For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

Telangana News: దమ్ముంటే నాతో చర్చకు వస్తావా? కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి హరీశ్‌రావు సవాల్‌

05:16 PM Nov 12, 2021 IST | Sowmya
Updated At - 05:16 PM Nov 12, 2021 IST
telangana news  దమ్ముంటే నాతో చర్చకు వస్తావా  కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి హరీశ్‌రావు సవాల్‌
Advertisement

Telangana Politics: అబద్ధాలు దండి.. కిషన్‌ రెడ్డి తొండి: మంత్రి హరీశ్‌రావు

#కిషన్‌రెడ్డి_అబద్ధం:
ఎయిమ్స్‌కు పూర్తి స్థాయిలో స్థలం కూడా ఇవ్వలేదు.

Advertisement GKSC

#ఇదీఅసలునిజం:
దేశంలో ఎక్కడైనా.. ఎయిమ్స్‌కు స్థలం మాత్రమే ఇస్తారు. భవనాల నిర్మాణం కేంద్రం బాధ్యతే. కానీ తెలంగాణ ప్రభుత్వం నిమ్స్‌ దవాఖానకోసం కట్టిన భవనాన్ని రెడీమేడ్‌గా ఎయిమ్స్‌కు ఇచ్చింది.

#కిషన్‌రెడ్డి_అబద్ధం:
మెడికల్‌ కాలేజీల కోసం రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రయత్నమే లేదు.

#ఇదీఅసలునిజం:
• 2015 నుంచి 2019 దాకా అనేక లేఖలు రాసినం. అయినా యూపీకి 26 కాలేజీలు ఇచ్చిన కేంద్రం తెలంగాణకు ఒక్కటి కూడా ఇవ్వలేదు.
• బీజేపీ నాయకులు సిగ్గుతో తలదించుకోవాలి
• కేసీఆర్‌ కిట్‌లో కేంద్రం డబ్బులు చూపించాలంటే నోరు మెదపలేదు
• బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ ఇస్తామని ఇవ్వలేదు
• ఇంతవరకు గిరిజన యూనివర్సిటీ పై ఊసేలేదు
• స్థలాలు ఇప్పుడే చూపిస్తాం నవోదయ స్కూళ్లు ఇప్పిస్తారా?
• చిత్తశుద్ధి ఉంటే విభజన చట్టంలో ఇచ్చిన హామీలను సాధించాలి
• కాజీపేటలో కోచ్‌ఫ్యాక్టరీ ఏర్పాటు చేయించండి..
• వంటగ్యాస్‌ వ్యాట్‌పై సవాల్‌కు జవాబేది?
• ఎస్సీ వర్గీకరణ చేయాలని, బీసీ రిజర్వేషన్లు పెంచాలని, కేంద్రంలో బీసీ మంత్రిత్వశాఖను ఏర్పాటు చేయాలని, బీసీ జనగణన చేపట్టాలని రాష్ట్ర శాసనసభ ఏకగ్రీవంగా తీర్మానంచేసి కేంద్రానికి పంపింది. వీటిని సాధించి చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి.

• కిషన్‌రెడ్డికి మంత్రి హరీశ్‌రావు సవాల్‌

కేంద్ర క్యాబినెట్‌ మంత్రిగా ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉంటూ.. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాల్సిన కిషన్‌రెడ్డి.. అసత్యాలను ప్రచారం చేయడం తగదని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి టీ హరీశ్‌రావు అన్నారు. తెలంగాణ హక్కులను కాలరాస్తుంటే తాము చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. రాష్ర్టానికి సంబంధించిన పలు అంశాలపై కేంద్ర పర్యాటకశాఖ మంత్రి కిషన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మంత్రి హరీశ్‌ తీవ్రంగా స్పందించారు. గురువారం తెలంగాణ భవన్‌లో పార్టీ నేతలు ఎం శ్రీనివాస్‌రెడ్డి, ఎర్రోళ్ల శ్రీనివాస్‌, సోమ భరత్‌కుమార్‌తో కలిసి మీడియాతో మాట్లాడుతూ, కేంద్ర మంత్రిగా కిషన్‌రెడ్డి రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాలి కానీ.. ప్రజలను తప్పుదారి పట్టించేలా మాట్లాడటం దురదృష్టకరమన్నారు.

