For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

Lok Sabha Elections 2024 : టి. జీవన్ రెడ్డికి ఎంపీ టికెట్ లేదా ? మంత్రి పదవి లేదా ?

11:39 PM Mar 25, 2024 IST | Sowmya
UpdateAt: 11:39 PM Mar 25, 2024 IST
lok sabha elections 2024   టి  జీవన్ రెడ్డికి ఎంపీ టికెట్ లేదా   మంత్రి పదవి లేదా
Advertisement

Political Analysis by Manda Bhim Reddy

ఇప్పటికే నలుగురు రెడ్డీలకు టికెట్లు - ఖమ్మం, భువనగిరి, కరీంనగర్, నిజామాబాద్ లలో రెడ్డీలే ? - సామాజిక సమీకరణాలే టి. జీవన్ రెడ్డి టికెట్ కు అడ్డంకి  

Advertisement

2019 మార్చిలో నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్, కరీంనగర్ నాలుగు ఉమ్మడి జిల్లాల పరిధిలో గల పట్టభద్రుల శాసనమండలి నియోజకవర్గం నుంచి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా గెలిచిన టి. జీవన్ రెడ్డి గత ఐదు సంవత్సరాలుగా శాసన మండలిలో కాంగ్రెస్ పార్టీ గొంతుకగా ప్రజా సమస్యలపై పోరాడుతున్నాడు. కాంగ్రెస్ కష్టకాలంలో బీఆర్ఎస్, బీజేపీ లపై తనదైన శైలిలో విమర్శలు గుప్పిస్తూ కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్లారు. ఒక దశలో కాంగ్రెస్ అధిష్టానం టి. జీవన్ రెడ్డిని టీపీసీసీ అధ్యక్షుడిగా దాదాపుగా ప్రకటించే దశలో వాయిదా వేసి అనూహ్య పరిణామాలలో ఏ. రేవంత్ రెడ్డిని నియమించారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో జగిత్యాలలో ఓడిపోవడంతో ప్రభుత్వంలో మంత్రి పదవి చేపట్టే అవకాశం కోల్పోయారు జీవన్ రెడ్డి.

తెలంగాణ ఉద్యమం ఉధృతంగా ఉన్న సమయంలో కరీంనగర్ లోక్ సభ స్థానంలో కేసీఆర్ పై పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిపోయిన టి. జీవన్ రెడ్డికి ఉత్తర తెలంగాణతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా మంచి ఫాలోయింగ్ ఉన్న విషయాన్ని కాంగ్రెస్ అధిష్టానం గుర్తించింది. రైతులు, నిరుద్యోగులు, గల్ఫ్ కార్మికుల సమస్యలపై ఇతర అన్ని అంశాలపై మంచి పట్టు ఉన్న జీవన్ రెడ్డి కి పెద్ద ఎత్తున అభిమానులున్నారు. నిజామాబాద్, కరీంనగర్ లలో ఏదో ఒక స్థానం నుంచి జీవన్ రెడ్డిని బరిలోకి దించాలని ఏఐసీసీ భావించింది. చివరికి నిజామాబాద్ నుంచి పోటీ చేయించాలని నిర్ణయించారు. ఇప్పటి వరకు రెండు లిస్టులలో తొమ్మిది స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసిన అధిష్టానం నిజామాబాద్ ను ఎందుకు పెండింగ్ లో ఉంచారో సర్వత్రా ఆసక్తి నెలకొంది. టీపీసీసీ అధ్యక్షుడిగా ప్రకటిస్తారని అనుకున్న స్థాయి నుంచి ఎంపీ టికెట్ కూడా దక్కని పరిస్థితికి నెట్టివేయడం జీవన్ రెడ్డి అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.

