రాచకొండ సిబ్బంది సంక్షేమానికి అధిక ప్రాధాన్యం : సిపీ సుధీర్ బాబు ఐపిఎస్
రాచకొండ కమిషనరేట్ కోపరేటివ్ క్రెడిట్ సొసైటీ రెండవ సర్వసభ్య సమావేశం-2024 ఈ రోజు నేరెడ్ మెట్ లోని కమిషనర్ కార్యాలయంలో నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో కమిషనర్ శ్రీ సుదీర్ బాబు ఐపిఎస్ గారు మాట్లాడుతూ, రాచకొండ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం అహర్నిశలు శ్రమిస్తున్న సిబ్బంది సంక్షేమం కోసం అవసరమైన అన్ని చర్యలూ తీసుకుంటున్నామని తెలిపారు. ఇందులో భాగంగా ప్రతి సంవత్సరం కోపరేటివ్ క్రెడిట్ సొసైటీ సర్వసభ్య సమావేశం నిర్వహించి వారి అవసరాలు తెలుసుకుంటూ వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ సంవత్సరం ఎజెండాలో పేర్కొన్న పలు అంశాలను పరిగణలోకి తీసుకుని వాటి అమలుకు ఆదేశాలు జారీ చేసినట్టు తెలిపారు.
ఉన్నతాధికారులకు మరియు సభ్యులకు మధ్య వారధిగా ఉంటూ సిబ్బంది సంక్షేమం కోసం పారదర్శకంగా విధులు నిర్వర్తించాలని సొసైటీ సిబ్బందికి సూచించారు. సొసైటీ సభ్యులు తమ అకౌంట్ సంబంధిత సమాచారాన్ని ఎప్పటికప్పుడు సులువుగా తెలుసుకునేలా వైకే ఇన్నోసాఫ్ట్ సంస్థ ద్వారా ఒక నూతన మొబైల్ ఆప్ అందుబాటులోకి తెస్తామని కమిషనర్ పేర్కొన్నారు.
ఈ ఏడాది సమావేశం ద్వారా అమలు కానున్న నూతన అంశాలను పరిశీలిస్తే… ఈ ఏడాది నుండి సభ్యుల మరణానంతరం అంత్య క్రియలకు అందించే డబ్బును యాభై వేల నుండి అరవై వేలకు పెంచడం జరిగింది. పదవీ విరమణ సమయంలో అందించే డబ్బును ముప్పై వేల నుండి నలభై వేలకు పెంచడం జరిగింది. సొసైటి సభ్యుల పిల్లలకు అందించే మెరిట్ స్కాలర్షిప్ లను విభాగాల వారీగా పెంచనున్నారు.
ప్రస్తుతం సొసైటీ ద్వారా మంజూరు చేస్తున్న లోన్ మీద వడ్డీని 9% నుంచి 8.4% కి తగ్గించనున్నారు. అన్ డిస్ట్రిబ్యూటెడ్ ప్రాఫిట్ అమౌంట్ రూ.3.91 కోట్ల రూపాయలలో సభ్యుల యొక్క షేర్ అమౌంటుపై లాభాలను 2021-22, 2022-23, 2023- 24 ఆర్థిక సంవత్సరాలకు సభ్యుల యొక్క త్రిఫ్ట్ అమౌంటుకు కలపడం జరుగుతుంది. ట్రిఫ్ట్ అమౌంట్ పైన గత సంవత్సరం వడ్డీ 7.5% ఇవ్వగా, ఈ 2023-24 ఆర్ధిక సంవత్సరానికి గాను 9% వడ్డీ ఇవ్వాలని నిర్ణయించడం జరిగింది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆడిటింగ్ పూర్తిచేయడం జరిగింది.
గరిష్టంగా 30 నెలల గడువులో తీర్చేలా 3 లక్షల ఎక్స్ ప్రెస్ లోన్ మంజూరు చేయడం జరుగుతుంది. బ్యాంక్ అకౌంట్స్ లో ఉన్న EBF (Employee Benevolent Fund) మరియు DRF (Death Relief Fund) ఫండ్స్ నుండి 80% వరకు సొసైటి సభ్యలకు లోన్ మంజూరు చేయడం కోసం ఉపయోగించనున్నారు.
ఈ సమావేశంలో సొసైటి వైస్ ప్రెసిడెంట్ డిసిపి అడ్మన్ ఇందిర, సొసైటి సెక్రెటరి ఎసిపి ఎస్బి శ్రీధర్ రెడ్డి, సొసైటి ట్రెజరర్ K. బాలరాజ్ మరియు డైరక్టర్లు జంగయ్య, రవిందర్ రెడ్డి, వలరాజు, మహిపాల్, సువర్ణ, లక్ష్మి ప్రసన్న, పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షులు సిహెచ్ భద్రా రెడ్డి, కృష్ణా రెడ్డి, ప్రసాద్ బాబు మరియు ఇతరుల సొసైటి సభ్యులు పాల్గొనడం జరిగింది.