వైద్య కళాశాలల స్థాపన, ఎయిమ్స్‌ వంటి వాటి విషయంలో ఎలాంటి సమాచారం కావాలన్నా తానే స్వయంగా ఎలాంటి భేషజాలకు పోకుండా కిషన్‌రెడ్డిని కలిసి ఇస్తానని పేర్కొన్నారు. కిషన్‌రెడ్డి వ్యాఖ్యలన్నీ అబద్ధాలేనంటూ ఒక్కో అంశంపై ఆధారాలు బయటపెట్టారు. కిషన్‌రెడ్డి గతంలోనూ తెలంగాణ వాళ్లకు ఎర్రబస్సులు తప్ప ఏమీ తెలియవని ట్వీట్‌ చేసి తర్వాత నాలిక కరుచుకున్న విషయాన్ని గుర్తుచేశారు. సరైన సమాచారం ఇచ్చే మంచి టీమ్‌ను పెట్టుకోవాలని ఆయన కిషన్‌రెడ్డికి సలహా ఇచ్చారు.

కేంద్రం ఇవ్వకున్నా..
-----------------
కేంద్రప్రభుత్వం రాష్ర్టానికి ఒక్క మెడికల్‌ కాలేజీ కూడా ఇవ్వకుండా అన్యాయం చేసినా.. ముఖ్యమంత్రి కేసీఆర్‌ జిల్లాకో మెడికల్‌ కాలేజీని ఏర్పాటు చేయాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్నారని మంత్రి హరీశ్‌రావు వివరించారు. 1956 నుంచి 2014 వరకు రాష్ట్రంలో 5 వైద్య కళాశాలలు (ఉస్మానియా, గాంధీ, కాకతీయ, ఆదిలాబాద్‌, నిజామాబాద్‌ మెడికల్‌ కాలేజీలు) మాత్రమే ఉన్నాయని గుర్తుచేశారు.

సీఎం కేసీఆర్‌ దార్శనికతతో రాష్ట్రంలో మెడికల్‌ కాలేజీలు 5 నుంచి 21కి చేరబోతున్నాయన్నారు. మొదటి దశలో 4 (మహబూబ్‌నగర్‌, నల్లగొండ, సిద్దిపేట, సూర్యాపేట), రెండో దశలో 8 ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలు (మంచిర్యాల, రామగుండం, జగిత్యాల, వనపర్తి, నాగర్‌కర్నూల్‌, మహబూబాద్‌, కొత్తగూడెం, సంగారెడ్డి) ఏర్పాటు చేశామని తెలిపారు. మూడో దశలో మరో 4 మెడికల్‌ కాలేజీల (సిరిసిల్ల, కామారెడ్డి, భూపాలపల్లి, వికారాబాద్‌) స్థాపనకు సీఎం కేసీఆర్‌ క్లియరెన్స్‌ ఇచ్చారని వెల్లడించారు. మెడికల్‌ సీట్లు గణనీయంగా పెరిగాయని మంత్రి హరీశ్‌ చెప్పారు.

విభజన హామీలపై ఏదీ చిత్తశుద్ధి?
----------------------------
కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే విభజన చట్టంలో తెలంగాణకు ఇచ్చిన హామీలను సాధించాలని మంత్రి హరీశ్‌రావు డిమాండ్‌ చేశారు. ఎయిమ్స్‌ కాలేజీ సైతం విభజన హామీల్లో ఒకటని, కేంద్రం ప్రత్యేకంగా ఇచ్చిందేమీ లేదని చెప్పారు. అది రాష్ట్ర ప్రజల హక్కు అని స్పష్టంచేశారు.నిబద్ధత ఉంటే బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, గిరిజన వర్సిటీ, కాజీపేట కోచ్‌ఫ్యాక్టరీలను తీసుకురావాలని సవాలుచేశారు. కాజీపేటలో కోచ్‌ ఫ్యాక్టరీకి స్థలం ఇచ్చాక.. గుజరాత్‌లోని లాతూర్‌కు దాన్ని తరలించారని తెలిపారు.

జిల్లాకో నవోదయ పాఠశాల ఏర్పాటుచేయాలని పార్లమెంట్‌ చట్టం చేసిందని, దీని ప్రకారం రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో నవోదయలను ఏర్పాటుచేయాలన్నారు. నవోదయ పాఠశాలల కోసం స్థలాలనివ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. వీటిపై తప్పించుకుంటామంటే చూస్తూ ఊరుకోబోమని, తెలంగాణ ప్రజలు అమాయకులు కార ని హెచ్చరించారు. వీటన్నింటినీ సాధిస్తే తామే కిషన్‌రెడ్డిని అభినందిస్తామని, విమానాశ్రయానికి వచ్చి దండలు వేసి స్వాగతిస్తామని చెప్పారు.

