మెట్రో మోతకు రెడీగా వుండండి...!!
టూ వీలరో, ఫోర్ వీలరో తీసుకుని రోడ్డు మీదకు వెళితే చాలు, ఎక్కడ గుంతలుంటాయో, ఎక్కడ ట్రాఫిక్ జామ్ అవుతుందోనని గుబులుగుబులుగా బయటకెళ్లేవారందరికీ ఎడారిలో ఓయాసిస్సులా తగిలింది మెట్రో ట్రైన్. కాకపోతే, జనాలంతా మెట్రోకి ఎగబడడంతో కాస్త రష్ ఎక్కువగానే వుంటున్న మాట వాస్తవమే అయినప్పటికీ ట్రాఫిక్ ఇబ్బందుల నుండి బోల్డంత ఉపశమనాన్నిస్తోంది. కంపెనీల్లో పెద్ద స్థాయిలో పనిచేసేవారు సైతం మెట్రో స్టేషన్ కి ఇల్లు దగ్గరలో గనక వుంటే ఎంచక్కా నడచుకుంటూ వచ్చి మెట్రో ఎక్కి గమ్య స్థానానికి చేరుకుంటున్నారు. ఉదయమైనా, సాయంత్రమైనా ట్రాఫిక్ టెన్షన్ లేకుండా గమ్యానికి చేరుకుంటున్నాం మనమంతా...!
అయితే, మెట్రో చార్జీలు పెరగబోతున్నాయి. ఐదేళ్ల క్రితం ప్రారంభమైనప్పటి నుంచి మెట్రో చార్జీల్లో మార్పులేదు. ప్రస్తుతం ఈ చార్జీలను సవరించాలని మెట్రో నిర్ణయించింది. చార్జీల సవరింపునకు ప్రజలు, ప్రయాణికులు ఇతర వర్గాల స్పందన ఎలా ఉంటుందో తెలుసుకునేందుకు ఓ కమిటీని కూడా రూపొందించింది. ఈ కమిటీ ప్రజల నుంచి అభిప్రాయాలను, సూచనలను, అభ్యంతరాలను స్వీకరించి మెట్రో చార్జీల పెంపుపై నివేదిక అందజేస్తుంది. అందులో సూచించిన అంశాల ఆధారంగా చార్జీల సవరణ చేపట్టాలని మెట్రో నిర్ణయించింది.
ప్రజాభిప్రాయ సేకరణకు ఫేర్ ఫిక్సేషన్ కమిటీ పెట్టిన గడువు ఈ నెల 15 తో ముగియనుంది. ఇందులో వెల్లడైన అభిప్రాయాల ఆధారంగా చార్జీల పెంపు ఏమేరకు ఉండాలనేది కమిటీ ప్రతిపాదించనుంది. కొత్త ఏడాది నుంచే పెరిగిన చార్జీలు అమలులోకి రావొచ్చని అధికారవర్గాల సమాచారం. సిటీలో ప్రస్తుతం ఎల్బీ నగర్ –మియాపూర్, రాయదుర్గం –నాగోల్, ఎంజీబీఎస్ –జేబీఎస్ మార్గాల్లో మెట్రో రైళ్లు పరుగులు తీస్తున్నాయి.
కరోనా లాక్ డౌన్, వైరస్ నియంత్రణ చర్యలలో భాగంగా మెట్రో సర్వీసులు కొంతకాలం నిలిచిపోయాయి. కరోనా ప్రభావం నుంచి నెమ్మదిగా కోలుకుంటున్న మెట్రో ఇప్పుడిప్పుడే పునర్ వైభవాన్ని సంతరించుకుంటోంది. ప్రయాణికుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. రోజూ లక్షలాది మందిని గమ్యం చేర్చే మెట్రోలో చార్జీల సవరణకు సమయం వచ్చిందని ఎల్ అండ్ టీ అధికారులు చెబుతున్నారు. అయితే, ఇంతగా ప్రజాదరణ పొందుతున్న మెట్రో ఇప్పుడు ప్రయాణ ఛార్జీలను పెంచాల్సిన అవసరం ఏముందని విమర్శిస్తున్నవారూ లేకపోలేదు.