్ ఫంక్షన్ టెస్ట్, రీనల్ ఫంక్షన్ టెస్ట్, లిపిడ్ ప్రొఫైల్, సీబీపీ, మైక్రోబయాలజీ తదితర పరీక్షలు నిర్వహిస్తున్నారు. అన్ని జిల్లాల్లో సెంటర్ల ఏర్పాటు పూర్తయిన తర్వాత, ఎక్స్‌రే, సీటీస్కాన్, ఎంఆర్‌ఐ, అల్ట్రాసౌండ్ తదితర పరీక్షలను కూడా చేర్చనున్నట్టు అధికారులు తెలిపారు. కొవిడ్ వ్యాధిని నిర్ధారించే ఆర్టీపీసీఆర్ ల్యాబులు ప్రస్తుతం 25 జిల్లా కేంద్రాల్లో ఉన్నాయి. వీటికి అదనంగా జయశంకర్ భూపాలపల్లి, జోగులాంబ గద్వాల, ఆసిఫాబాద్, ములుగు, నాగర్‌కర్నూల్, రాజన్నసిరిసిల్ల, వరంగల్, నారాయణ్‌పేట్ జిల్లాల్లో మరో ఎనిమిది ఏర్పాటుచేయనున్నారు. ఇందుకు ప్రభుత్వం ఇప్పటికే రూ.10.61 కోట్లు మంజూరు చేసింది.