వీటిని సాధించండి కిషన్‌రెడ్డి..
----------------------
ఎస్సీ వర్గీకరణచేయాలని, బీసీ రిజర్వేషన్లుపెంచాలని, కేంద్రంలో బీసీ మంత్రిత్వశాఖను ఏర్పాటు చేయాలని, బీసీ జనగణన చేపట్టాలని శాసనసభ తీర్మానంచేసి కేంద్రానికి పంపిందని హరీశ్‌రావు గుర్తుచేశారు. వీటిని సాధించి చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని కిషన్‌రెడ్డికి సవాల్‌ విసిరారు. బీజేపీ నేతలకు నిబద్ధత ఉంటే బీసీ జనగణన చేపట్టాలని డిమాండ్‌చేశారు. ఎన్సీడీసీ (నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌)ని హైదరాబాద్‌లో పెట్టాలని కేంద్రం నిర్ణయం తీసుకొన్నదని, ఐసీఎంఆర్‌కు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన 103 ఎకరాల స్థలంలో తమకు అనుకూలంగా ఉంటుందని, తమకు 3 ఎకరాల స్థలం కావాలని ఎన్సీడీసీ కోరిందని తెలిపారు.

వారికి మూడెకరాల స్థలం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ఐసీఎంఆర్‌కు లేఖ రాస్తే.. దానిపై ఇప్పటికీ స్పందన లేదన్నారు. కిషన్‌రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే ఆ స్థలాన్ని ఇప్పించాలన్నారు. ప్రస్తుతం ఎన్సీడీసీకి తాత్కాలిక భవనాలు కేటాయించామని, ఆ భవనాల్లో దాని కార్యకలాపాలు కొనసాగుతున్నాయని గుర్తుచేశారు. మూడెకరాలు ఇస్తే రాష్ర్టానికి ఒక జాతీయ సంస్థ వస్తుందని మంత్రి హరీశ్‌ అన్నారు.

ట్విట్టర్‌లో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పోస్టు..ఎయిమ్స్‌కు పూర్తి స్థాయిలో స్థలం కూడా ఇవ్వలేదు. మంత్రి హరీశ్‌ సమాధానం..

దేశంలో ఎక్కడైనా.. ఎయిమ్స్‌కు స్థలం మాత్రమే ఇస్తారు. ఆ స్థలాల్లో భవనాల నిర్మాణం కేంద్రం బాధ్యతే. కానీ తెలంగాణ ప్రభుత్వం నిమ్స్‌ దవాఖానకోసం కట్టిన భవనాన్ని రెడీమేడ్‌గా ఎయిమ్స్‌కు ఇచ్చింది. స్వయంగా సీఎం కేసీఆర్‌ జనవరి 20, 2015లో బీబీ నగర్‌ నిమ్స్‌ను సందర్శించి ఆ భవనాలతో సహా మొత్తం ఎయిమ్స్‌ కోసం ఇచ్చాం.

ఎయిమ్స్‌ కోసం కట్టిన భవనాన్ని ఇచ్చిన ఏకైక ప్రభుత్వం తెలంగాణే. మే 10, 2020న బీబీనగర్‌ తాసిల్దార్‌ కే వెంకట్‌రెడ్డి.. ఎయిమ్స్‌ డైరెక్టర్‌కు 201.24 (బీబీనగర్‌మండలం కొండమడుగు గ్రామంలో 49.25 ఎకరాలు, రంగాపూర్‌ గ్రామంలో 151.39 ఎకరాలు) ఎకరాల స్థలాన్ని అందజేశారు. ఈ స్థలాన్ని స్వాధీనం చేసుకున్నట్టుగా ఎయిమ్స్‌ డైరెక్టర్‌ సంతకం చేసిన ప్రతి ఇదీ. (ఆ ప్రతిని విలేకరులకు చూపించారు) ఈ విషయంలో కిషన్‌రెడ్డి బేషరతుగా క్షమాపణ చెప్పాలి.

కిషన్‌రెడ్డి ట్విట్టర్‌ పోస్టులో రెండో అబద్ధం..
----------------------------
మెడికల్‌ కాలేజీల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తున్నది. అసలు రాష్ట్ర ప్రభుత్వం తరఫున కేంద్ర అధికారులతో ఎవరైనా మాట్లాడారా? రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రయత్నమే లేదు.

