ఉత్తమ తెలుగు జర్నలిస్టులకు ఉగాది పురస్కారాలకు గడువు ఏప్రియల్ 5
హైదరాబాద్/అమరావతి : ఉత్తమ తెలుగు జర్నలిస్టులకు ఉగాది పురస్కారాలు కు దరఖాస్తు చేసుకునేందుకు ఈనెల 30వరకు ఉన్న గడువును ఏప్రియల్ 5వరకు పెంచారు. ఈ మేరకు తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు మేడవరపు రంగనాయకులు, తెలంగాణ జర్నలిస్టుల సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు అనంచిన్ని వెంకటేశ్వరరావు సంయుక్త ప్రకటనలో తెలిపారు. సమాజాన్ని చైతన్య పరిచే, బృహత్తర బాధ్యతను నిర్వర్తిస్తున్న పాత్రికేయులను 2024లో "ఉత్తమ తెలుగు జర్నలిస్టులకు ఉగాది పురస్కారాలు" ద్వారా సత్కరించి, గౌరవించాలని "తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం, తెలంగాణ జర్నలిస్టుల సంక్షేమ సంఘం" సంయుక్తంగా నిర్ణయించడం జరిగిందని ఆ సంఘాల వ్యవస్థాపక అధ్యక్షులు మేడవరపు రంగనాయకులు, అనంచిన్ని వెంకటేశ్వర రావు వెల్లడించారు.
అక్షరాన్నే నమ్ముకుని ఎన్నో ఏళ్లుగా పాత్రికేయ వృత్తిలో కొనసాగుతున్న వారికి ఈ పురస్కారాల ప్రోత్సాహం ఎంతగానో ఉత్తేజాన్నిస్తుందని, మరింత మంది అర్హులకు అవకాశం ఇవ్వాలని దరఖాస్తులకు గడువు పెంచినట్లు తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాల లోని జర్నలిస్టులు ప్రకటించిన 31 మీడియా విభాగాల్లో తమ అర్హతలను పరిశీలించుకుని దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఎన్నికల సమయంలోనూ వందల సంఖ్యలో దరఖాస్తులు రావడం పట్ల వారు సంతోషం వ్యక్తం చేశారు.
మహిళా జర్నలిస్టులు కూడా పలు విభాగాల్లో ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నారని, ఎక్కువ మొత్తంలో దరఖాస్తులు రావడంతో గతంలో ప్రకటించిన వాటితో పాటు వారికి మరో 5 పురస్కారాలు అదనంగా ఇవ్వనున్నట్లు వివరించారు. మహిళా జర్నలిస్టులను ప్రోత్సహించేందుకు ఇది ఎంతగానో ఉపకరిస్తుందన్నారు. ఉగాది పండుగ సందర్భంగా పురస్కార గ్రహీతల వివరాలు ప్రకటిస్తామని, త్వరలోనే పురస్కార ప్రధానోత్సవ కార్యక్రమం హైదరాబాద్ నగరంలో అత్యంత వైభవంగా నిర్వహిస్తామని మేడవరపు రంగనాయకులు, అనంచిన్ని వెంకటేశ్వరరావు తెలిపారు.