ఐయోడిన్ లోపం కారణంగా తెలివితేటలు తగ్గే ప్రమాదం: Health Tips
ఐయోడిన్ లోప రుగ్మతలు లేదా IDD లు ప్రపంచంలోని పలు దేశాలల్లో మనకు కనిపిస్తాయి. వీటిపై ప్రజలలో అవగాహన కలిపించి ఐయోడిన్ యొక్క ప్రాముఖ్యతను వివరిస్తూ, ఐయోడిన్ ఎలా దొరుకుతుంది, దానిని ఎందుకు ఆహారంలో కలుపుకోవాలి, దానిపై ఉన్న సందేహాలు వంటి వాటిపై అవగాహన కలిపించడానికి ఏటా 21 అక్టోబర్ నాడు ప్రపంచ ఐయోడిన్ లోప దినంగా పాటిస్తున్నారు. ఐయోడిన్ అనేది మానవుని శారీరక, మానసిక ఎదుగుదలకు, అభివృద్దికి అవసరమైన ఎంతో కీలకమైన సూక్ష్మ పోషకం. ప్రతి రోజూ మన తీసుకొనే ఆహారంలో 110-150 మైక్రో గ్రాముల ఐయోడిన్ ఖచ్చితంగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
ఐయోడిన్ లోపం కారణంగా చిన్న పిల్లలలో అతి తక్కువ తెలివితేటల సూచి ఉండడంతో పాటూ పెద్ద వారిలో విచక్షణతో కూడిన ఆలోచన శక్తి తగ్గి పని చేసే సామర్థ్యం తగ్గుతుంది.
దీంతో పాటూ ప్రతి రోజూ మనం తీసుకొనే ఐయోడిన్ 50 మైక్రో గ్రాముల కన్నా తక్కువగా ఉంటే అది గోయిత్రే (Goitre) అనబడే రుగ్మత కారణంగా మెడలో ఉండే థైరాయిడ్ గ్రంథులలో వాపు చూడవచ్చు. దీంతో పాటూ క్రిటెనిజం (తక్కువ ఎదుగుదల), అలసట, తక్కువ స్థాయిలో జీవ క్రియ, ఆందోళన, గర్భంలో ఉన్న బిడ్డలో మానసిక లోపాలు తలెత్తడం వంటివి ఐయోడిన్ లోపం కారణంగా ఏర్పడే ప్రధాన రుగ్మతలు.
ఇక గర్భధారణ మరియు బిడ్డలకు పాలు పట్టే సమయంలో అవసరమైనంత థైరాయిడ్ హార్మోనులు ఉత్పత్తి కావడానికి సరైన మోతాదులో ఐయోడిన్ అవసరం. ఎందుకంటే ఇవి గర్భస్థ పిండం ఎదుగుదలకు మరియు మెదడు అభివృద్దికి కీలకం కాబట్టి.
పేదరికం, పోష్టికాహార లేమి, పేదరికం కారణంగా దొరికిన ఆహారం తీసుకొనే సందర్భాలలో గోఇట్రోజన్స్ ఎక్కువగా తీసుకోవడం (ముఖ్యంగా క్యాబేజీ, కాలీ ఫ్లవర్, బ్రోకోలి, ముల్లంగి వంటి వాటిలో గోఇట్రోజన్స్ ఎక్కవగా ఉంటుంది), కాలుష్యపు నీరు కారణంగా మనం తీసుకొనే ఆహారంలో ఉండే ఐయోడిన్ ను పేగుల ద్వారా గ్రహించబడి శరీరంలోనికి వెళ్లనీయకుండా అడ్డుకొనే ప్రమాదం ఉంటుంది.
ఐయోడిన్ లభించే పదార్థములు
తినే ఉప్పులో ఐయోడిన్ కలపడమనేది అత్యంత తక్కువ ఖర్చుతో సమర్థవంతంగా ఐయోడిన్ అందించే ప్రక్రియ. అయితే ఇలా ఉప్పు ద్వారా లభించే ఐయోడిన్ లో 30 శాతం వండేటపుడు కోల్పోయినా మిగిలిన 70 శాతం సమర్థవంతంగా శరీరానికి అందుతుంది. అయితే ఇలా కోల్పోయే ఐయోడిన్ యొక్క శాతం మనం వండే పదార్థాలు, వండే పద్దతులను బట్టి ఉంటుంది. ఇలా ఐయోడిన్ కోల్పోకుండా ఐయోడిన్ కలిపిన ఉప్పును ఆహార పదార్థాలు వండే సందర్భంలో కాకుండా వండిన తర్వాత దాంట్లో కలపడం ద్వారా చూడవచ్చు.
పాల పదార్థములలో కూడా ఐయోడిన్ ఉంటుంది. ఐయోడిన్ కలిపిన పాలు, యోగర్టు, ఛీజ్ వంటి వాటి ద్వారా కూడా లభిస్తుంది.
సముద్రపు నీటిలో ప్రతి లీటర్ కు 0.2 మిల్లీ గ్రాముల ఐయోడిన్ ఉంటుంది. అందుకే చేపలు (కోడ్ మరియు ట్యూనా లాంటివి), సీ వీడ్ అంటే సముద్రపు పాచి, రొయ్యలతో పాటూ ఇతర సముద్రపు ఆహారం లో ఐయోడిన్ ఎక్కవగా లభిస్తుంది.
ఐయోడిన్ లోప రుగ్మతలను అరికట్టడం
మానవ శరీరం తనంతట తాను ఐయోడిన్ ఉత్పత్తి చేసుకోదు. శరీరానికి కావల్సిన 60 నుంచి 70 శాతం ఐయోడిన్ మనం తీసుకొనే ఆహారం మరియు నీటి ద్వారా దొరుకుతుంది. అందుకే ఐయోడిన్ లోప రుగ్మతలను అరికట్టడానికి మనం తీసుకొనే ఆహారం మరియు నీటి కి ఐయోడిన్ జోడిస్తారు. ఇందులో భాగంగానే సర్వసాధారణంగా మనం ఆహారంలో కలిపే ఉప్పులో ఐయోడిన్ కలపడం జరుగుతుంది.
చివరగా డైటీషియన్ గా నా సూచన –
మీరు తీసుకొనే ఆహారంలో అర చెంచా (మూడు గ్రాములు) ఐయోడైజ్డ్ సాల్ట్ అంటే ఐయోడిన్ కలుపబడిన ఉప్పును తీసుకొంటే అది మీ రోజు వారి ఐయోడిన్ అవసరాలను పూర్తి చేస్తుంది. అంటే మనం తీసుకొనే ఒక గ్లాసు మజ్జిగ (200 ML) లో ఒక అర చెంచా ఐయోడిన్ ఉప్పు కలుపుకుంటే సులువుగా ఈ పని పూర్తవుతుంది.
Article is written by V. Krishna Deepika, Clinical Dietician, Apollo Spectra Hospitals, Kondapur, Hyderabad.