మంత్రి హరీశ్‌రావు సమాధానం
----------------------------
జూన్‌ 21, 2015న అప్పటి రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి జిల్లా దవాఖానలను మెడికల్‌ కాలేజీలుగా అప్‌గ్రేడ్‌ చేయాలని అప్పటి కేంద్రమంత్రి నడ్డాకు లేఖ రాయడంతోపాటు స్వయంగా ఎంపీలను వెంటబెట్టుకొని కేంద్రమంత్రిని కలిశారు. దీనిపై కేంద్ర మంత్రి నవంబర్‌ 26, 2015న లక్ష్మారెడ్డి లేఖకు జవాబిస్తూ.. సెంట్రల్లీ స్పాన్సర్డ్‌ స్కీమ్‌ కింద కేంద్ర క్యాబినెట్‌ గుర్తించిన జాబితాలో రాష్ట్ర ప్రభుత్వం అభ్యర్థించిన దవాఖానలు లేవని, ఇప్పుడు తీసుకోవటం వీలుకాదని పేర్కొన్నారు. (కేంద్ర మంత్రి రాసిన లేఖను మీడియాకు చూపించారు)

ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా మరికొన్ని మెడికల్‌ కాలేజీలను ఏర్పాటు చేయబోతున్నదని తెలిస్తే ఆగస్టు 8, 2019 న అప్పటి కేంద్రమంత్రి హర్షవర్ధన్‌కు కరీంనగర్‌, ఖమ్మంలో మెడికల్‌ కాలేజీలు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. అంతేకాదు ఢిల్లీకి వెళ్లి మంత్రిని వ్యక్తిగతంగా కలిసి అభ్యర్థించాం. మా విజ్ఞప్తిపై స్పందించిన కేంద్ర మంత్రి.. ‘ఫేజ్‌ 1, ఫేజ్‌ 2లో అవకాశం లేదు.. ఫేజ్‌ 3 వచ్చినప్పుడు తెలంగాణ విన్నపాన్ని పరిశీలిస్తామని రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు (అందుకు సంబంధించిన లేఖను కూడా మంత్రి హరీశ్‌ మీడియాకు చూపించారు).

ఫేజ్‌ 3లో దేశవ్యాప్తంగా 157 మెడికల్‌ కాలేజీలు (ఉత్తరప్రదేశ్‌కు 26, రాజస్థాన్‌కు 23, మధ్యప్రదేశ్‌కు 12, పశ్చిమబెంగాల్‌కు 12, తమిళనాడుకు 11 ఈ విధంగా అన్ని రాష్ర్టాలకు మెడికల్‌ కాలేజీలు ఏర్పాటు చేసింది. అందులో తెలంగాణకు కేంద్రం మొండిచెయ్యి చూపించింది. కిషన్‌రెడ్డికి రాష్ట్రంపై నిజంగా ప్రేమ ఉంటే.. 10 మెడికల్‌ కాలేజీలు తీసుకురావాలి. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రం మీద సవతితల్లి ప్రేమను చూపుతున్నది, వైద్యకళాశాలలు ఇవ్వకపోవడం తెలంగాణ ప్రజలను చిన్నచూపు చూడటం కాదా? అవమానపరచటం కాదా?

కేసీఆర్‌ కిట్‌లో మీ పైసలా?
----------------------
కేసీఆర్‌ కిట్‌లో కేంద్ర ప్రభుత్వం రూ.5 వేలు ఇస్తున్నదని బీజేపీ నేతలు అనటం పచ్చి అబద్ధమని మంత్రి హరీశ్‌ స్పష్టంచేశారు. కేసీఆర్‌ కిట్‌లో కేంద్రం వాటా ఒక్క రూపాయి కూడా లేదని చెప్పారు. కేంద్రం డబ్బులిస్తున్నదని నిరూపించాలని తాము సవాలు విసిరితే ఒక్క బీజేపీ నేత కూడా నోరు మెదపలేదని అన్నారు. వంటగ్యాస్‌ సిలిండర్‌పైనా రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్‌ వేస్తున్నదని పచ్చి అబద్ధాలు ప్రచారంచేసిన బీజేపీ నేతలను బహిరంగ చర్చకు రావాలని సవాలు చేస్తే ఒక్కరు కూడా రాకుండా తప్పించుకొన్నారని.. పైగా బీజేపీ సోషల్‌ మీడియాలో రాష్ట్ర ప్రభుత్వం పన్ను ఉన్నదంటూ యథేచ్ఛగా తప్పుడుప్రచారం చేస్తున్నదని మండిపడ్డారు. ఒక అబద్ధాన్ని వందసార్లు చెప్తే ప్రజలు నిజమని నమ్ముతారని బీజేపీ నేతలు గోబెల్స్‌ ప్రచారం చేస్తున్నారని మంత్రి హరీశ్‌రావు దుయ్యబట్టారు.

Minister Harish Rao Powerfull Comments on BJP Kishan Reddy in Raithu Maha Dharna,Telangana Poltical News,TRS vs BJP,v9 news telugu,telugu golden tv,my mix entertainments,www.teluguworldnow.com

Advertisement
Author Image