మూడు బీజేపీ సిట్టింగ్ సీట్లలో పెండింగ్ లో కాంగ్రెస్ టికెట్లు 

ఉత్తర తెలంగాణలోని నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ పార్లమెంటు స్థానాల్లో ప్రస్తుతం బీజేపీ ఎంపీలు ఉన్నారు. సరిగ్గా ఈ మూడు స్థానాలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించకుండా పెండింగ్ లో ఉంచడం విశేషం. నిజామాబాద్ నుంచి కాంగ్రెస్ టికెట్ రేసులో ఎమ్మెల్సీ టి. జీవన్ రెడ్డి ముందున్నారు. సామాజిక సమీకరణాలు, ఆర్థిక స్తోమత దృష్ట్యా జీవన్ రెడ్డికి టికెట్ ఇవ్వకపోతే రాష్ట్ర మంత్రివర్గంలో చోటు కల్పిస్తారని తెలుస్తున్నది. 29 మార్చి 2025 వరకు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పదవీ కాలం ఉన్నందున మంత్రి పదవి ఇవ్వడంలో సాంకేతిక అవరోధం ఉండదు. ఎమ్మెల్సీ లకు కూడా ఒకటో, రెండో మంత్రి పదవులు ఇవ్వడం ఆనవాయితీ కూడా.

నిజామాబాద్ లో ధర్మపురి అరవింద్ (బీజేపీ), బాజిరెడ్డి గోవర్ధన్ (బీఆర్ఎస్) లు తమ అభ్యర్థులుగా ఇప్పటికే ఆయా పార్టీలు ప్రకటించాయి. వీరు ఇద్దరూ మున్నూరు కాపు బీసీ సామాజిక వర్గానికి చెందినవారు. కాంగ్రెస్ అభ్యర్థిగా ఎమ్మెల్సీ టి. జీవన్ రెడ్డితో పాటు ముత్యాల సునీల్ రెడ్డిల పేర్లు పరిశీలనలో ఉన్నాయి. వీరు ఇద్దరు కూడా గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. మాజీ ఎమ్మెల్యే ఈరవత్రి అనిల్ పేరు పరిశీలనలో ఉన్నప్పటికీ ఇటీవల కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇవ్వడంతో అతను పోటీ నుంచి తప్పుకున్నట్లే. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ బి. మహేష్ కుమార్ గౌడ్, వైద్యురాలు డా. కవితా రెడ్డి, మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత ల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన బీఆర్ఎస్ నేత ఎమ్మెల్సీ ఎల్. రమణ ను కాంగ్రెస్ లోకి ఆహ్వానించి టికెట్ ఇవ్వాలనే ఆలోచన ఉన్నట్లు తెలుస్తున్నది. ఎల్. రమణ ఎమ్మెల్యే గా, రాష్ట్ర మంత్రిగా, ఎంపీగా ఈ ప్రాంత ప్రజలకు సుపరిచితులు.

తెలంగాణ రాష్ట్రంలో 17 లోక్ సభ స్థానాలలో 3 ఎస్సీ, 2 ఎస్టీలకు రిజర్వ్. ఎంఐఎం కంచుకోట అయిన హైదరాబాద్ ను మినహాయిస్తే  జనరల్ క్యాటగిరీ లో మిగిలినవి 11 సీట్లు. కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయం పాటించడం కోసం బీసీలకు ప్రాధాన్యం ఇవ్వాలని యోచిస్తోంది. కాంగ్రెస్ ఇప్పటి వరకు ప్రకటించిన తొమ్మిది సీట్లలో చల్లా వంశీచంద్ రెడ్డి (మహబూబ్ నగర్), కుందూరు రఘువీర్ రెడ్డి (నల్గొండ), డా. జి. రంజిత్ రెడ్డి (చేవెళ్ల), పట్నం సునీతా మహేందర్ రెడ్డి (మల్కాజిగిరి) నలుగురు రెడ్డీలకు టికెట్లు ఇచ్చింది. బలరాం నాయక్ (మహబూబాబాద్ - ఎస్టీ), డా. మల్లు రవి (నాగర్ కర్నూల్ - ఎస్సీ), గడ్డం వంశీ కృష్ణ (పెద్దపల్లి - ఎస్సీ),  బీసీ అభ్యర్థులు సురేష్ కుమార్ షెట్కార్ (జహీరాబాద్), దానం నాగేందర్ (సికింద్రాబాద్) లకు టికెట్లు ప్రకటించారు. ఆదిలాబాద్ (ఎస్టీ), వరంగల్ (ఎస్సీ), హైదరాబాద్, ఖమ్మం, భువనగిరి, మెదక్, కరీంనగర్, నిజామాబాద్ ఎనిమిది సీట్లకు కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించాల్సి ఉన్నది.

Advertisement
Tags :
Author Image